NEWS

Blogger Widgets

15.7.12

మళ్లీ కింగ్‌ఫిషర్ పైలట్ల సమ్మె


పైలట్లు మళ్లీ సమ్మెకు దిగడంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు శనివారం మరోసారి ఆటంకం ఏర్పడింది.
40 పైగా సర్వీసులు రద్దు
జీతాల బకాయిలే కారణం

న్యూఢిల్లీ: పైలట్లు మళ్లీ సమ్మెకు దిగడంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు శనివారం మరోసారి ఆటంకం ఏర్పడింది. 40 పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి సుమారు 12 ఫ్లైట్లు, బెంగళూరు నుంచి 18, ఇతరత్రా ప్రాంతాల నుంచి మరికొన్ని సర్వీసులు ఇందులో ఉన్నాయి. ఈ నెల 11,12న విధులకు హాజరు కాని పైలట్లకు శుక్రవారం కల్లా జీతాలు చెల్లించేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ... చెల్లించలేదని ఒక పైలట్ వెల్లడించారు. దీంతో పైలట్లు మరోసారి సమ్మెకు దిగినట్లు వివరించారు. గడిచిన పన్నెండు రోజుల్లో పైలట్లు విధులకు గైర్హాజరు కావడం ఇది మూడోసారి.

మరోవైపు, ముందుగా హామీ ఇచ్చిన విధంగా దాదాపు 75% మంది ఉద్యోగులకు శుక్రవారం నాటికి జీతాలు చెల్లించేశామని కింగ్‌ఫిషర్ ప్రతినిధి తెలిపారు. కొంత మంది అకౌంట్లలోకి జమ కాకపోవడంతో ఒక వర్గం ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన వివరించారు. అందరికీ సోమవారం నాటికల్లా జీతాలు అందగలవని హామీ ఇచ్చినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. కాగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు మీడియాతో మాట్లాడొద్దని, కంపెనీ పరువు మరింత తీయొద్దని చైర్మన్ మాల్యా సూచించారు. అయితే భారీ బకాయిలు పడ్డప్పుడే కంపెనీ పరువు పోయిందని కొందరు ఉద్యోగులు వ్యాఖ్యానించడం విశేషం.