గాజువాక(విశాఖ), జూలై 1: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెం మత్స్యకారులను ఆమె ఆదివారం పరామర్శించారు. గతనెల 28వ తేదీన సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఎన్టీపీసీ)లో ఉపాధి కల్పించాలని కోరుతూ తిక్కవానిపాలెం మత్స్యకారులు చేసిన ఆందోళన వివాదాస్పదమైన విషయం తెలిసిందే.... శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులపై సింహాద్రి సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది విరుచుకుపడగా పలువురు గాయపడిన విషయం విదితమే. గాయపడిన వారిని పరామర్శించి మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఆమె తిక్కవానిపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ మత్స్యకార సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతంలోనే ఒక ప్రణాళికను రూపొందించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి మత్స్యకార కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా విద్యనందించడంతో పాటు వారి తల్లిదండ్రులకు నెలకు 500 రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారన్నారు. వేటకు వెళ్ళి మృత్యువాత పడిన మత్స్యకార కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల మేర నష్టపరిహారం అందించే కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మత్స్యకారుల సంక్షేమం కోసం విశేషకృషి చేశారన్నారు. ఆయన బాటలోనే జగన్మోహన్‌రెడ్డి పయనిస్తున్నారన్నారు. ప్రజలపక్షాన నిలుస్తూ జగన్ పోరాటం చేస్తున్నారన్నారు. తిక్కవానిపాలెం మత్స్యకారుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. తాను రాసిన లేఖకైనా ప్రభుత్వాలు స్పందిస్తాయన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఉపాధి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. అంతకుముందు వైఎస్సార్ కుమార్తె షర్మిళ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వం కోల్పోయాయన్నారు. వైఎస్సార్ అధికారంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వాలేనా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్టీపీసీ విడుదల చేస్తున్న కాలుష్యంతో అవస్థలు పడుతున్న మత్స్యకారులకు అదనపు కాలుష్యాన్ని సముద్ర గర్భంలో కలిపే విధంగా సింహాద్రి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో తిక్కవానిపాలెం తీరప్రాంతం మరింత కాలుష్యభరితం అవుతుందన్న ఆందోళన ఆమె వ్యక్తం చేశారు. ముందుగా విజయమ్మ, షర్మిళలు సీ వాటర్ స్విచ్‌గేర్ భవనంతో పాటు జెట్టీని పరిశీలించారు. అనంతరం తిక్కవానిపాలెం మత్స్యకారులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఆర్‌ఇసిఎస్ డైరెక్టర్ చల్లా కనకారావులున్నారు