NEWS

Blogger Widgets

15.7.12

రూ. 67కే కార్ల కంపెనీ..!


నెదర్లాండ్స్ ప్లాంట్‌ను ఒక్కయూరోకే విక్రయించిన మిత్సుబిషి
నష్టాల్లో ఉండటమే కారణం
ఉద్యోగులను తొలగించరాదని షరతు.....

టోక్యో: అన్నింటి రేట్లు భగ్గుమంటున్న ప్రస్తుత తరుణంలో వంద రూపాయలకి ఏమేం కొనగలమో తడుముకోకుండా టక్కున చెప్పగలరా? కష్టంగా ఉంది కదూ.. సరే ఈ విషయాన్ని పక్కనపెడితే.. యూరప్‌లో అంత కన్నా తక్కువగా సుమారు 67 రూపాయలకి (1 యూరో) ఏకంగా ఒక కార్ల కంపెనీయే దొరుకుతోంది. ఏంటీ... మీకు ఇంకా నమ్మకం కుదరడం లేదా? కానీ ఇది అక్షరాలా నిజం. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మిత్సుబిషి.. నష్టాల్లో ఉన్న తమ యూరప్ ప్లాంటులోని 1,500 మంది ఉద్యోగుల భవిష్యత్ కోసం ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. నామమాత్రంగా ఒక్క యూరోకే నెదర్లాండ్స్ కార్ (నెడ్‌కార్)ను వీడీఎల్ గ్రూప్‌కి విక్రయించింది.

ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత పరిస్థితులు దరిమిలా నష్టాలు, అప్పుల భారాలను భరించలేక కంపెనీలు ప్లాంట్లను మూసివేయడమో లేదా ఉద్యోగులను భారీగా తొలగించడమో చేస్తున్నాయి. యూరో సంక్షోభంతో ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మిత్సుబిషి మోటార్స్‌కి కూడా యూరప్‌లోని తమ ఏకైక ప్లాంటు నెడ్‌కార్ విషయంలో సరిగ్గా ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. నెదర్లాండ్‌లో ఏర్పాటైన నెడ్‌కార్.. అవుట్‌ల్యాండర్, కోల్ట్ బ్రాండ్ కార్లను తయారు చేస్తోంది.

కంపెనీ ఒకప్పుడు ఏటా గరిష్టంగా 2,00,000 వాహనాలు ఉత్పత్తి చేసింది. అయితే, కొన్నాళ్లుగా యూరప్ దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో అమ్మకాలు భారీగా క్షీణించాయి. గతేడాది ఉత్పత్తి పావు భాగానికి..అంటే 40,739 వాహనాల స్థాయికి పడిపోయింది. మిత్సుబిషి గతేడాది ఉత్పత్తి చేసిన వాహనాల్లో నెడ్‌కార్ ప్లాంటు వాటా ఐదు శాతం కన్నా తక్కువే. ఫలితంగా నెడ్‌కార్ ప్లాంటుపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి (2013 మార్చి) మిత్సుబిషి ఏకంగా 35.3 కోట్ల డాలర్ల నష్టాలు వస్తాయని అంచనా వేసింది.

ప్లాంటు మూసేద్దామా?
నష్టాలొచ్చినా సరే .. త్వరలో యూరప్‌లో పరిస్థితులు బాగుపడతాయి, అమ్మకాలు మళ్లీ పెరుగుతాయి అనుకోవడానికి వీల్లేని పరిస్థితి ఉంది. ఇప్పటికే.. ఇండోనేసియా, థాయ్‌లాండ్‌లో కొత్త ప్లాంట్లు నిర్మించుకున్న మిత్సుబిషి.. కష్టాల్లో ఉన్న యూరప్ కన్నా వర్ధమాన దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇలాంటప్పుడు యూరప్ ప్లాంటును కొనసాగించడం కష్టమవుతుండటంతో ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నెడ్‌కార్‌లో ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు మిత్సుబిషి ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు వెంటనే సమ్మెకు దిగారు. నెడ్‌కార్‌ను కొనుగోలు చేసే కంపెనీని అన్వేషించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.

కొనుగోలుదారుకోసం అన్వేషణ..
కార్మికుల డిమాండుతో పునరాలోచనలో పడిన మిత్సుబిషి ప్రెసిడెంట్ కెన్ కొబయాషీ.. తాము నెడ్‌కార్‌ను నామమాత్రంగా ఒక్క యూరోకే విక్రయించేందుకైనా సిద్ధమని ప్రకటించారు. కొనుగోలు చేసే కంపెనీ ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోమంటూ హామీ ఇవ్వాలని షరతు పెట్టారు. ఈ షరతుకు ఒప్పుకుంటూ నెదర్లాండ్స్‌కే చెందిన వీడీఎల్ గ్రూప్ అనే బస్సుల తయారీ సంస్థ నెదర్లాండ్స్ కార్ (నెడ్‌కార్)ను కొనేందుకు ముందుకొచ్చింది. దీంతో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాంటును వీడీఎల్ గ్రూప్‌కి ఒక్క యూరోకే విక్రయిస్తున్నట్లు ఇటీవల మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది.

నెడ్‌కార్ స్వరూపం...
నెదర్లాండ్స్ కార్ (నెడ్‌కార్) కంపెనీ బెల్జియం, జర్మనీ సరిహద్దుల్లో నెదర్లాండ్స్‌లోని బార్న్ ప్రాంతంలో ఉంది. 1991లో మిత్సుబిషి మోటార్స్, వోల్వో, డచ్ ప్రభుత్వం కలిసి జాయింట్ వెంచర్‌గా దీన్ని ఏర్పాటు చేశారు. మిగతా భాగస్వాముల వాటాలను కొనుక్కున్న మిత్సుబిషి 2001లో కంపెనీ పూర్తిస్థాయి యజమానిగా మారింది. నెడ్‌కార్‌లో ప్రస్తుతం 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు.