NEWS

Blogger Widgets

2.7.12

రాజకీయ ఒత్తిళ్ళు వున్నా సోనియాతో ప్రమాణానికి సిద్ధంగా వున్నా



 'టర్నింగ్‌ పాయింట్‌' పుస్తకంలో కలామ్‌ వెల్లడి
 రాజ్యాంగబద్ధంగా వ్యవహరించా
 కఠిన నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడి
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అప్పటి రాష్ట్ర పతి ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ సిద్ధంగానే వున్నారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు రాజకీయ పార్టీల నాయకుల నుండి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ప్రధానిగా సోనియాతో ప్రమాణస్వీకారం చేయించ డానికి అబ్దుల్‌ కలామ్‌ సుముఖంగా వున్నారు. అయితే, అలాంటి ఆలోచన జరుగుతున్న సమ యంలోనే యుపిఎ ప్రభుత్వానికి మన్మోహన్‌సింగ్‌ నాయకత్వం వహిస్తారని రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందింది. కలామ్‌ రాసిన 'టర్నింగ్‌ పాయింట్‌' పుస్తకంలో ఈ విషయాలు వెల్లడ య్యాయి. కలామే స్వయంగా ఈ అంశాలను తన పుస్తకంలో ప్రస్తావించారు. 2004 ఎన్నికల తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కలామ్‌ వైఖరి గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. సోనియా ప్రధాని కాకుండా కలామ్‌ అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. విదేశీయత పేరుతో ఆమె ప్రధాని కాకుండా రాష్ట్రపతి అడ్డుకున్నట్లు విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఎన్‌డిఎ ప్రత్యేకించి బిజెపి వ్యతిరేకత వల్ల ఆయన ముందుకు రాలేక పోయినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రపతిగా తన ఐదేళ్ళ పదవీకాలంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ కలామ్‌ 'టర్నింగ్‌ పాయింట్స్‌' అనే పుస్తకం రాశారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలని సోనియా తనకుతానుగా చెప్పినట్లు అయితే రాజ్యాంగబద్దంగా తాను ఆమెనే నియ మించే వాడినని కలామ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ బద్దంగా తనముందున్న అవకాశం కూడా అదేనని వెల్లడించారు. యుపిఎ ప్రభుత్వానికి సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని దాదాపు తాను కూడా భావించానని, అయితే, ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ పేరును సోనియా నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతిభవన్‌కు లేఖ అందిందని గుర్తు చేశారు. 'ఆ సమయంలో చాలామంది రాజకీయ నాయ కులు నన్ను కలిశారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గ వద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా సోనియాను నియమించాలని కోరారు. అయితే, ఆ విజ్ఞప్తి ప్రకారం రాజ్యాంగబద్దంగా నేను వ్యవహరించ లేను. సోనియా తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు అయితే ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం మినహా నాకు మరో మార్గం లేదు' అని కలామ్‌ వివరించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏ ఒక్క పార్టీగానీ లేదా సంకీర్ణం గానీ మూడు రోజులవరకు ముందుకు రాలేదని కలామ్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన పదవీకాలంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. 'పలు సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి ముందు న్యాయ, రాజ్యాంగబద్ద నిపుణుల అభిప్రాయాలు స్వీకరించాను. ఆ తర్వాతే వాటికి పరిష్కార మార్గాలు కనుగొన్నాను. పూర్తిగా నిష్పపాతంగా వ్యవహరించాను. పూర్తిగా నా విచక్షణతోనే పనిచేశాను. నా నిర్ణయాలన్నీ ప్రధానంగా రాజ్యాంగాన్ని పరిరక్షించడం, పవిత్రతను కాపడటం లక్ష్యంగా వుండేవి. అదే నా లక్ష్యం కూడా' అని పేర్కొన్నారు. 2004 ఎన్నికలు అత్యంత ఆసక్తికరమైనవిగా ఆయన అభివర్ణించారు. 'నాకు సంబంధించినంత వరకూ నేను చాలా ఆందోళన చెందాను. నా కార్యదర్శులను అడిగాను. అతిపెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ నుండి లేఖ వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా వున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నది. మే 18వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు సోనియాగాంధీ నాతో సమావేశమవుతారని చెప్పారు. ఆమె చెప్పిన సమయానికే రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. అయితే, ఆమె ఒంటరిగా రాకుండా వెంట మన్మోహన్‌సింగ్‌ను తీసుకొచ్చారు. నాతో చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం మాకుందని సోనియా చెప్పారు. అయితే, మద్దతిచ్చే వారి జాబితాతో కూడిన లేఖ తీసుకురాలేదు. 19వ తేదీన మద్దతు లేఖలు తీసుకొస్తానని సోనియా చెప్పారు. దీనిని ఎందుకు వాయిదా వేస్తున్నారని అడిగాను. ఇప్పుడే ఈ పని పూర్తిచేద్దామని అన్నాను. ఆమె వెళ్ళిపోయారు. మళ్ళీ నాకు ఓ సందేశం అందింది. రాత్రి 8:15 గంటలకు సోనియా సమావేశమవుతారని ఆ సందేశం సారాంశం' అని కలామ్‌ వివరించారు. ఈ ప్రక్రియ పురోగతి దశలో వుండగానే వ్యక్తులు, సంస్థలు, పార్టీల నుండి తనకు అసంఖ్యాకంగా ఇ మెయిల్స్‌ అందాయని తెలిపారు. ప్రధానిగా సోనియాగాంధీని అంగీకరించరాదంటూ ఆ ఇ మెయిల్స్‌లో విజ్ఞప్తి చేశారని చెప్పారు. మే 19వ తేదీ సాయంత్రం 8:15 గంటలకు మన్మోహన్‌తో కలిసి సోనియా రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఆ సమావేశంలో పలు అంశాలు చర్చించుకున్నాం. పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలు తనకు అందజేశారు. తాను స్వాగతించానన్నారు. చివరికి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్‌ అన్ని ఏర్పాట్లు చేసిందని, మన్మోహన్‌ను ప్రధానిగా నియమిస్తున్నట్లు అప్పుడు సోనియా చెప్పారని వివరించారు. ఇది కచ్చితంగా తనకు ఆశ్చర్యం కలిగించిందని కలామ్‌ పేర్కొన్నారు. తర్వాత మన్మోహన్‌తో ప్రమాణం చేయించామని తన పుస్తకంలో తెలిపారు. మన్మోహన్‌ ప్రమాణం తర్వాత కలామ్‌ ఊరట పొందినట్లు ఆ పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకాన్ని వచ్చేవారం ఆవిష్కరించనున్నారు.