ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తెలిపారు. తెలంగాణ వస్తుందేమోనని కొందరు భయపడుతున్నారని, అలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు నిజమైన నివాళి అర్పిస్తామని చెప్పారు.
తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ., తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ జిల్లాకు జయశంకర్ పేరు పెడుతామన్నారు. జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడుతామన్నారు.
తెలంగాణ రాష్ట్రం త్వరలో రాబోతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చేవరకు విశ్రమించబోమని, ఏం చేసైనా తెలంగాణ తెచ్చుకోవాలని జయశంకర్ అంటుండేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యమం ఎంత గట్టిగా ఉంటే అంత త్వరగా తెలంగాణ వస్తుందని ఆయన వెల్లడించారు.