NEWS

Blogger Widgets

16.8.12

విలాస్‌రావ్‌కు కన్నీటి వీడ్కోలు


మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో విలాస్‌రావ్ చితికి ఆయన పెద్ద కుమారుడు అమిత్ నిప్పంటించారు..

నివాళులర్పించిన మన్మోహన్, సోనియా
కడసారి చూపు కోసం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు


ముంబై, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అంత్యక్రియలు బుధవారం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామం బభల్‌గావ్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తమ కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో విలాస్‌రావ్ చితికి ఆయన పెద్ద కుమారుడు, లాతూర్ ఎమ్మెల్యే అమిత్ నిప్పంటించారు. విలాస్‌రావ్ మృతికి సంతాప సూచకంగా భారత సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. వేలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు విలాస్‌రావ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ అభిమాన నాయకుడి మరణాన్ని తట్టుకోలేక చాలా మంది మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘విలాస్‌రావ్ అమర్ రహే’ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.

ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితర రాజకీయ నాయకులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. 67 ఏళ్ల విలాస్‌రావ్ కాలేయ, కిడ్నీ సమస్యలతో మంగళవారం చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే. బుధవారం ఉదయం భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన భౌతికకాయాన్ని చెన్నై నుంచి బభల్‌గావ్‌కు తీసుకొచ్చారు. స్థానిక దయానంద్ విద్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మన్మోహన్, సోనియాలు విలాస్‌రావ్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. శోకసంద్రంలో మునిగిన విలాస్‌రావ్ కుటుంబీకులను వారు ఓదార్చారు. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో లాతూర్-బభల్‌గావ్ రహదారి కిక్కిరిసిపోయింది.

ఎయిర్‌పోర్టు నుంచి విలాస్‌రావ్ పార్థివ దేహాన్ని తీసుకొస్తున్న వాహనాన్ని ప్రజలు మార్గమధ్యంలో ఆపి, ఆశ్రు నయనాలతో నివాళులర్పించారు. దాంతో ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 14 కి.మీ. దూరంలో ఉన్న బభల్‌గావ్ వెళ్లేందుకు రెండున్నర గంటల సమయం పట్టింది. భౌతికకాయం ఉంచిన వేదిక వద్దకు అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అనంతరం సమీప బంధువుల సందర్శనార్థం విలాస్‌రావ్ భౌతికకాయాన్ని ఆయన పూర్వీకుల ఇంటికి, తర్వాత అంత్యక్రియల నిమిత్తం వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. తన తండ్రి డగదోజీరావ్ దేశ్‌ముఖ్ సమాధి సమీపంలోనే విలాస్‌రావ్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరైన ఇతర ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు షిండే, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, వయలార్ రవి, రాజీవ్ శుక్లా, ముకుల్ వాస్నిక్, మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, బీజేపీ చీఫ్ గడ్కారీ, ఆ పార్టీ నేత గోపీనాథ్ ముండే, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ తదితరులున్నారు.

మంచి పరిపాలనావేత్త: హజారే
విలాస్‌రావ్ మంచి పరిపాలనావేత్త అని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కొనియాడారు. మహారాష్ట్రలో ఆర్టీఐ, గ్రామసభ చట్టాల అమల్లో ఆయనది కీలక పాత్ర అని హజారే అన్నట్టు ఆయన సన్నిహితుడొకరు ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు.