చిలకపాలెం జంక్షన్‌కి తరలివచ్చిన ప్రజలను ఏ రాజకీయ పార్టీ కదిలించలేదు. ఎవరికి వాళ్లే చీమలదండులా కదిలొచ్చారు. భూమి ఉన్నోళ్లు, లేనోళ్లూ కదిలారు. యువత శివమెత్తింది. మహిళలు భద్రకాళికలయ్యారు. అందరూ మట్టి మనుషులే! నేడు చిలకపాలెం ఓ కొత్త మార్గం చూపిస్తున్నది. రేపటి ప్రజా వెల్లువ చిలకపాలెం రూపంలోనే బహిర్గతం కావచ్చు. ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించాల్సిన రాజకీయ వ్యవస్థ, కాలుష్య పరిశ్రమల పక్షాన కొమ్ము కాయడంతో అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. దాని ఫలితమే ఉవ్వెత్తున ఎగసిన జనాగ్రహజ్వాల. ఇకనైనా ప్రభుత్వాలు ప్రజాభీష్టాన్ని మన్నించకపోతే, ప్రజల చేతుల్లో కఠినశిక్ష తప్పదు.
‘ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ’కి చిలకపాలెం ఒక కొత్త హెచ్చరికను చేసింది. ముఖ్యంగా శనివారం నాటి చిలకపాలెం కంటే, ఆదివారం నాటి చిలక పాలెం మన రాజకీయ వ్యవస్థ డొల్లతనాన్ని మరింత బట్టబయలు చేసింది. శ్రీకాకుళం జిల్లా, ఎచ్చర్ల మండలం, చిలకపాలెం జంక్షన్‌లోని నాగార్జున అగ్రికెమ్ ఫ్యాక్టరీలో శనివారం గ్యాస్ ట్యాంక్ పేలిపోయిన విషయం తెలిసిందే! ఆదివారం చిలకపాలెం పరిసర గ్రామాల ప్రజలు అంతకంటే ఎక్కువ పేలుడు శక్తిగా మారారు. శనివారం నాటి వాయు విస్పోటనం కంటే, ఆదివారం నాటి ప్రజా విస్ఫోటనం అనేక రెట్లు శక్తిమంతమైనది. పురుగు మందుల పరిశ్రమ శనివారం వేలాది పల్లె ప్రజలను కట్టుబట్టలతో తమ ఇళ్ల నుంచి దూరంగా తరిమివేసింది. అదే ప్రజా నీకం ఆదివారం పురుగు మందుల పరిశ్రమ తరిమివేతకు నడుం కట్టింది. శనివారం అధర్మం వికటాట్టహాసం చేసింది. ఆదివారం ధర్మాగ్రహం కట్టలు తెంచుకున్నది. చిలకపాలెం ఓ పల్లె మాత్రమే! కానీ అది నేడు వందల పల్లెలకో నూతన పాఠశాల. ‘శనివారం నశించాలి’, ‘ఆదివారం వర్థిల్లాలి’ అంటూ లక్షలాది పల్లె గొంతులు నినదించడానికి చిలకపాలెం ఓ స్ఫూర్తి ప్రదాత!
నాగార్జున అగ్రి కెమ్‌లో జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది కార్మికులు గాయపడటం ఆందోళనకరం. అదే సమయంలో ఇంతటి భారీ విస్ఫోటనం 20 మందికే పరిమితం కావడం ఒకింత ఊరట కలిగించింది. అయితే అలా సరిపెట్టుకొని ఊపిరి పీల్చుకునే వ్యవహారం కాదిది. టీ విరామ సమయంలో కాకుండా ఈ పేలుడు జరిగి ఉంటే, ఏం జరిగి ఉండేదన్న ప్రశ్న అంతకంటే ఎక్కువ ఆందోళనకరమైనది.
ఫ్యాక్టరీ గేటులోపల అడుగుపెట్టిన క్షణం నుంచి తిరిగి గేటు దాటేంత వరకూ ప్రతి కార్మికుడు, ప్రతిరోజూ అనుభవించే గుండె కోత మరింత ఆందోళనకరమైనది. తన భర్త లేదా కొడుకు ప్రతి రోజూ ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేంత వరకూ కార్మిక కుటుంబాలు అనుభవించే నరకయాతన మరింత ఆందోళనకరమైనది. అయితే ఇదంతా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మిక, ఉద్యోగ వర్గాలకే పరిమితమైనది. మరో కోణం కూడా ఉంది. అది పరిసర పల్లెల ప్రజల కోణం!
తన జీవనోపాధి కోసం స్వచ్ఛందంగా ఫ్యాక్టరీలో చేరిన కార్మికుడు లేదా గుమాస్తా పట్ల యాజమాన్యం కనబరుస్తున్న నిర్లక్ష్యం సరే! కానీ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేకపోగా, నిత్యం కాలుష్యాన్ని అనుభవిస్తున్న పరిసర గ్రామాల ప్రజల సంగతేమిటి? భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి.
రసాయనిక ధూళి మేఘం పచ్చని పొలాలను పాడు చేస్తున్నది. దుర్గంధపూరిత గాలులు పీల్చి శ్వాసకోశ వ్యాధులతో రోగగ్రస్తులవుతున్నారు. పిల్లలు పుట్టుక తోనే వ్యాధుల బారిన పడుతున్నారు. విషపూరిత రసాయనిక గాలుల వల్ల స్త్రీల గర్భసంచులు దెబ్బతింటున్నాయి. ఫ్యాక్టరీలు వదిలిన వ్యర్థ పదార్థాలను తిని నోరులేని పశువులు కళ్లెదుటే మరణిస్తున్నాయి.
పాలిస్తాయన్న ఆశతో పెంచు కుంటున్న పశువులు గర్భధారణశక్తిని కోల్పోయి అక్కరకు రాకుండా పోతు న్నాయి. పైప్‌లైన్ల ద్వారా సముద్రంలో చేరిన విషరసాయనాల వల్ల మత్స్య కారులు జీవనోపాధిని కోల్పోతున్నారు. వీళ్లంతా ఫ్యాక్టరీతో ఎలాంటి సంబం ధంలేని పరిసర గ్రామాల ప్రజలే. ఫ్యాక్టరీ నుంచి డబ్బులు రాజకీయ నాయకు లకు లభిస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం జబ్బుల పాలవుతున్నారు. ఫ్యాక్టరీ ద్వారా డబ్బులు లభిస్తున్న వర్గానికీ, జబ్బులు లభి స్తున్న ప్రజలకూ మధ్య గల వైరుధ్యమే ఆదివారం నాడు చిలకపాలెం జంక్షన్‌లో కళ్లకు కట్టింది.
ఆదివారం చిలకపాలెం జంక్షన్‌కి తరలివచ్చిన ప్రజలను ఏ రాజకీయ పార్టీ కదిలించలేదు. ఎవరికి వాళ్లే చీమలదండులా కదిలొచ్చారు. భూమి ఉన్నోళ్లు, లేనోళ్లూ కదిలారు. యువత శివమెత్తింది. మహిళలు భద్రకాళికలయ్యారు. అందరూ మట్టి మనుషులే! నూటికి తొంభై సందర్భాలలో మౌనముద్ర వీడనివాళ్లే! కదిలించకుండా జనం కదిలే రోజులు గతించాయంటున్నారు కొందరు రాజకీయ కోవిదులు! కానీ తరలించకుండా తరలిన జనానికి ఆదివా రం నాటి చిలకపాలెం ఓ సజీవ సాక్ష్యం! కుల మత బేధాలు లేవు. రైతు, కూలీ తేడాలులేవు. స్త్రీ పురుష వ్యత్యాసాలు లేవు. పార్టీలు, జెండాల తారతమ్యాలు లేవు. అందరి నినాదమొక్కటే! ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాలి!
అన్నింటికంటే మరో ముఖ్యమైన కోణం కూడా ఇందులో దాగి ఉంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లో ‘మినీ భోపాల్’ తృటిలో తప్పిపోయింది. ఆ పక్కనే ఉన్న మరో బ్లాక్ పేలిపోయివుంటే... అదే జరిగేది! తృటిలో తప్పిపోయినం దుకు సంతోషిద్దాం! అయితే ఇది సంతోషింపచేసేది కాదు. ‘మినీ భోపాల్’కి మున్ముందు అవకాశముందన్న ఓ ప్రమాద ఘంటిక శనివారం మోగింది.
‘నాలో మరో భోపాల్ దాగి ఉంది జాగ్రత్త’ అంటూ ప్రమాద హెచ్చరికను శనివారం ఆ ఫ్యాక్టరీ ఎగరేసింది. ‘నేను ఇక్కడే ఉంటాను. మీరే నా నుంచి దూరంగా వెళ్లిపోండి’ అంటూ పల్లె ప్రజలను శనివారం ఫ్యాక్టరీ హెచ్చరిం చింది. ఆ రోజు పల్లెలు బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చంటూ తప్పుకు న్నాయి. కానీ ‘‘ఇది మా స్థలం, ఫ్యాక్టరీయే మా నుంచి వెళ్లిపో వాలి’’ అంటూ ఆదివారం ప్రజలు తిరగబడ్డారు. అధికారులు తాత్కాలిక మూసివేతకు ఉత్తర్వులిచ్చారు.
ప్రజలు తాత్కాలికంగా గెలిచారు. ప్రభుత్వం ఓడింది. జనావాసాల మధ్య పురుగు మందుల పరిశ్రమల స్థాపనకి ప్రభుత్వం అనుమతివ్వడం అత్యంత అమానుషమైనది. ప్రజలను పురుగులుగా భావించే ప్రభుత్వ ధోరణికి నిదర్శనమిది. ఇంతటి భారీ పెట్టుబడులతో జనావాసాల మధ్య స్థాపించిన ఈ ‘ఆగ్రో కెమ్’లో 27 మీటర్ల ఎత్తయిన భవనంలోని మంటలను చల్లార్చే అగ్నిమాపక సాధనాలు లేవు. వాటిని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తరలించాల్సి వచ్చింది. 30 మీటర్ల ఎత్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలుంటే, 40 మీటర్ల ఎత్తు మంటలను అర్పే సాధనాలుండాలి.
ఈ కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేవు. జనావాసాలలో 40 మీటర్ల ఎత్తయిన మంటలను ఆర్పడానికి 80 కి.మీ. దూరం నుంచి అగ్నిమాపక శకటాలు ట్రాఫిక్ రోడ్లగుండా రప్పించాలా? ఇదేనా ఆధునికత? ప్రైవేట్ పరిశ్రమ ప్రమాదం సృష్టిస్తే, ప్రభుత్వరంగ పరిశ్రమ అగ్నిమాపక శకటాలు పంపించాలా? లాభా లకే తప్ప భద్రతకి ‘ప్రైవేటు’ యాజమాన్యాలకి బాధ్యత లేదా? ఇలాంటి పరి శ్రమలను అనుమతించిన ప్రభుత్వాధినేతలను బోనెక్కించే ‘వ్యవస్థ’ లేక పోవడం మన దౌర్భాగ్యమే!
విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ప్రమాదం ఓ పెద్ద హెచ్చరిక! ఆనాడే సరిగ్గా పట్టించుకొని ఉంటే ఇటీవలి స్టీల్ ప్లాంట్ పెను ప్రమాదం జరగకపోయి ఉండేది. అది కూడా ప్రభుత్వానికి గుణపాఠం కాలేదు. పైగా తాజాగా పురుగు మందుల ఫ్యాక్టరీ దుస్సంఘటనకి కారణమైంది. అత్యధిక జనసాంద్రత గల విశాఖ నగరం నేడు ప్రమాద కూడలిగా మారింది.
చమురు పైపులైన్లు రక్త నాళాలుగా, గ్యాస్ పైప్‌లైన్లు నరాలుగా, కాలుష్య పరిశ్రమలు శరీర అంగాలుగా విశాఖనగరం ఓ అగ్ని పర్వతం మీద ఆసీనురాలై ఉంది. అది ఎప్పుడు, ఎలా పేలుతుందో ఊహించలేము. అది వెదజల్లే లావా ఏమేం ముంచెత్తుతుందో తలచుకుంటే భీతి ఆవహిస్తుంది. అట్టి భీతావహం నేడు మరో రూపంలో ఉత్తర కోస్తానూ ముఖ్యంగా శ్రీకాకుళాన్నీ ఆవరించింది.
ఆర్థికంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాష్ట్రంలో అత్యంత వెనుక బడి ఉన్నాయి. ఈ జిల్లాల జనాభాలో మూడోవంతు ప్రజలు కూటి కోసం వలస వెళ్లారు. అండమాన్, ఖరగ్‌పూర్, అసోం, ముంబై, అహ్మదాబాద్, సూరత్‌లలో శ్రీకాకుళం జిల్లా ప్రజల నివాసానికి ప్రత్యేక మురికివాడలు ఉం టాయి. హైదరాబాద్‌లో ఇంచుమించు 10 లక్షల శ్రామిక జనాభా శ్రీకాకుళా నిదే! భరత్‌నగర్, మూసాపేట, ప్రగతినగర్‌లను ‘మినీ శ్రీకాకుళాలు’గా పిలవవచ్చు.
ఇలా వలసపోకుండా శ్రీకాకుళం జిల్లాలోనే ఇంకా మనుగడ సాగిస్తున్న ప్రజలు నిత్య బాధితులుగా ఉన్నారు! 1/70 యాక్ట్‌లో చేరని గిరిజన గ్రామాలు వందల సంఖ్యలో ఆ జిల్లాలోనే ఉన్నాయి. మూత్రపిండాల వ్యాధులు వారి వంతే! మంచినీటికి మైళ్ల తరబడి వెళ్లాల్సిన దుస్థితి వారిదే! కొబ్బరి, జీడి పంటలకి గిట్టుబాటు ధరలేక క్షోభిస్తున్న ఉద్దానం అక్కడిదే! నిన్నగాక, మొన్న చారెడు నేల కోసం ఊచకోతకి గురైన లక్ష్మింపేట దళితులు ఆ జిల్లాకు చెందినవారే. మరపడవలతో ఉపాధిని కోల్పోయిన మత్స్యకార పల్లెలకూ అది కేంద్రమే! ఇవన్నీ ఒక ఎత్తు! కోస్టల్ కారిడార్ మరో ఎత్తు!
‘కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు’ స్థానిక ప్రజలకు అక్కరలేనిదీ, ఇష్టం లేనిదీ! ‘సోంపేట’ను కాదన్నందుకు రాజ్యం ఇద్దరిని బలితీసుకున్నది. ‘కాకరాపల్లి’ని వద్దన్నందుకు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నది. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమ వరం, చిలకపాలెం జంక్షన్, రణస్థలం, విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ, విశాఖ జిల్లాలోని చిప్పాడలలో బల్క్ డ్రగ్, రసాయనిక పరిశ్రమలను విచ్చలవిడిగా స్థాపించారు. ఇవన్నీ కాలుష్యాన్ని వెదజల్లేవే! అదనంగా థర్మల్ పవర్ కేంద్రాల నిర్మాణంతో ముప్పు ముమ్మరం కాబోతున్నది. రణస్థలం దగ్గర అణువిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు సాగుతున్నాయి.
వీటి స్థాపనకు ఓ వైపున భూములు కోల్పోవాల్సివస్తున్నది. మరోవైపు అవి వెదజల్లే వ్యర్థాల వల్ల పంటభూములు పాడైపోతున్నాయి. వాటి నుంచి పైప్‌లైన్ల ద్వారా సముద్రం లోకి వదిలే విష రసాయనాల వల్ల మత్స్యసంపద నాశనమవుతున్నది. అందుకే వీటిపట్ల క్రమంగా ప్రజల వ్యతిరేకత పెరుగుతున్నది. పరిశ్రమల మీద ప్రజల వ్యతిరేకత క్రమంగా రాజకీయ పార్టీలు, నాయకుల పట్ల వ్యతిరేకతగా రూపాం తరం చెందుతున్నది. అదే ఆదివారం బద్దలైంది.
నేడు చిలకపాలెం ఓ కొత్త మార్గం చూపిస్తున్నది. రేపటి ప్రజా వెల్లువ చిలకపాలెం రూపంలోనే బహిర్గతం కావచ్చు. ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించాల్సిన రాజకీయ వ్యవస్థ, కాలుష్య పరిశ్రమల పక్షాన కొమ్ము కాయ డంతో అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. దాని ఫలితమే ఉవ్వెత్తున ఎగసిన జనాగ్రహజ్వాల. ప్రభుత్వాలు ఇకనైనా ప్రజాభీష్టాన్ని మన్నించకపోతే, ప్రజల చేతుల్లో కఠినశిక్ష అనుభవించక తప్పదు.
- పి.ప్రసాదు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐఎఫ్‌టీయూ