వృత్తి విద్యా కళాశాలలకు ప్రతిపాదన అలాగైతేనే కన్వీనర్ కోటా ఫీజు రూ.35 వేలు చేస్తామని ప్రభుత్వం స్పష్టీకరణ అంగీకారపత్రం ఇచ్చిన వెంటనే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడి కన్వీనర్ కోటా ఫీజును రూ.40 వేలకు పెంచాలని కాలేజీల ప్రతినిధుల వినతి దీనిపై నేడు చర్చించే అవకాశం
హైదరాబాద్, న్యూస్‌లైన్: వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమగ్ర వివరాలు ఇచ్చిన 133 కళాశాలలకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులను ఖరారు చేయడానికి ప్రాథమికంగా అంగీకరించింది. మిగిలిన కళాశాలలకు మాత్రం.. కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఫీజులకు బదులు కామన్ ఫీజు కోసం కోర్టును ఆశ్రయించవద్దని షరతు పెట్టింది. కామన్ ఫీజు అమలైతే రూ.480 కోట్ల భారం పడుతుందని భావించిన ప్రభుత్వం ఈ షరతు విధించింది. ఇందుకు అంగీకరిస్తే మిగిలిన కళాశాలలకు కూడా కన్వీనర్ కోటా ఫీజును రూ.31,000 నుంచి రూ.35,000కు పెంచుతామని ప్రతిపాదించింది. శనివారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత , సాంకేతిక విద్యా శాఖ అధికారులతో సమావేశమై ఫీజుల ఖరారు, నోటిఫికేషన్ విడుదలపై చర్చించారు. ఇదే సమయంలో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘాల కన్సార్షియం ప్రతినిధులు రమేశ్ నిమ్మటూరి, డాక్టర్ కె.సునీల్ కుమార్ కూడా ఉప ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కామన్ ఫీజు కోసం పట్టుబట్టవద్దని, అలాగైతేనే కన్వీనర్ కోటా ఫీజును రూ.35 వేలకు పెంచుతామంటూ ప్రభుత్వ ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రి వారి ముందు పెట్టారు. కామన్ ఫీజుపై ప్రభుత్వ ప్రతిపాదనకు యాజమాన్య సంఘాల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఆదివారం ఏకాభిప్రాయం సాధిస్తామని, అయితే కన్వీనర్ కోటా ఫీజు రూ.40 వేలకు పెంచాలని వారు కోరారు. కామన్ ఫీజుకు పట్టుబట్టబోమంటూ కళాశాలలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చి అంగీకారపత్రం ఇవ్వాలని, అది అందిన వెంటనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని దామోదర రాజనర్సింహ కాలేజీల ప్రతినిధులకు చెప్పారు. కన్వీనర్ కోటా ఫీజు రూ.40 వేలకు పెంచాలన్న కళాశాలల ప్రతిపాదనపై ఆదివారం చర్చించే అవకాశముంది.
భారం తగ్గించుకునేందుకే షరతు..!
కన్వీనర్ కోటా ఫీజులు సరిపోవడంలేదని 2010లో వృత్తి విద్యా కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై హైకోర్టు 2011 అక్టోబర్‌లో తీర్పు వెలువరించింది. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ), మేనేజ్‌మెంట్ (బీ కేటగిరీ) కోటాలకు ఫీజులు వేర్వేరుగా ఉండకూడదని, రెండింటికీ కామన్ ఫీజు ఉండాలని స్పష్టం చేసింది. మౌలిక వసతులకు కళాశాల వెచ్చించే తలసరి వ్యయాన్ని లెక్కించి దాని ఆధారంగా కళాశాలవారీగా, కోర్సు వారీగా ఫీజు నిర్ధారించాలని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, అక్కడ కామన్ ఫీజు అంశంపై విచారణ జరగలేదు. కేవలం ఫీజుల నిర్ధారణపైనే విచారణ జరుగుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాది మే 9న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఏఐసీటీఈ పేస్కేళ్లు అమలు చేస్తున్నామని, చేస్తామని హామీ ఇచ్చే కళాశాలలన్నింటికీ వేతన వ్యయం ఆధారంగా ఫీజులు రూపొందించాలని ఏఎఫ్‌ఆర్సీని ఆదేశించింది. దీని ప్రకారం 240 కళాశాలలు హామీపత్రాలు సమర్పించాయి. వీటిలో 133 మాత్రమే సరైన వివరాలు పొందుపరిచాయి. వీటికి మాత్రం 3 నుంచి 150 శాతం వరకు ఫీజులు పెంచుతూ ఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదించింది. పెరుగుతున్న ఫీజుల వల్ల రీయింబర్స్‌మెంట్ పథకం రూపంలో ప్రభుత్వంపై రూ.90 కోట్ల భారం పడనుంది. హైకోర్టు ఆదేశించినట్టుగా కామన్ ఫీజు అమలుచేయాల్సి వస్తే.. 133 కళాశాలల్లో సగటు ఫీజు సుమారు రూ.70,000 అవుతుంది. మిగిలిన కళాశాలల్లో రూ.50,200 అవుతుంది. ఇంతమొత్తంలో ఫీజు పెరిగితే.. ఒక్క ఇంజనీరింగ్‌లోనే రూ.312 కోట్ల మేర ప్రభుత్వానికి భారం పడుతుంది. ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, ఇతర కోర్సుల్లో మరో రూ.170 కోట్ల భారం పడుతుంది. దీంతో కామన్ ఫీజుపై స్పష్టత కోసం ప్రభుత్వం రెండు వారాల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 1వ తేదీకి వాయిదా పడింది. అయితే, సుప్రీం కోర్టు తీర్పుకంటే ముందే కళాశాలలతో కామన్ ఫీజు అక్కర్లేదని అనిపిస్తే.. అందుకు వీలుగా అంగీకారపత్రం తయారుచేస్తే ఆ భారం దించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ షరతు విధించింది.
6 నుంచే కౌన్సెలింగ్ నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం: డిప్యూటీ సీఎం
ఆదివారంలోగా కళాశాలలు ఏకాభిప్రాయానికి వస్తే కౌన్సెలింగ్ షెడ్యూలుపై స్పష్టత వస్తుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విలేకరులకు తెలిపారు. ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే నెల 6 నుంచే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ప్రయత్నంలో ఉన్నామని వివరించారు. కళాశాలలు ఒక్కతాటిపైకి వస్తే రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. కళాశాలలకు షరతులు, ప్రస్తుతం పెరుగుతున్న ఫీజులన్నీ ఈ ఏడాదికే వర్తిస్తాయని, సుప్రీం కోర్టు తుది తీర్పును అనుసరించి వచ్చే ఏడాది నుంచి కామన్ ఫీజు ఉండొచ్చని ఉన్నత విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
|