NEWS

Blogger Widgets

15.8.12

వందేమాతరం - ఒక చిన్న మాట

 

వందేమాతరం , మన స్వతంత్ర భారతావనిలో 65 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్నో రంగాల్లో మన దేశ పురోగతి గురించి చెప్పుకుంటున్న ఈ తరుణం లో ఈ విశ్లేషణ అత్యవసరం....


మనం ఎన్నో ఏళ్ళు పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ పరాయి పాలనలో మనం కోల్పోయినదాని కంటే ఆ తర్వాత మనం నష్టపోయిందే ఎక్కువని గ్రహించాలి. మనం ఎప్పుడూ నిందించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక విషయాన్ని డీల్ చేసేందుకు మనం ఆ విషయం గురించి తెలియని వాళ్ళకే అధికారం ఇస్తాము. అధికారం లో ఉన్నవాడికి తన అధికారంతో పాటు అవగాహన కూడా ఉండాలి అన్న ప్రాధమిక విషయం మరచిపోతాం. 
వృత్తి పనిలో నైపుణ్యం లేనివారికి మనం చిన్న పని కూడా అప్పగించలేము. అలాంటిది మన దేశ పరిపాలనా బాద్యత అవగాహన లేని పాలకులకి ఎలా అప్పగిస్తున్నాం? ప్రతి చిన్న ఉద్యోగానికి కూడా అనుభవం ఉన్నవారినే ఎంచుకోవడం జరుగుతుంది. అలాంటిది వారి శాఖలలో ఎటువంటి అనుభవం లేని వారిని కాబినెట్ మంత్రులుగా ఏ ప్రాతిపదికన నియమిస్తున్నారో అధికార పక్షంలో ఉన్నవారికే తెలియాలి.

అలాగే మనం ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాన్ని నిందిస్తాం. వారికీ ఆ పదవులు కట్టబెట్టింది మనం వేసిన ఓటేనని మనం గ్రహించాలి. అలా పనికిరాని ప్రభుత్వాన్ని నిర్మించేందుకు మన ఓటు కారణం అయినందుకు సిగ్గు పడాలి. అదేవిధంగా మనలో చాలామంది తమకు తెలియని విషయాలను మాట్లాడడానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కానీ వాళ్ళకు తెలిసిన పనిని మాత్రం సరిగా చేస్తారని అనుకోవడం మన అవివేకం. మన రాజకీయ నాయకులనే తీసుకుందాం. వారికీ అనవసరమైన విషయం అంటూ ఉండదు. ప్రజా సమస్యలు పట్టించుకోవడం కంటే ఎక్కువగా వారి రాజకీయ అవసరాల కోసమే ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. 

ఈ రోజున యువత కూడా పెడదారి పడుతోందని, పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతోందని బాధపడుతున్నారు. కానీ వారిని అలా ఆలోచించేలా చేసింది మాత్రం ముందు తరాల వాళ్ళే. ఒక తండ్రి తన బిడ్డకి మంచిగా ఎలా ఉండాలో చెప్పే రోజులు పోయాయి. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయో అనే ఆవేదనే ఎక్కువగా కనిపిస్తుంది, ఇంగ్లీషు మీడియంలో చదువులు చెప్పించడం అంటే వారికి ప్రపంచ జ్ఞానం నేర్పేదిగా ఉండాలి, కానీ ఈ రోజున ఇంగ్లీషు మీడియం చదువు అంటే తెలుగును మరిచిపొమ్మని చెప్పేదే. వాళ్ళ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడాలనుకోవడం తప్పు కాదు. కానీ తెలుగులో మాట్లాడితేనే తప్పు అనే విద్యా వ్యవస్థని ఖండించకపోవడం వారు చేస్తున్న నేరం. 

పబ్ కల్చర్ అని ఈ రోజున యువత పక్కదారి పడుతుందంటే దానికి కారణం వారికీ తల్లిదండ్రులపై ఉండాల్సిన భక్తీ, భయం లేకపోవడమే. అదే భక్తీ ఉండటం వల్ల వారికీ కలిగే నష్టం ఏమి ఉండదు. పైపెచ్చు పిల్లల కోరికలను మన్నించడం అనేది వారికీ అపరిమిత స్వేచ్ఛ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. తెలిసీతెలియని వయసులో వారిని కంట్రోల్ చేసే శక్తి ఏదో ఒకటి ఉండాలి. కానీ ఈ రోజున అది కరువైందని చెప్పవచ్చు. 

మనం చిన్నప్పటినుంచి పుస్తకాల్లో చదువుకుంటున్నాం, వింటున్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. కానీ మనది అభివృద్ధి చెందుతున్న దేశం అయితే మనకి స్వయంప్రతిపత్తి ఉండాలి. కానీ ఈ రోజుకీ మన రూపాయి ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకులతో సతమతమవుతున్నది. మనకి ఉండల్సినాన్ని వనరులు ఉన్నా, ఇప్పటికీ ఒక్క విషయం లో కూడా మనమే నెం.1 అని చెప్పుకునేది ఏది లేదు. 

గుజరాత్ లో కాలువలకి సోలార్ ఎనర్జీ తయారయ్యేలా మలచారు అనేది మనం ఇప్పుడు వింతగా వింటున్నాం. కానీ ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. మన కంటే చిన్న దేశాలు కూడా కొత్త టెక్నోలజి అభివృద్ధి చేస్కుంటున్నాయి. మనకి చెప్పుకునేందుకు ఎన్నో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేస్కోగల  శ్రామిక శక్తీ ఉంది. కానీ మనలో ఉన్న 'నా అనేది మనల్ని ఇంకా దిగజార్చేస్తుంది.

నా అనేది అన్ని అనర్ధాలకు మూలం. 'నా' అనుకున్న వాడు వాడికి మాత్రమే కాదు మొత్తం దేశానికే చేటు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి, తన కులం, మతం, జాతి అని ఒకడికి ఒటువేసి పదవి కట్టబెడితే, ఈ సమాజానికి మేలు ఎలా జరుగుతుంది? ఆ పదవికి అర్హత ఉన్నవాడిని నిలబెడితే వాడు మొత్తం సమాజానికి పనికి వస్తాడు. ఎన్నో 'నా'లు కలిస్తేనే సమాజం. అలంటి మనం సమాజం కోసం మనం ఎందుకు ఆలోచించం?

మన వేదాలు, సంస్కృతి ఎంతో గొప్పవి. సర్వమత సౌభ్రాతృత్వం మన సొంతం. కానీ ఈ రోజున మనలో చాల మంది తమ వర్గం, కులం, మతం అని వేరు చేస్కుని బ్రతుకుతున్నారు. మన మతాన్ని గౌరవించడం అంటే వేరే మతాలని దూషించడం వేరిచేసి చూడడం కాదు. ఇవే అడ్డుగోడల్ని మనతో పాటు మన తర్వాత తరాలవారు కూడా భరించడం అనేది శోచనీయం. విదేశాలలో ఉన్న మనవారు అక్కడకూడా ఇవే అడ్డుగోడల వల్ల బాధపడడం మనకి హర్షనీయమా?

ప్రాంతీయవాదం ఈ మధ్య వినిపిస్తున్న కొత్త నినాదం. నిజానికి కొత్త రాష్ట్రం ఇవ్వడం వల్ల రాజకీయ నాయకులకు తప్ప ఇంకెవరికి పనికిరాని విషయం. ఈ నిజం అందరు గ్రహించాలి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల వల్ల ఇటువంటి పరిణామాలు జరుగుతాయి. కానీ వాటి వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏమిటి, నష్టాలేమిటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదీ. 40రోజులపాటు సకల జనుల సమ్మె అని చేయడం వల్ల బాధపడింది సామాన్య ప్రజానీకమే.

ఈ రోజున కరెంటు కష్టాలు అని బాధపడుతున్నాం, కానీ ఇది మనం చేస్కున్న ఖర్మ ఫలమే. ఉన్న నదులని సరిగా ఉపయోగించుకుంటే ఎంత పంటభూమి అందుబాటులోకి వచ్చేది? ఇంతగా కరెంటుకు అర్రులు చాచాల్సిన అగత్యం వచ్చేదా? మన దగ్గర ఉన్న నిల్వలను సరిగా వాడుకుంటే వేరే దేశాలపై ఆధార పడాల్సిన స్థితి వచ్చేదా? మన రూపాయి ప్రతి చిన్న విషయానికీ ఊగిసలాడేదా? 

ఇప్పటికైనా మేల్కొందాం. ఒక్క సరిగా దేశాన్నంతటినీ మార్చేయడం ఎవర వల్లా కాదు. కానీ వ్యతి మారితే వ్యవస్థ మారుతుందని పెద్దలు చెప్పిన సత్యాన్ని పాటిద్దాం. 'నా' అనే జాడ్యాన్ని మనం మన భావి తరాల కోసమైనా వదులుకుందాం. 65 ఏళ్ళుగా ఎప్పుడూ అనుకునేది కనీసం ఈ రోజునుంచి అయినా సాధిద్దాం. భారతీయుడు అంటే ప్రపంచానికి ఉన్న చిన్న చూపును చేరిపేద్దాం. అవినీతి, లంచగొండితనం, దగాకోరు రాజకీయాలకు అడ్డుకట్ట వేద్దాం. 

BE AN INDIAN- Let the future generations feel proud of it. 

JAI HIND