హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూలుపై ఉత్కంఠ మరో నాలుగు రోజులు కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి.....
ఈ నాలుగు రోజుల్లోనే కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కళాశాలల్లో ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేస్తేనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు ఆటంకం ఉండదు. ఇంజనీరింగ్ కోర్సు ఫీజు రూ.35 వేలకు అంగీకరించిన కళాశాలలన్నీ ప్రభుత్వం రూపొందించిన నమూనా అఫిడవిట్‌ను కాదని, కళాశాల లెటర్ హెడ్‌పై లేదా తెల్ల కాగితంపై ప్రమాణ పత్రాన్ని రాసిస్తామని చెబుతున్నా... ఈ విధానాన్ని అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) అంగీకరిస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి పెరగాల్సిన ఫీజులకు బదులుగా ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించిన కళాశాలలు కేవలం రాతపూర్వకంగా సమర్పిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చని తెలుస్తోంది.
పైగా రెండేళ్లకు ఇదే ఫీజు వర్తిస్తున్నందున.. ఇప్పుడు కేవలం లేఖ రాసిచ్చి వచ్చే ఏడాది ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఇబ్బందులు తప్పవు. కానీ ముఖ్యమంత్రి తెల్ల కాగితంలో రాసిచ్చినా సరే.. రెండేళ్లకు ఒప్పుకొంటే చాలని పేర్కొన్నట్టు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనకు ఒప్పుకొన్న కళాశాలలన్నీ గురువారం ఏఎఫ్‌ఆర్సీ కార్యాలయంలో అంగీకార పత్రాలు సమర్పించనున్నాయి. అంగీకార పత్రాలు సమర్పించిన కళాశాలల వరకు రూ.35 వేల ఫీజును ప్రతిపాదిస్తూ ఏఎఫ్‌ఆర్సీ ప్రభుత్వానికి నివేదిక పంపుతుంది. ఆ తర్వాతే ప్రభుత్వం ఆయా కళాశాలల్లో ఫీజు నిర్ధారిస్తూ జీవోలు జారీచేస్తుంది. ఈ కళాశాలలకు ఫీజులు నిర్ధారించినా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి లేదు.
ఎందుకంటే అంగీకార పత్రం ఇవ్వని కళాశాలల ఫీజులూ నిర్ధారించాల్సి ఉంటుంది. ఏఎఫ్‌ఆర్సీ ఫీజుల ప్రతిపాదనలు రూపొందించిన 133 కళాశాలల్లో దాదాపు 40 వరకు అంగీకార పత్రాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ఈ 40 కళాశాలల్లో ఫీజులు దాదాపు 150 శాతం వరకు పెంచుతూ ఏఎఫ్‌ఆర్సీ ఫీజుల ప్రతిపాదనలు రూపొందించింది. అలాగే వీటి కామన్ ఫీజును రూ. 50,200గా ప్రతిపాదించింది. అయితే ఈ కళాశాలల్లో ఈ ఫీజుకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయా? లేవా అని తేల్చేందుకు, పెరిగిన ఫీజులకు కళాశాలలు ఇచ్చిన సమాచారమే ప్రాతిపదిక అయినందున ఆ సమాచారాన్ని సరిపోల్చేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ తనిఖీ ప్రక్రియకు కనీసం వారం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ 40 కళాశాలల్లో కామన్ ఫీజు రూ. 50,200 ఉంటుందని, తనిఖీ అనంతరం పెరగడానికి గానీ, తగ్గడానికి గానీ అవకాశం ఉంటుందని పేర్కొంటూ జీవో జారీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. షరతులతో గందరగోళం ఎందుకనుకుంటే మాత్రం.. తనిఖీలు పూర్తయ్యాకే నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది. షరతులతో అయితే ఈనెల 23న, షరతులు వద్దనుకుంటే మరో నాలుగైదు రోజులు ఆలస్యంగా నోటిఫికేషన్ వెలువడవచ్చని భావిస్తున్నారు.
నేడు ఉపసంఘం భేటీ..
రూ.35 వేల ఫీజుకు మెజారిటీ కళాశాలలు ఒప్పుకున్నందున ఆ మేరకే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన 40 కళాశాలల్లో ఏఎఫ్‌ఆర్సీ ప్రకారం ఫీజులు పెరిగితే.. ఆ పెరిగిన భారాన్ని విద్యార్థులే భరించుకునేలా విధానం రూపొందించాలని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో భేటీ అయి కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
బుకింగ్ మళ్లీ ప్రారంభం..!
కామన్ ఫీజు అంటే కన్వీనర్ కోటాకైనా, మేనేజ్‌మెంట్ కోటాకైనా ఫీజు ఒకటే. రూ. 35 వేల ఫీజుకే మెజారిటీ కళాశాలలు అంగీకరించాయి. అయితే వీటిలోనూ మెరుగైన కళాశాలలు 50 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు మేనేజ్‌మెంట్ కోటా కింద ప్రభుత్వ నిర్ధారిత ఫీజు రూ.95 వేలుండగా.. ఈ కళాశాలలన్నీ ఇష్టారాజ్యంగా రూ. 2 లక్షలు, రూ.3 లక్షలు డొనేషన్లు వసూలు చేశాయి. తాజా ఫీజుల సంక్షోభం నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కోటా భర్తీనీ ఆన్‌లైన్‌లో చేపట్టాలని ప్రభుత్వం భావించినా.. కళాశాలలు రూ.35 వేల కామన్ ఫీజుకు దిగిరావడంతో ప్రభుత్వం పారదర్శకతకు తిలోదకాలిచ్చింది. దీంతో ఆ కళాశాలలన్నీ మళ్లీ యథావిధిగా మేనేజ్‌మెంట్ కోటాకు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించాయి.