NEWS

Blogger Widgets

28.6.12

నా వల్లే గెలిచామని చెప్పలేదు


రామచంద్రపురం, నరసాపురంలలో విజయంపై చిరంజీవి వెల్లడి
6/28/2012 1:44:00 AM
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తానే కారణమని ఎప్పుడూ చెప్పలేదని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చెప్పారు. అందరమూ కలసికట్టుగా పనిచేసి ఆ రెండు స్థానాల్లో విజయం సాధించామని, ఇలాగే సమన్వయంతో పని చేయాలని అన్నానని, తన వ్యాఖ్యలను మీడియా పూర్తిగా వక్రీకరించిందని అన్నారు. విజయం నాదే అన్నట్లుగా మీడియా చెప్పడం భావ్యం కాదని అన్నారు. ఉప ఎన్నికల అనంతరం తొలిసారిగా బుధవారం ఢిల్లీకి వచ్చిన చిరంజీవి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ...

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం, రెండు స్థానాల్లో విజయానికి కారణాలపై మేడమ్‌తో చర్చించాను. సానుభూతి అంశం వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా, కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారిందని చెప్పాను. పార్టీని బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో చర్చించాం. తిరుపతి అభ్యర్థి విషయంలో అందరమూ కలిసి మాట్లాడుకున్నాకే ఏకాభిప్రాయానికి వచ్చాం’’ అని చెప్పారు. 2014లో చిరంజీవి సీఎం అంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ఆయన వ్యాఖ్యల్లో నేను అంతులేని అభిమానాన్నే చూస్తున్నాను తప్పితే, పదాల అర్థాలను చూడటంలేదు’’ అని అన్నారు. తనను వ్యక్తిగతంగా ఎవరూ టార్గెట్ చేయడంలేదని, 2014 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరమూ కలసి పనిచేస్తున్నామని తెలిపారు.

కేంద్ర మంత్రి పదవి విషయం ఇప్పుడూ, ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు. తానెప్పుడూ పదవులు కోరలేదని, వారు ఏ పదవి ఇచ్చినా పనిచేస్తానని తెలిపారు. పార్టీలో సాధారణ కార్యకర్తగానూ పనిచేసేందుకు సిద్ధమన్నారు. పార్టీలో కొంత సమన్వయ లోపం ఉందని చెప్పారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎలా సమన్వయం చేయాలన్న విషయంపై సోనియా కార్యాచరణ ప్రకటిస్తారని, దాన్ని తామంతా పాటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని భావించడంలేదని, మనుషులను మార్చే ప్రయత్నాలు చేస్తారనుకోవడంలేదని అన్నారు.

పీఆర్పీ క్యాడర్‌కు పదవులు ఇవ్వాలని తాము ప్రత్యేకంగా కోరడంలేదని చెప్పారు. అయితే క్యాడర్‌కు మంచి బాధ్యతలు అప్పగించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో కీలకంగా ఎదిగేందుకు గ్రూపులు కడుతున్నారన్న సమాచారం వాస్తవమేనా అని ప్రశ్నించగా.. అది ఎంతమాత్రం వాస్తవం కాదని చెప్పారు. ప్రభుత్వంలో అవినీతి పెరిగినందునే పార్టీ ఓడిందని భావిస్తున్నారా అని అడగ్గా.. ప్రభుత్వంపై వస్తున్నవన్నీ అభియోగాలు మాత్రమేనని, అవి ఎక్కడా నిరూపణ కాలేదని జవాబిచ్చారు.