NEWS

Blogger Widgets

16.6.12

మమతకు చెయ్యిచ్చిన ములాయం సింగ్


న్యూఢిల్లీ, జూన్ 15: అందరు ఊహించినట్లే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేయ్యచ్చి రాష్టప్రతి పదవికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జరిపిన రాజకీయానికి ములయం తలవంచక తప్పలేదు. సోనియా ఏ మంత్రం వేశారో కానీ రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ తమ అభ్యర్థని యుపిఏ ప్రకటించగానే ములాయం సింగ్ యాదవ్ ప్లేటు ఫిరాయించి ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. ములయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించటంతో పాటు తమ తరఫున అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ పేర్లను ప్రతిపాదించటం తెలసిందే. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన మరుసటిరోజే ములాయం మనసు మార్చుకున్నా తన నిర్ణయాన్ని శుక్రవారం వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ అనుభవజ్ఞుడు, సమర్థుడైన నాయకుడు అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నామని ములాయం విలేఖరులతో చెప్పారు. రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని ములాయం చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించినంత మాత్రాన తాము యుపిఏ సంకీర్ణ ప్రభుత్వంలో చేరటం లేదని ఆయన ప్రకటించారు. మమతా బెనర్జీతో స్నేహం కొనసాగుతుందా? అంటూ విలేఖరులు కురిపించిన పలు ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. మారిన పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలకు ఇప్పుడు తావులేదని కొట్టివేశారు.
మధ్యంతరానికి వ్యతిరేకం
రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతునిచ్చే ప్రసక్తి లేదని, మధ్యంతర ఎన్నికలను తాము కోరుకోవడం లేదని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వంలో అస్థిరతను సృష్టించడం మంచిది కాదని మమతా బెనర్జీకి చెప్పడం తమ బాధ్యతని తెలిపింది. బిజెపి, మతశక్తుల నాయకత్వంలో కొనసాగుతున్న ఎన్డీయేకు ఏమాత్రం లౌకిక భావన లేదన్నారు. ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని, మధ్యంతర ఎన్నికలకు దారితీసే పరిస్థితులకు మద్దతునిచ్చే ప్రసక్తి లేదని ఎస్‌పి ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలతో ప్రజలపై భారం మోపేందుకు ఎస్‌పి వ్యతిరేకమని చెప్పారు.