NEWS

Blogger Widgets

24.6.12

‘ఆర్థిక’ సేవకు దాదా దూరం



కోల్‌కతా, జూన్ 23: కేంద్ర ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేసిన బెంగాల్ దాదా ప్రణబ్ ముఖర్జీ మరో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. భారత రాష్టప్రతి పదవికి పోటీ చేయనున్న ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా సమర్పిస్తారు. 28న యుపిఏ తరఫున రాష్టప్రతి అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక మంత్రి హోదాలో చివరిసారి తన స్వరాష్ట్రానికీ, సొంత ఊరుకూ వెళ్లారు. రాష్టప్రతి అభ్యర్థిగా ప్రణబ్ పేరును యుపిఏ అధినేత్రి సోనియా గాంధీ శనివారం అధికారికంగా ప్రకటించడంతో రాష్టప్రతి భవన్‌కు ఆయన ప్రస్థానం దాదాపు ఖాయమైంది.
కేంద్రంలో అనేక కీలక పదవులను నిర్వహించిన ప్రణబ్ ఆర్థిక మాంద్యంతో ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దాని ప్రభావం మన దేశంపై ఎక్కువగా లేకుండా పరిస్థితిని చక్కదిద్దారు. రెండేళ్లపాటు ఆయన కేంద్ర విత్త మంత్రిగా ఉన్నారు. కాగా ఆర్థిక మంత్రి హోదాలో ప్రణబ్ చివరిసారిగా శనివారం సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ వచ్చారు. రాజధాని కోల్‌కతాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఇదే తన ఆఖరి రాష్టప్రర్యటన అన్నారు. ప్రణబ్ పూర్వికులు నివసించిన బిర్‌భూమ్‌ను ఆయన సందర్శించారు. అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘ఇక నుంచి నాకు పార్టీ వ్యవహారాల గురించి గానీ ప్రభుత్వం గురించి గానీ మాట్లాడే అవకాశమే ఉండదు’ అని 77 ఏళ్ళ ప్రణబ్ వ్యాఖ్యానించారు. యుపిఏ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత 2009 మేలో ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రి పదవి చేపట్టారు. అంతకు ముందు యుపిఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా సేవలందించారు. ప్రణబ్ ఈనెల 28న రాష్టప్రతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. యుపిఏ మిత్రపక్షాలన్నీ తనకే మద్దతు ఇస్తాయనే ఆశాభావం సీనియర్ నేత ప్రణబ్ వ్యక్తం చేశారు. ‘యుపిఏలోని ఒక మిత్రపక్షం తప్ప అన్ని భాగస్వామ్య పార్టీలు నా అభ్యర్థిత్వాన్ని సమర్ధిస్తున్నాయి. యుపిఏ యేతర పక్షాలైన సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలు అలాగే సిపిఎం, ఎఐఎఫ్‌బి, జెడియు, శివసేన నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి’ అని ప్రణబ్ తెలిపారు. మిగతాపక్షాల మద్దతు కోసం ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు.
యుపిఏలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి ఎన్నికల్లో ఎవరి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అబ్దుల్ కలామ్‌కు మద్దతు ప్రకటించిన మమతాబెనర్జీ ఆయన పోటీలో ఉండనని చెప్పడంతో తృణమూల్ తన వైఖరిని వెల్లడించలేదు. ప్రణబ్ ముఖర్జీపై లోక్‌సభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా పోటీ చేస్తున్నారు. ఇలా ఉండగా రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి ఎలక్ట్రోల్ కాలేజీలో 10.98 లక్షలు కోట్లు ఉండగా ప్రణబ్‌కు కనీసం 6.38 లక్షల ఓట్లు పోలవుతాయని భావిస్తున్నారు. ఎన్‌సిపి మాజీ నేత పిఎ సంగ్మాకు 3.12 లక్షల ఓట్లు రావచ్చని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ 28న నామినేషన్ దాఖలు చేసిన వెంటనే సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్తారని కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ వెల్లడించారు. బెంగాల్ ప్రజల ఆశీస్సులు అందుకున్న తరువాత ఒక స్పష్టమైన సందేశం ఇస్తారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అహ్మద్ పేర్కొన్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో మాట్లాడమని ఏఐసిసి నుంచి ఆయనకేదైనా సూచన చేసిందా? అన్న ప్రశ్నకు ‘కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నేత ప్రణబ్. ఆయనకు ఎవరి సలహాలు అక్కర్లేదు’ అని బదులిచ్చారు.
‘మా నాన్నకు మద్దతివ్వండి’
రాష్టప్రతి ఎన్నికల్లో యుపిఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్ని రాజకీయ పక్షాలను అభ్యర్థించారు. కాంగ్రెస్ నాయకుడిగానో ఎమ్మెల్యేగానో తానీ విజ్ఞప్తి చేయడంలేదని ఒక తండ్రికి కొడుగ్గా అడుగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతా వచ్చిన ప్రణబ్‌ను రిసీఫ్ చేసుకునేందుకు వచ్చిన అభిజిత్ మీడియాతో ముచ్చటించారు. భారత రాష్టప్రతి వంటి అత్యున్నత పదవికి పోటీచేసే అవకాశం తన తండ్రికి దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ఇస్తారనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.