NEWS

Blogger Widgets

15.7.12

రాష్ట్రం అతలాకుతలం


కరెంట్ కోతలతో స్తంభించిన జనజీవనం
7/15/2012 1:45:00 AM
గ్రామాల్లో రెండు, మూడు గంటల సరఫరా కూడా గగనమే
మండలాల్లో 12 గంటలు, పట్టణాల్లో 8 గంటలు కరెంట్ కట్
నగరాల్లోనూ ఏడు గంటల వరకూ విద్యుత్ కోతలు అమలు
సాగుకు మూడు గంటలే.. అదీ మూడుసార్లుగా సరఫరా
లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు, వాడుతున్న తోటలు
కోతలతో మూతపడుతున్న పరిశ్రమలు.. పడిపోతున్న ఉత్పత్తి
భారీగా రైస్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులు, క్వారీలు మూసివేత
రాత్రిళ్లు వేళాపాళాలేని కరెంటు కోతలతో ప్రజలకు నిద్ర కరువు
కోతల నుంచి సర్కారు ఆస్పత్రులకూ మినహాయింపు లేదు
ఆపరేషన్లు బంద్.. పసివారి యాతన.. పాడైపోతున్న మందులు.....

(న్యూస్‌లైన్ నెట్‌వర్క్)
రాష్ట్రం మొత్తం అంధకార బంధురమైపోతోంది. జనజీవనమంతా అతలాకుతలమవుతోంది. గనిలో వనిలో ఖార్ఖానాలో ఎక్కడా మోటారు యంత్రం తిరగటం లేదు. పొలంలో నీరు పారటంలేదు.. పైరు బతకటంలేదు! పరిశ్రమల్లో పని సాగటంలేదు.. కార్మికుడికి కూలీ దొరకటం లేదు! ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరగటంలేదు.. వ్యాపారం సాగటంలేదు! ఇంట్లో అయినా ఆఫీసులో అయినా చివరికి ఆస్పత్రిలో అయినా ఫ్యాను తిరగటం లేదు. కంప్యూటర్ నడవటం లేదు. జిరాక్స్ మిషన్, వెల్డింగ్ యంత్రం, మరమగ్గం, స్టోన్ క్రషింగ్.. చిన్నదీ, పెద్దదీ అని లేదు.. కరెంటుతో పనిచేసే ప్రతి యంత్రం నడవటం గగనంగా మారింది. ఎడాపెడా పెరుగుతూ పోతున్న కరెంటు కోతలు అన్ని వర్గాల వారిపైనా, అన్ని రంగాలపైనా పెను ప్రభావం చూపుతున్నాయి. సామాన్యుడి బతుకు దుర్భరంగా మారుతోంది. ఎండుతున్న పైరును కాపాడుకునే దిక్కులేక కర్షకుడు దీనుడవుతున్నాడు. కర్మాగారాల్లో పనిలేక కార్మికులు వీధిపాలవుతున్నారు. చిన్నా చితకా వ్యాపారులు బిక్కచచ్చిపోతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూసివేయటం మినహా గత్యంతరం కనిపించటంలేదు. కరెంటు కొరత పేరుతో భారీగా విద్యుత్ కోతలు ప్రకటించిన ప్రభుత్వం.. అనధికారికంగా లోడ్ రిలీఫ్ పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు మరింత ఎక్కువగా సరఫరా నిలిపివేస్తోంది.

అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో.. వస్తే ఎంత సేపు ఉంటుందో ఊహకందని విషయంగా మారింది. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా కోసం పరిశ్రమలకు భారీగా కోతలు ప్రకటించిన సర్కారు వారు.. సాగుకు పట్టుమని మూడు గంటలు కూడా సరఫరా చేయటం లేదు. గ్రామాల్లో రోజుకు 12 గంటలు కోతలు ప్రకటించగా.. వాస్తవానికి గంట, రెండు గంటలు మించి విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ఇక మండల కేంద్రాల్లో 7 గంటల విద్యుత్ కోత ప్రకటించగా.. 10 నుంచి 12 గంటలు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఐదు గంటల కోతలు ఉంటాయని చెప్పి.. 8 గంటలు కోత విధిస్తున్నారు. ఇక నగరాల్లో మూడు గంటల కోతే ఉంటుందని ప్రకటించగా.. ఐదు గంటల పాటు విద్యుత్ కోతలు అమలుచేస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు దగ్గరపడ్డ సమయంలో.. ఐటీఐల వంటి పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో యంత్రాలు పనిచేయక, ప్రాక్టికల్స్ ప్రాక్టీసు లేక విద్యార్థులు లబోదిబోమంటున్నారు.

జన జీవనం అస్తవ్యస్తం...

వర్షాకాలం మొదలై నెల రోజులు దాటినా వేసవిని మించి కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. విద్యుత్ కొరత పేరుతో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కోతల సమయాలకు రెట్టింపుగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నగరాల్లోనే ఐదు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తుంటే పట్టణాల్లో ఎనిమిది గంటలు కోత విధిస్తున్నారు. నగరాల్లో ఉదయం 5 గంటల నుంచి 6 వరకూ, తిరిగి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ, మళ్లీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో పరిస్థితి అయితే.. మిణుగురు పురుగులా అప్పుడప్పుడూ మెరిసి మాయమవటం తప్ప.. నాణ్యమైన కరెంటు సరఫరా అన్నదే లేకుండాపోయింది. జనం రాత్రి వేళల్లో కంటినిండా కునుకుతీసి రెండు నెలలయిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. విజయవాడలో అర్ధరాత్రి వేళల్లోనూ అనధికారికంగా కోతలు విధిస్తూ విద్యుత్తు శాఖ జనానికి నరకం చూపుతోంది. చిత్తూరు పట్టణంలో అధికారికంగా ఏడు గంటలకు పైగా కోత విధిస్తున్నారు. తిరుపతిలో ఉదయం గంటన్నర, మధ్యాహ్నం గంటన్నర అధికారికంగా ఉన్నా.. మధ్య మధ్యలో గంటపాటు అనధికార కోత విధిస్తున్నారు.

తాగు నీటికీ కటకట..

పల్లెల్లో, పట్టణాల్లో విద్యుత్ కోతల వల్ల తాగునీటికి కటకటలాడుతున్నారు. నీరున్న చోట్ల కూడా కరెంటు లేక మునిసిపాలిటీలు, పంచాయతీలు ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు12 గంటల విద్యుత్ కోత కారణంగా మంచినీటి సరఫరా పూర్తిగా పడకేస్తోంది. చాలా గ్రామాల్లో ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య మంచినీటి సరఫరా జరుగుతుంది. ఆ సమయంలోనే విద్యుత్ కోత అమలులో ఉండటంతో ఇబ్బందులు తప్పటంలేదు. అనధికార కోతలతో ప్రభుత్వ, ప్రరుువేటు కార్యాలయాల కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ముందుకు సాగటం లేదు. కంప్యూటర్లు పనిచేయకపోవటంతో పనులు నిలిచిపోతున్నాయి.

పెను సంక్షోభంలో వ్యవసాయం

ఖరీఫ్ సీజన్‌లో ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు కరెంటు రాక.. వ్యవసాయం పెను సంక్షోభంలో చిక్కుకుంది. సాగుకు ఏడుగంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. వ్యవసాయానికి ఇచ్చే కరెంటును మూడు గ్రూపులుగా చేసి కనీసం 3 గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో నాట్లు వేయడం ఆలస్యమవుతోంది.

ఊ పశ్చిమగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ విద్యుత్ బోర్లను నమ్ముకుని వేసిన నారుమళ్లు ఎండిపోతున్నారుు. చేలు నై తీసి కనిపిస్తున్నారుు. జిల్లాలో 78,482 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా బోర్లు వేసుకుని సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పామాయిల్, అరటి తదితర పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటల పరిస్థితి ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఊ ప్రకాశం జిల్లాలో ఇప్పటికే జిల్లాలో 13 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు నిలువునా ఎండిపోయాయి. కూరగాయలు, నిమ్మ, బొప్పాయి, అరటి తోటల పరిస్థితీ ఇంతే. వేరుశనగ, పూలతోటలు, కూరగాయల రైతులు కష్టాల్లో ఉన్నారు. కోతల దెబ్బకు సుమారు 10-12 వేల ఎకరాల్లో వివిధ పంటలు ఎండుముఖం పట్టాయి. బోర్ల కింద పది వేల ఎకరాల్లో సాగవుతున్న వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయి. చిత్తూరు జిల్లాలో రైతులు వ్యవసాయం మానుకుని రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతున్నారు. సాగు భూములు బీడు భూములుగా మారాయి.

ఊ ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1.22 లక్షల హెక్టార్లలో పత్తి, 1800 హెక్టార్లలో వరి నారు, 6 వేల హెక్టార్లలో మొక్కజొన్నతో పాటు మరో పది వేల హెక్టార్లలో వివిధ పంటలు నీరు లేక వాడిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో వ్యవసాయానికి నాలుగు గంటలే విద్యుత్ ఇస్తున్నా.. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట ప్రతీ గంటకు కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు సరఫరా ఇప్పటికే నిలిపివేస్తున్నారు.

ఆక్వాకు ఆక్సిజన్ అందటం లేదు..

వాతావరణ మార్పులతో చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ లోపాన్ని అధిగమించడానికి అవసరమైన ఏరియేటర్లు విద్యుత్ కోతల వల్ల తిరగటం లేదు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు నష్టపోకతప్పదని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో 3,000 హెక్టార్లలో రొయ్యలు, 5,000 హెక్టార్లలో చేపల చెరువులున్నాయి. కోతల కారణంగా డీజిల్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. హెక్టార్‌కు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది.

మూతపడుతున్న పరిశ్రమలు..

కరెంటు కోతలు, పవర్ హాలిడేలతో చిన్నతరహా, కుటీర పరిశ్రమలు మూతపడుతున్నాయి. భారీ పరిశ్రమలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. నాన్ కంటిన్యువస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్‌కు వారంలో మూడు రోజులు, కంటిన్యువస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్‌కు నెలలో 12 రోజులు పవర్ హాలిడే విధిస్తున్నారు. వారానికి మూడు రోజులు పవర్ హాలిడేతో పాటు.. రోజూ 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో పనిలేక కార్మికులు వీధిన పడుతున్నారు. వారానికి కేవలం 3 రోజుల పనిదినాలతో కనీసం నెలలో సగం రోజులకు కూడా జీతం అందే పరిస్థితి ఉండటం లేదు. పిండి, కారం మిల్లులు, నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు, ఫొటో స్టూడియోల నిర్వాహకులు కూడా కరెంటు కోతలతో ఇబ్బందిపడుతున్నారు. రైస్‌మిల్లులు, క్రషర్‌లు, ఐస్ తయారీ ఫ్యాక్టరీలు, గ్యాస్‌వెల్డింగ్ దుకాణాలు పనిచేయక యజమానులు, కూలీలు ఉపాధి కోల్పోతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 440 రైస్ మిల్లుల్లో కోతల వల్ల 40 మాత్రమే పనిచేస్తున్నారుు. మిగతావి మూతపడగా.. సుమారు 20 వేల మంది కార్మికుల ఉపాధికి గండి పడింది. జిల్లాలో మరో ప్రధానమైన క్వారీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. కోతల వల్ల స్టోన్ క్రషర్లు పనిచేయక కార్మికులు రోడ్డునపడ్డారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని తవుడు నుంచి నూనె ఉత్పత్తి చేసే సారుు ఆగ్రో ఇండస్ట్రీస్ పవర్ హాలిడే వల్ల శుక్రవారం మూతపడింది.

అనంతపురం జిల్లాలో కరెంట్ కోతల వల్ల 1.60 లక్షల మంది చేనేత కార్మికుల భవితవ్యం అంధకారంగా మారింది. విద్యుత్ కోతల వల్ల వారు పనిచేయలేని దుస్థితి నెలకొంది. రాయదుర్గంలో ఐదు వేల మంది టెక్స్‌టైల్ పరిశ్రమ కార్మికులకు పని లేకుండా పోయింది. తాడిపత్రిలో పాలిష్ బండల పరిశ్రమల్లో పనిచేసే ఆరు వేల మంది కార్మికులదీ అదే పరిస్థితి. గార్మెంట్స్, పాలిష్ బండలు, చేనేత, పవర్‌లూమ్స్ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.
గుంటూరు జిల్లాలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల పరిధిలోని పరిశ్రమలు విద్యుత్ కోత కారణంగా పనిగంటల్ని తగ్గించుకుని, దినసరి కూలీల్ని సైతం బయటకు పంపుతున్నారు. విజయనగరం జిల్లాలోని ఏడు జూట్ మిల్లుల్లో పనిచేస్తున్న 20 వేల మంది, ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న 10 వేల మంది, ఫెర్రోఅల్లాయిస్ కంపెనీల్లో పని చేస్తున్న 10 వేల మంది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

ఖమ్మం జిల్లాలో పాల్వంచ నవభారత్, స్పాంజ్‌ఐరన్, ఐటీసీ, భద్రాచలం పేపర్ మిల్లు, కల్లూరు, మధుకాన్ షుగర్స్‌తోపాటు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో 700 గ్రానైట్ ఫ్యాక్టరీలు, 250 రైస్‌మిల్లులు, 92 ధాన్యం లెవీ మిల్లులు, 15 బాయిల్డ్ మిల్లులు ఇతర పరిశ్రమలు కలుపుకొని మొత్తం 1066 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. విద్యుత్ కోతల మూలంగా ఉత్పత్తి తగ్గి, వేతనాలు ఇవ్వలేక కార్మికులను కుదించటంతో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే వేలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారు.

సర్కారీ ఆస్పత్రుల్లో నరకయాతన

ఆస్పత్రులకు కరెంటు కోతలు విధించబోమన్న ప్రభుత్వం.. వాటినీ వదిలిపెట్టలేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా ఆయా మండలాలు, పట్టణాలు, నగరాల్లో విధించే కోతలను అమలు చేస్తున్నారు. దీంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నెల్లూరు నగరంలోని రేబాల సరస్వతమ్మ ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రికి ఏడు గంటలకు పైగా విద్యుత్ కోత విధిస్తున్నారు. జిల్లాలో వైద్యవిధానపరిషత్ ఆధ్వర్యంలో నడిచే చిన్నపిల్లల ఏకైక ఆసుపత్రి ఇది. ఇందులో పేద, మధ్య తరగతి వర్గాల వారికి చెందిన పసికందులు ఎప్పుడూ 30 మంది వరకు ఇన్ పేషెంట్లుగా ఉంటారు. కరెంటు కోతలతో ఆస్పత్రిలో ఫ్యాన్లు తిరగక ఉక్కపోతతో పసిపిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. వారిని చూసి తల్లులు పడే బాధ అంతా ఇంతా కాదు. కోతలు, జనరేటర్ పనిచేయని కారణంగా రేబాల ఆస్పత్రిలోని ఇంక్యుబేటర్లు పనిచేయకపోవటంతో నెలలు నిండని పసికందులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన దుస్థితి. గూడూరు, కావలి, ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలల్లోను విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్యాన్లు తిరగక, లైట్లు వెలగక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిమాంక్ సెంటర్ ఏసీలు పనిచేయక వాటిలో ఉంచుతున్న చంటిపిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శీతల వాతావరణంలో ఉంచాల్సిన యాంటీ రేబిస్ వ్యాక్సిన్, యాంటీ స్నేక్ వీనమ్‌తో పాటు మరికొన్ని మందులు, ఇంజెక్షన్లు పాడైపోతున్నాయని తాడేపల్లిగూడెం ఏరియూ ఆస్పత్రి వైద్యుడు దామోదర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ కోతల కారణంగా ప్రకాశం జిల్లాలో వారం రోజులుగా రిమ్స్‌లో ఆపరేషన్లు నిలిపివేశారు. డయాలసిస్ సాగటం లేదు. ఎమర్జెన్సీ కేసులకు దిక్కులేకుండా పోయింది. ఎక్స్‌రే, సిటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇలా దేనికైనా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్, పాలకొండ జిల్లా ఆసుపత్రి, టెక్కలి ఏరియా ఆసుపత్రుల్లో జనరేటర్ సమస్యలు ఉన్నాయి. దీంతో శస్త్ర చికిత్సలకు ఇబ్బంది ఏర్పడుతోంది.