దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ఆత్మహత్య : నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రతి ఐదు ఆత్మహత్యల్లో ఒకరు గృహిణి వుండటం గమన్హారం. దేశంలో 2011లో ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు, ఆత్మహత్యలపై ప్రభుత్వం తాజా గణాంకాలతో కూడాన నివేదికను ఇటీవల విడుదల చేసింది. కాగా 2011లో..... 0.7 శాతం మేరకు ఆత్మహత్యలు పెరిగి 1,35,585 సంఖ్యను తాకాయి. గత ఏడాది ఈ సంఖ్య 1,34,599గా నమోదైనట్లు నివేదిక తెలిపింది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే 12.2 శాతం అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 16,492 ఆత్మహత్యలు జరిగినట్లు సమాచారం. ఇక తమిళనాడులో ఈ సంఖ్య 15,963, మహారాష్ట్రలో 15,947, ఆంధ్ర ప్రదేశ్‌లో 15,077, కర్నాటకలో 12,622గా నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో జరుగుతున్న మొత్తం ఆత్మహత్యల్లో 56.2 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లో జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆత్మహత్యల్లో పశ్చిమ బెంగాల్ 2009లో ప్రథమ స్థానం, 2010లో ద్వితీయ స్థానంలో నిలవగా, 2011లో అత్యధికంగాను నమోదయ్యాయి. మొత్తం ఆత్మహత్యల్లో 50.2 శాతం మేరకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో జరుగుతున్నట్లు రిపోర్టు వెల్లడించింది. ఇక బెంగళూరులో 1,717, చెన్నైలో 2,438, ఢిల్లీలో 1,385, ముంబయిలో 1,162 ఆత్మహత్యలు జరిగాయి. కాగా మొత్తం ఆత్మహత్యల్లో 36.7 శాతం మేరకు 53 మహా నగరాల్లో జరుగుతున్నాయని నివేదిక ద్వారా తెలుస్తోంది.