NEWS

Blogger Widgets

30.6.12

చత్తీస్‌గఢ్ భారీ ఎన్‌కౌంటర్‌తో హై అలర్ట్


  • 30/06/2012
ఆదిలాబాద్, జూన్ 29: జిల్లా సరిహద్దులోని చత్తీస్‌ఘడ్‌లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఎదురు కాల్పుల ఘటనల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన పోలీసు వర్గాల్లో అలజడి సృష్టించింది. శుక్రవారం చత్తీస్‌ఘడ్‌లోని....
బీజాపూర్, సుకుమా, కంకేర్ జిల్లాల్లో మావోయిస్టులకు, సిఆర్‌పిఎఫ్ దళాలకు మధ్య జరిగిన హొరాహొరి ఎదురు కాల్పుల్లో 24 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లకు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద భారీ ఎన్‌కౌంటర్ జరగడంతో మావోయిస్టు దళాలు తప్పించుకొని ఆంధ్ర సరిహద్దుల్లో ప్రవేశిస్తాయని భావించి జిల్లా ఎస్పీ పోలీసుస్టేషన్లకు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు సంస్తాగత మార్పుల్లో భాగంగా జిల్లా నుండి సుమారు 30 మంది చత్తీస్‌ఘడ్ అజ్ఞాతవాసంలో పని చేస్తున్నందున అక్కడ నిర్భంధం పెరిగితే తలదాచుకొనేందుకు ఈ జిల్లాకు రావచ్చనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. అంతేగాక చత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోలు జిల్లాలో ఏవైనా ఘటనలకు పాల్పడే అవకాశం వుందని భావిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇటు కాగజ్‌నగర్, కౌటాల, దహెగాం, చెన్నూర్ నియోజకవర్గంలోని వేమనపల్లి, నెనె్నల, చెన్నూర్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిఘా తీవ్రతరం చేసి నక్సల్స్ కదలికలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఈ ప్రాంతాల్లో నక్సల్స్ కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేస్తూనే వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తూ అనుమానం వున్న చోట సోదాలు చేస్తున్నారు.