ఏ, బీ, ఏబీ గ్రూపుల వారికి వ్యాధుల అవకాశం ఎక్కువ
వాషింగ్టన్: ...
గుండె జబ్బుల ముప్పు బ్లడ్ గ్రూపులపై ఆధారపడి ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ‘ఓ’ గ్రూపుతో పోలిస్తే ‘ఏ’, ‘బీ’, ‘ఏబీ’ గ్రూపుల వారికి ఈ వ్యాధులు వచ్చే అవకాశం మరింత ఎక్కువని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయన ఫలితాల వివరాలు.. ఏ గ్రూపు వ్యక్తులకు గుండె వ్యాధుల ముప్పు 5 శాతం, ‘బీ’ వారికి 11 శాతం ఎక్కువ. అరుదైన ఏబీ గ్రూపు విషయంలో ఇది 23 శాతం ఎక్కువ. ఓ గ్రూపు మాత్రం వీటికి భిన్నం. ఈ గ్రూపు వారిలో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకునే ఓ పదార్థం ఉంటుంది.
దీంతో వ్యాధుల ముప్పు తక్కువ. ఏ గ్రూపులో ‘ఎల్‌డీఎల్’ అనే హానికారక కొవ్వు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు లక్ష మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించి ఈ నిర్ధారణలకు వచ్చారు. గుండె జబ్బుల ముప్పును గుర్తించేందుకు వైద్యులకు ఈ ఫలితాలు దోహదపడతాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ లీ కీ పేర్కొన్నారు. బ్లడ్ గ్రూపులను మార్చలేం కనుక, వాటికి గుండె వ్యాధులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుని ఆరోగ్యకర జీవన శైలిని అలవరచుకోవడం వల్ల ముప్పును తగ్గించుకోవచ్చన్నారు. అధ్యయన ఫలితాలను ‘ఆర్టీరియోస్ల్కరోసిస్’ పత్రికలో ప్రచురించారు.