NEWS

Blogger Widgets

23.6.12

ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత



కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి పేట్రేగిపోయారు. ఓ హోటల్‌పై మారణాయుధాలు, బాంబులతో విరుచుకుపడి 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. అనంతరం జరిగిన హోరాహోరీ పోరులో భద్రతా బలగాలు... ఉగ్రవాదులను హతమార్చాయి.
ఉత్తర కాబూల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు ధరించిన తాలిబన్లు కాబూల్ శివార్లలోని స్పోజ్‌మై హోటల్‌లోకి గురువారం అర్ధరాత్రి చొరబడ్డారు. మెషీన్‌గన్లతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మొదట అక్కడి సిబ్బందిని హతమార్చారు. అనంతరం, హోటల్‌లోని కొంత మంది అతిథుల్ని బందీలుగా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు రంగప్రవేశం చేసి ఉగ్రవాదులతో తలపడ్డాయి. 

సుమారు 12 గంటలపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 13 మంది అఫ్ఘాన్ పౌరులు, నలుగురు భద్రతా సిబ్బంది, ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం చెప్పారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హోటల్‌పై దాడిచేశారని, వారందరినీ కాల్పుల్లో మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. కృత్రిమంగా నిర్మించిన కార్గా సరస్సు పక్కనే నిర్మించిన రెండంతస్తుల స్పోజ్‌మై హోటల్ రాత్రి పార్టీలకు ప్రసిద్ధి చెందింది. ఉగ్రవాదుల ముప్పు తక్కువగా ఉండడంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడ బసచేస్తుంటారు. అయితే, వారాంతపు పార్టీల్లో ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం సేవించడం, ఇతర కార్యక్రమాలకు వారు పాల్పడుతుండడంతో ఉగ్రవాదులు ఈ దాడులు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధమున్న తాలిబన్లే ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.