NEWS

Blogger Widgets

3.7.12

బెయిల్‌కు లంచం కేసులో యాదగిరి అరెస్టు



  • రూ.3.75 కోట్ల నగదు స్వాధీనం
ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ (ఓఎంసి) అక్రమ ఖనిజ తవ్వకాల కేసులో...
అరెస్టయిన గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిలు మంజూరు చేసిన వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీషీటర్‌ యాదగిరిరావును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఎట్టకేలకు కర్నూల్‌లో అరెస్టు చేశారు. అతన్ని హైదరాబాద్‌కు తరలించి అల్వాల్‌లో ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంటి పైభాగంలో ఉన్న సింక్‌రూంలో దాచిపెట్టిన రూ.3.75 కోట్ల నగుదును, ఓ స్విఫ్ట్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా అనుమానంపై యాదగిరిరావు తండ్రి బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకుని విచారణ తర్వాత వదిలిపెట్టారు. గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసేందుకు అతడి సోదరుడు సోమశేఖరరెడ్డి నుంచి తొమ్మిదిన్నర కోట్ల రూపాయల డీల్‌ కుదుర్చుకున్న వ్యవహారానికి సంబంధించి యాదగిరి రావును అరెస్టు చేసి రూ.3.75 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎసిబి డైరెక్టర్‌ జనరల్‌ బి ప్రసాదరావు తెలిపారు. గాలికి బెయిలు మంజూరైన మే 11న రాత్రి మాజీ న్యాయమూర్తి చలపతిరావుకు మూడు కోట్ల రూపాయలను యాదగిరిరావు ముట్టజెప్పాడని తెలిపారు. మధ్యవర్తిత్వం వహించినందుకు సోమశేఖరరెడ్డి ఇచ్చిన డబ్బుల్లోంచి యాదగిరిరావు 8.1 లక్షల రూపాయలతో ఓ మారుతీ కారు, నాచారంలో రూ.60 లక్షలతో రెండు ఇంటి స్థలాలను కొనుగోలు చేసినట్లు ప్రసాదరావు తెలిపారు. 


యాదగిరిరావు ఆ కారులోనే ఊటీ, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సాలు చేశాడని చెప్పారు. ఈ కేసులో యాదగిరిరావు కీలకపాత్ర పోషించాడని సమాచారమందినా అతని కోసం ఎంత వెతికినా ఫలితం దక్కలేదని, ఎట్టకేలకు కుటుంబ సభ్యులతో జల్సాలు చేసి హైదరాబాద్‌కు వస్తూ కర్నూల్‌లో దొరికిపోయాడని తెలిపారు. అతన్ని హైదరాబాద్‌కు తరలించి ఇంట్లో సోదాలు జరపామని తెలిపారు. నాచారంలో కొనుగోలు చేసిన రెండు ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కాగితాలు, స్విఫ్ట్‌కారు, సింక్‌రూంలో దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా ఈ కేసులో సస్పెండైన న్యాయమూర్తి పట్టాభిరామారావు, ఆయన కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్‌ న్యాయమూర్తి చలపతిరావును ఎసిబి అధికారులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాలి బెయిలు డీల్‌ వ్యవహారంలో తాజాగా ప్రభాకరరావు అనే జడ్జి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జ్యుడీషియల్‌ ఆఫీసర్‌గా (జిల్లా జడ్జి) పనిచేస్తున్న ప్రభాకరరావు కూడా గాలి బెయిల్‌ కోసం బేరమాడినట్లు తెలిసింది.