NEWS

Blogger Widgets

15.7.12

గడువులోపు రిటర్నులు వేద్దాం


7/15/2012 1:09:00 AM
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేయడానికి ఇక 15 రోజుల సమయమే ఉంది. రిటర్నులు దాఖలుకు సంబంధించిన మార్గదర్శకాలు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విడుదల చేసింది. ఈ సంవత్సరం రిటర్నులు దాఖలు చేయడానికి సంబంధించిన మార్పులు, గడువులోగా రిటర్నులు దాఖలు చేయకపోతే వచ్చే ఇబ్బందులపై ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ....

ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈనెల 31. పన్ను చెల్లించినవారు ఈ గడువులోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సీబీడీటీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించి మూడు ముఖ్యమైన మార్పులు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది.... విదేశాల్లో ఎటువంటి ఆస్తులు ఉన్నా సరే... వారు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా సరే రిటర్నులు దాఖలు చేయాలి. అంతేకాకుండా వీరు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

విదేశీ ఆస్తులు ఉన్నవారు ఐటీఆర్ 2, 3, 4 ఫారాలలో ఒక దానిని వినియోగించాల్సి ఉంటుంది. విదేశీ ఆస్తుల వివరాలను తెలియచేయడానికి ఈ ఫారాలలో ప్రత్యేక కాలమ్స్‌ను పేర్కొనడం జరిగింది. అలాగే ఇది కాకుండా ఐదు లక్షల లోపు జీతం ఆదాయంగా ఉండి, ఎటువంటి రిఫండ్‌లు లేని వారు రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. వాళ్లకిచ్చే ఫారం 16నే ఇక నుంచి రిటర్నులుగా పరిగణిస్తారు. వార్షిక ఆదాయం ఐదు నుంచి పది లక్షల లోపు ఉన్న వారికి రిటర్నుల దాఖలులో ఎటువంటి మార్పులు జరగలేదు. రూ. పది లక్షలు ఆదాయం దాటిన వారు మాత్రం ఇక నుంచి కాగితాల రూపంలో రిటర్నులు దాఖలు చేయడానికి లేదు. తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే దాఖలు చేయాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు అనేకం...
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను సకాలంలో చెల్లిస్తే రిటర్నుల దాఖలు విషయంలో అంతగా పట్టింపులుండవు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ అయినా 2013 మార్చి 31 వరకు కూడా రిటర్నులు దాఖలు చేయవచ్చు. లేకపోతే ఆ మరుసటి సంవత్సరం కూడా దాఖలు చేయొచ్చు. సకాలంలో రిటర్నులు దాఖలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. జూలై 31లోగా దాఖలు చేయకపోతే వీటిని కోల్పోతాం. ముఖ్యంగా రిటర్నులు నిర్దిష్ట గడువులోగా దాఖలు చేయడం వల్ల ఏమైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. ఎన్నిసార్లైనా రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. అదే గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేస్తే ఇక రివైజ్డ్ వేయడానికి వీలుండదు. ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. సకాలంలో రిటర్నులు దాఖలు చేస్తే స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన నష్టాలను రానున్న సంవత్సరాల్లో చూపించుకొని పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. గడువులోగా దాఖలు చేయకపోతే మాత్రం ఈ మూలధన నష్టాలను వచ్చే సంవత్సరాల్లో చూపించుకునే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే రెండు మూడు సంవత్సరాల రిటర్నులు కలిపి ఒకేసారి దాఖలు చేసినప్పుడు ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోరింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చెక్ చేసుకోండి...
రిటర్నులు దాఖలు చేసేటప్పుడు క్లెయిమ్‌లన్నీ పూర్తిగా ఉపయోగించుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సెక్షన్ 80సీ ద్వారా లభించే పన్ను ప్రయోజనాలు కాకుండా పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అనేక డిడక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి... స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై వచ్చిన నష్టాలను ఆదాయంలోంచి తగ్గించి చూపించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల వ్యాధులకు ఏమైనా చికిత్స తీసుకుంటే సెక్షన్ 80డీడీబీ కింద ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంగవైకల్యం, విరాళాలు, విద్యా రుణంపై చెల్లించే వడ్డీ ఇలా...అందుబాటులో ఉన్న క్లెయిమ్‌లను వినియోగించుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.

ఆన్‌లైన్ ద్వారా...
ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు రెండు రకాలుగా దాఖలు చేయవచ్చు. నేరుగా మీరే యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా లేక ఈ-రిటర్న్ ఇంటర్మీడియట్స్ ద్వారా దాఖలు చేయవచ్చు. ఇంటర్మీడియట్స్ ద్వారా దాఖలు చేస్తే వారు రిటర్నులు దాఖలు చేయడంలో సహాయం చేస్తారు. ఆడిటర్ సహాయం తీసుకుంటే మీ ఆదాయ లావాదేవీల ప్రకారం చార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. సొంతంగా మీకు మీరే రిటర్నులు దాఖలు చేసుకోవాలంటే ముందుగా మీరు https://incometaxindiaefiling.gov.in వెబ్ సైట్‌ను దర్శించి మీకు సంబంధించిన ఐటీఆర్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందులో మీ ఆదాయ వివరాలు, సేవింగ్స్, టీడీఎస్, పన్ను చెల్లింపులు తదితర వివరాలన్నీ పూర్తి చేయండి. అలాగే బ్యాంకు అకౌంట్ వివరాలను ఇవ్వడం మర్చిపోవద్దు. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఎక్స్‌ఎంఎల్ ఫైల్‌ను జనరేట్ చేయండి. ఈ ఫైల్‌ను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఐటీఆర్-వి ఫారమ్‌ను ప్రింట్ తీసుకొని బెంగళూరులోని కేంద్ర కార్యాలయానికి 120 రోజుల్లోగా అందేటట్లుగా పంపించండి.

వీరు రిటర్నులు వేయక్కర్లేదు..
సీబీడీటీ మార్గనిర్దేశకాల ప్రకారం వార్షిక జీతం రూ.5 లక్షల లోపు ఉండి, సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటకుండా ఉంటే రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. దీనివల్ల సుమారు 85 లక్షల మందికి ఊరట లభించనుంది.

వర్తించాలంటే: ఏ ఇతర ఆదాయాలు లేకుండా, జీతం, వడ్డీ మాత్రమే ఆదాయంగా కలిగివుండాలి. ఈ ఆదాయం రూ.5లక్షలు దాటకూడదు. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థకు మీ ఆదాయ వ్యయాలు, సేవింగ్స్ వివరాలను పూర్తిగా తెలియచేయాలి. దీని ప్రకారం పన్ను భారం లెక్కించి ఏమైనా పన్ను చెల్లించాలంటే టీడీఎస్ రూపంలో పనిచేస్తున్న కంపెనీయే చెల్లిస్తుంది. ఈ మేరకు మీకు ఫారమ్ 16ను అందిస్తుంది. ఇక నుంచి ఈ ఫారమ్ 16నే రిటర్నులుగా భావిస్తారు.

వీరికి వర్తించదు: జీతం, వడ్డీ కాకుండా ఇతరాదాయాలు ఉన్న వారికి ఇది వర్తించదు. వార్షిక జీతం అయిదు లక్షలు దాటినా అంతే. అలాగే వార్షిక జీతం రూ.5 లక్షల లోపు ఉన్నా, ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సంస్థల్లో పనిచేస్తే మాత్రం వర్తించదు. అంటే ఉద్యోగం మారితే ఈ నిబంధన వర్తించదన్న మాట. అలాగే సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే...ముందస్తుగా అధిక పన్ను చెల్లించి రిఫండ్ కోసం ఎదురు చూస్తే మాత్రం రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం