ఏడోసారి వింబుల్డన్ ట్రోఫీని సాధించిన ఫెడరర్
సంప్రాస్, రెన్‌షా రికార్డు సమం
కెరీర్‌లో 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్
బ్రిటన్ స్టార్‌కు నాలుగోసారీ నిరాశ
దేశ ప్రధాని... యువరాణి... కిక్కిరిసిన సెంటర్ కోర్టు... వెలుపల లక్షలాది ప్రజల మద్దతు... ఇవేవీ ఆండీ ముర్రేని గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌ని చేయలేకపోయాయి. స్విస్ యోధుడు రోజర్ ఫెడరర్ అనుభవం ముందు ముర్రే నైపుణ్యం దిగదుడుపే అయ్యింది. దేశ ఆశల్ని నిలబెట్టలేనందుకు ఉబికివస్తున్న కన్నీళ్లతో ముర్రే నిరాశలో మునిగిపోయాడు. అతడితో పాటు బ్రిటన్ మొత్తం భోరుమంది.
లండన్: మూడు పదుల వయసు దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ నిరూపించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఫెడరర్ రికార్డుస్థాయిలో ఏడోసారి గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 4-6, 7-5, 6-3, 6-4తో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ఈ విజయంతో ఫెడరర్ ఖాతాలో 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ చేరింది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు)... రన్నరప్ ముర్రేకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన ఈ స్విస్ స్టార్ తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. చివరిసారి ఫెడరర్ 2010 జూన్ 6వ తేదీన నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు.