NEWS

Blogger Widgets

24.6.12

కనేరియాపై 'లైఫ్‌ బ్యాన్‌'



ఇసిబి నిర్ణయం
లండన్‌: 'స్పాట్‌ ఫిక్సింగ్‌' ఆరోపణలకుగాను పాక్‌ లెగ్‌ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియాపై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఇసిబి) జీవిత కాల నిషేధాన్ని విధించింది. కౌంటీ క్రికెట్‌లో భాగంగా 2009లో డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎసెక్స్‌ తరఫున˜ ఆడిన కనేరియా ఇంగ్లీష్‌ బౌలర్‌ మెర్విన్‌ వెస్ట్‌ఫీల్డ్‌ను ప్రలోభపెట్టి భారీగా పరుగులిప్పించాడన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇసిబి ఈ నిషేధానికి పూనుకుంది. దీని ప్రకారం కనేరియా తన జీవిత కాలంలో ఇసిబి పరిథిలో జరిగే ఏ మ్యాచ్‌లోనైనా ఆడటంగానీ, నిర్వహించడం గానీ చేయరాదు. ఈ వ్యవహారంలో వెస్ట్‌ఫీల్డ్‌ గతంలోనే తన నేరాన్ని అంగీకరించడంతో అతనిపై ఐదేళ్ళ నిషేధాన్ని విధించి, చివరి రెండేళ్ళలో క్లబ్‌ క్రికెట్‌ ఆడుకొనే అవకాశాన్ని కల్పించారు. ఆ మ్యాచ్‌లో తక్కువ స్థాయి ప్రదర్శన కనబరిస్తే 6 వేల పౌండ్లు యిస్తామని ఆశచూపారని, దానికి తాను అంగీకరించానని ప్రకటించిన వెస్ట్‌ఫీల్డ్‌ నాలుగు మాసాల జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2010లో కనేరియాను కూడా అరెస్టు చేసినప్పటికీ ఎలాంటి 'ఛార్జ్‌' నమోదు చేయకుండానే విడిచిపెట్టారు, 'కనేరియా చర్యలు క్రికెట్‌కు ప్రమాదకరమైనని, ఈ అవినీతి క్యాన్సర్‌లా వ్యాపించకముందే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని' ఇసిబి క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.
అప్పీల్‌ చేస్తా : కనేరియా
కాగా, తనపై జీవితకాల నిషేదాన్ని విధిస్తూ ఇసిబి యిచ్చిన తీర్పుపై తాను అప్పీల్‌ చేస్తానని కనేరియా ప్రకటించాడు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తనపై ప్రజలకు నమ్మకం వుందని, తాను క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తున్నానని స్కై స్పోర్ట్స్‌కు యిచ్చిన ఇంటర్వ్యూలో 31 ఏళ్ళ కనేరియా పేర్కొన్నాడు. ఇసిబి నిర్ణయం పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని, తనను ఎందుకు శిక్షించారో అర్ధం చేసుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు.