హైదరాబాద్, న్యూస్‌లైన్: కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బీపీ ఆచార్యల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 18 వరకు పొడిగించింది. వీరిద్దరి రిమాండ్ ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు ఎదుట హాజరుపర్చారు......
జగతి పబ్లికేషన్స్ తరపున కంపెనీ సెక్రటరీ కార్తీక్ కోర్టు విచారణకు హాజరుకావడంపై సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసులో కార్తీక్ సాక్షిగా ఉన్నారని, ఆయన నిందితునిగా హాజరుకావడమే తమ అభ్యంతరమని చెప్పారు. సీబీఐ అభ్యంతరాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. అంతకుముందు మొదటి చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, హెటిరో డ్రగ్స్ డెరైక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ పూర్వ ఎండీ పి.శరత్‌చంద్రారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యద్దనపూడి విజయలక్ష్మీప్రసాద్, అరబిందో ఫార్మా కంపెనీ సెక్రటరీ పీఏసీ చంద్రమౌళిలతోపాటు జగతి, జనని ఇన్‌ఫ్రాల ప్రతినిధిగా కంపెనీ సెక్రటరీ కార్తీక్, అరబిందో, హెటిరో, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ సంస్థల ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు.
రెండో చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరపున కంపెనీ సెక్రటరీ కార్తీక్, మూడో చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటరామిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరపున కంపెనీ సెక్రటరీ కార్తీక్, రాంకీ ఫార్మా తరపున లాల్‌కృష్ణలు కోర్టు ఎదుట హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న కోర్టు, తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదావేసి, ఆరోజున కోర్టుకు హాజరుకావాలని నిందితులను ఆదేశించింది.