Posted June 23rd, 2012, 10:55 AM IST
ప్రముఖ దర్శకుడు శంకర్ త్వరలో విక్రమ్ కథానాయకుడిగా ఓ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత కథానాయిక. ఆస్కార్ రవిచంద్రన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న చిత్రానికి తమిళంలో ‘ఐ' అనే టైటిల్‌ని ఖారారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మళయాల హీరో సురేష్ గొపీ, తమిళ నటుడు ప్రభు సోదరుడు రామ్‌కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్రీ ఇడియట్స్ చిత్రాన్ని రీమేక్ చేసిన శంకర్ అబాసు పాలైన విషయం తెలిసిందే. విక్రమ్‌కు గత కొంతకాలంగా హిట్ దక్కలేదు. దీంతో ఈ సినిమాపై ఇద్దరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు. గతంలో శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో అపరిచితుడు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్‌గా సూపర్‌హిట్ కొట్టింది. ఇప్పుడదే స్పూర్తితో మరో అద్భుతమైన కథతో శంకర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇది ఆయన శంకర్‌తో పనిచేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.
‘మెన్ ఇన్ బ్లాక్ ' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ఓ పాటని రికార్డు చేశారని తెలుస్తోంది. శంకర్ గత చిత్రాల స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా జూలై 15 నుంచి సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది.