ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో Sun, 1 Jul 2012, IST
- సీఎల్పీ సమావేశంలో ప్రణబ్
- నా గురించి ప్రజలకు తెలుసు
- రాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన ఎంఐఎం నేతలు
విలేకరులతో మాట్లాడారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ నాయకునిగా ఇక్కడకు రాలేదని, రాష్ట్రపతి అభ్యర్థిగానే వచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగంలో రాష్ట్రపతిగా ఎవరైనా పోటీ చేయోచ్చని, కానీ ఏకగ్రీవ ఎన్నిక ద్వారా రాజ్యాంగాన్ని గౌరవించినట్లవుతుందన్నారు. అధికారపార్టీ ఎవర్ని ప్రతిపాదిస్తే వారే రాష్ట్రపతిగా ఎన్నికవుతున్నారని, ఈసారి కూడా అలాగే జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. గతంలో కేంద్రమంత్రిగా, పార్టీ నాయకుడిగా అనేకసార్లు మాట్లాడానని, ప్రస్తుతం తాను ఆ రెండూ చేయలేనన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి పార్టీలకతీతంగా ఉండాలని తాను విశ్వసిస్తానన్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి వద్దకు పంపినప్పుడు మాత్రమే ఆయా విధానాలపై వ్యాఖ్యానించగలనన్నారు. శనివారంనాడు తాను తమిళనాడు, పాండిచ్చేరి ప్రజాప్రతినిధులతో సమావేశమైనట్లు చెప్పారు. అక్కడ డిఎంకె, సిపిఎం తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయంటూ ఆ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను దేశంలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల్ని కలుస్తున్నానని, ఈ ప్రచారం జులై 15 వరకు కొనసాగుతుందన్నారు. కెసిఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలను కలుస్తారా? అని విలేకరులడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని పార్టీలు నిర్ణయిస్తాయని, వ్యక్తులు కాదని చెప్పారు. ఎంఐఎంతో అలయెన్స్ ఉందని, వార్ని కలుస్తానన్నారు. సంగ్మా అభ్యర్థిత్వంపై విలేకరులడిగిన ప్రశ్నలకు 'ఐ డోంట్ నో' అని సమాధానం చెప్పారు. జూబ్లీహాల్‌లో ప్రణబ్ కార్యక్రమం ముగిసి బయటకువెళ్లిన ఐదు నిముషాల అనంతరం పైఅంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎసి మిషన్లు షార్ట్ సర్య్కూట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి, హాల్ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు బయటకు పరుగులు తీశారు. ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. అంతకుముందు ప్రణబ్ బేగంపేట విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనకు పూలదండలు వేసేందుకు నేతలు పోటీ పడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్రమంత్రి దానం నాగేందర్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి భర్త, పిసిసి కార్యదర్శి బండ చంద్రారెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగింది. దానంకు పూలదండ వేసే అవకాశం రాకపోవడంతో ఆయన తన అనుచరులతో కలిసి ప్రణబ్ కాన్వారును అడ్డుకున్నారు. అక్కడే ప్రణబ్ కారు అద్దాలు క్రిందికి దించి అసహనంగా దానం నుంచి పూలహారం తీసుకున్నారు. తెలంగాణ మాల మహనాడు నేతలు తెలంగాణాపై ప్రణబ్ అభిప్రాయం చెప్పాలంటూ నిరసన తెలిపారు. వారు బేగంపేట, గన్‌పార్క్, తాజ్ హోటల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎంఐఎం నేతలతో భేటీ
సీఎల్పీ సమావేశం ముగియగానే ప్రణబ్ తాజ్‌కృష్ణ హోటల్‌లో బస చేశారు. అక్కడ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు పల్లంరాజు, పురంధేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి, మాజీ మంత్రి చిన్నారెడ్ది, నాదెండ్ల మనోహర్ తదితరులు ప్రణబ్‌ను కలిశారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్‌కు ఫోన్ చేసి మద్దతు కోరారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రణబ్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు.