NEWS

Blogger Widgets

23.6.12

కోటి లింగాల మహా క్షేత్రం భైరవకోన



Bhairavakona 1Crore Siva Lingas
భైరవకోన పేరు చెప్పగానే శివ లింగాలు గుర్తొస్తాయి. నిజమే మరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న భైరవకోన క్షేత్రంలో ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ పుణ్యక్షేత్రంలో కోటి లింగాలు ఉన్నాయని తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు మొదలైన చారిత్రక ఆధారాలు చాటుతున్నాయి. అలాగే, భైరవకోనలో అనేక కోనేరులు ఉన్నాయి. ఇక్కడ ఇంకా చిత్రమైన, అపురూపమైన విషయం ఏమంటే ఒకే రాతితో ఎనిమిది ఆలయాలు నిర్మించడం.
ప్రకాశం జిల్లా సీ.ఎన్. పురం మండలంలో అంబవరం కొత్తపల్లి గ్రామానికి దగ్గర్లో ఉంది భైరవకోన. ఒకే కొండ రాతితో ఎనిమిది దేవాలయాలను రూపొందించడంతో ఈ క్షేత్రానికి విశిష్టత వచ్చింది. ఎనిమిది ఆలయాల్లో ఎనిమిది రకాలుగా శివ రూపాన్ని మలిచారు.
భైరవకోనలో భైరవేశ్వరుని ఆలయంతో బాటు, త్రిముఖ దుర్గాదేవి దేవాలయం ప్రసిద్ధి పొందింది. మన వాస్తు శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనం భైరవకోన. ఒకే రాతిపై దేవతామూర్తుల చిత్తరువులతో బాటు, ఆ దేవతలకు ఆలయాలను కూడా రూపొందించడం ఆశ్చర్యకరమైన సంగతి.
భైరవకోనలో భైరవుని ప్రతిమకు ఎదురుగా ఉన్న ఎనిమిది ఆలయాల్లో శివలింగ రూపాలను తీర్చిదిద్దారు. ఇక్కడ చెక్కిన శిసినాగు శివలింగం అమర్నాథ్ లోయలో షోడశ కళాత్మకమైన శివలింగాన్ని తలపిస్తుంది.
భైరవకోన క్షేత్రంలో ఏడు ఆలయాల మధ్యలో సుమారు రెండు అడుగుల లోతున దుర్గాదేవి ఆలయంఉంది. అనేక విశిష్టతలకు తోడూ, కనకదుర్గాదేవి విగ్రహమూ అద్భుతంగానే ఉంటుంది. దుర్గమ్మ తల్లి సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవిల ముఖాలతో కనిపిస్తూ భక్తులను అలరిస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను ప్రతిఫలించేలా ఈ విగ్రహం ఉంటుంది. దుర్గామాత ఎదురుగా శివరూపాన్ని ప్రతిష్టించారు.
భైరవకోనలోని దుర్గాదేవి ఆలయానికి కొంచెం కిందిభాగంలో సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఇది వేసవిలో సైతం ఎండిపోదు. సర్వకాల సర్వావస్తల్లో ఈ సెలయేరు ప్రవహిస్తూనే ఉంటుంది. సెలయేరు ఇంకిపోకపోవడమే కాదు, వర్షాలు బాగా పడే తరుణంలో ఉధ్రుతంగా ప్రవహించినప్పటికీ ఆలయంలోనికి బొత్తిగా నీరు వెళ్ళకపోవడం మరో గొప్ప సంగతి.
భైరవకోనలో ఇంకో విశేషం కూడా ఉంది. ఏటా కార్తీక పౌర్ణమి రోజున రాత్రి 7-9 గంటల సమయంలో చంద్రుని కిరణాలు దుర్గాదేవి ఆలయంలో ప్రసరిస్తాయి. కేరళ, శబరిమలై క్షేత్రంలో సంక్రాంతినాడు మకర జ్యోతిని వీక్షించడానికి లక్షలాదిమంది తరలివచ్చినట్లే, భైరవకోన దుర్గాదేవి ఆలయంలో కార్తీక పూర్ణిమ నాడు దేవిపై ప్రసరించే చంద్ర కిరణాలను చూట్టానికి భక్తులు పోటెత్తుతారు.
ఏక శిలపై వెలసిన అష్ట ఆలయాలు, మరెన్నో విశిష్టతలు, భైరవకోనను అరుదైన పుణ్యక్షేత్రంగా నిలిపాయి. ఇక్కడి కాశీ విశ్వేశ్వర లింగాన్ని పూజించడం చాలా శ్రేష్టం. నిత్యం కోలాహలంగా ఉండే భైరవకోన కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి పుణ్య దినాల్లో మరింత రద్దీగా ఉంటుంది.