కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విచారణ జరుపుతున్న కేసుల దర్యాప్తు వివరాలను రెండు పత్రికలకు మాత్రమే అందిస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. భూషణ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక అత్యున్నత విచారణ సంస్థ కేసుల దర్యాప్తు వివరాలను ఇలా రెండు పత్రికలకు మాత్రమే అందించడం ఆక్షేపణీయమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ సి ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది.