NEWS

Blogger Widgets

21.6.12

130 స్కూల్ బస్సుల సీజ్


- రాష్ట్ర వ్యాప్తంగారెండో రోజూ కొనసాగిన రవాణా శాఖ దాడులు
- బడి బస్సుల్లో అత్యధికం పశ్చిమగోదావరి జిల్లాలోనివే
- అక్రమాలకు పాల్పడిన మరో 39 ప్రైవేటు బస్సుల సీజ్
- 98 బస్సు సర్వీసులను రద్దు చేసిన ‘కాళేశ్వరి’

హైదరాబాద్, న్యూస్‌లైన్: స్కూలు బస్సులపై రవాణాశాఖ దాడుల పరంపర కొనసాగింది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా విద్యార్థులను తరలి స్తున్న వాహనాలపై ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు బుధవారం ఒక్కరోజే 130 బస్సులను సీజ్ చేశారు. నిర్దేశించిన నియమావళిని పట్టించుకోకుండా అడ్డగోలుగా బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీఏ గుర్తించింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థులను చేరవే స్తూ పట్టుబడ్డ బస్సులలో అధికశాతం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయి.

ఆ జిల్లాలో ఏకంగా 48, తూర్పు గోదావరి జిల్లాలో 17, హైదరాబాద్‌లో 10, కరీంనగర్‌లో 25, విజయవాడలో 30 స్కూల్ బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఫిట్‌నెస్‌లేని డొక్కు వాహనాల బండారం బయటపడింది. పశ్చిమగోదావరి జిల్లాలో సీజ్ చేసిన బస్సులలో నాలుగు కొత్తవి ఉన్నాయి. నెలరోజుల క్రితమే రోడ్డెక్కినప్పటికీ రిజిస్ట్రేషన్‌కు నోచుకోకుండానే విద్యార్థుల తరలింపునకు వీటిని వినియోగిస్తుండడం గమనార్హం. గత 15వ తేదీ నాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని రవాణాశాఖ గడువు విధించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా 29 వేల ప్రైవేటు బస్సులలో 15వేలు మాత్రమే వీటిని పొందాయి.

రెండోరోజు 39 ప్రైవేటు బస్సుల స్వాధీనం: మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనతో నిద్రలేచిన రవాణాధికారులు ప్రైవేటు బస్సులపై మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణికులను తరలిస్తున్న 39 టూరిస్టు బస్సులను బుధవారం సీజ్ చేశారు. కాంట్రాక్టు క్యారేజీలుగా అనుమతులు తీసుకొని స్టేజీ క్యారేజీలుగా రాకపోకలు సాగిస్తున్న బస్సులపై దాడులు నిర్వహించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం సీజ్ చేసిన వాటిలో అధికంగా 19 ఆదిలాబాద్‌లోనే ఉన్నాయి. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఓమర్, సహారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తేలడంతో సీజ్ చేశారు. మెదక్‌లో 12, తూర్పుగోదావరిలో ఏడు బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మహారాష్ట్రలో ప్రమాదానికి గురైన కాళేశ్వరి బస్సు యాజమాన్యం రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 98 సర్వీసులను రద్దు చేసింది. మంగళవారం ఆర్టీఏ అధికారులు జరిపిన దాడుల్లో 36 ప్రైవేటు బస్సులు, 20 బడి బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దాడులు ఆపండి: ప్రైవేట్ బస్సుల యజమానులు
బస్సులపై రవాణాశాఖ దాడులను నిలిపివేయాలని ప్రైవేటు బస్సుల యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. దాడులతో ప్రైవేటు ఆపరేటర్లను భయభ్రాంతులకు గురిచేయవద్దని వేడుకుంది. బుధవారం సచివాలయంలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారథిని కలిసిన ప్రతినిధి బృందం.. నిబంధనల పేర బస్సులను సీజ్ చేయడం సరికాదని, ఒక బస్సు ప్రమాదానికి ప్రైవేటు ఆపరేటర్లందరినీ బాధ్యులుగా చూడవద్దని కోరింది. ఈ విషయంలో చట్టబద్ధంగా ప్రభుత్వం నడుచుకుంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన బస్సు యజమానులను ఉపేక్షించేది లేదని లక్ష్మీపార్థసారథి తేల్చిచెప్పారు.

రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు: ఖాన్
ప్రైవేటు బస్సులపై దాడుల నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి పెద్దపీట వేస్తున్నామని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఆర్టీసీకి మరేదీ సాటిరాదని ఆయన అన్నారు. బుధవారం తనను కలిసిన విలేకర్లతో ఖాన్ మాట్లాడారు. డ్రైవర్లకు నిద్రలేమితో ప్రమాదాలు జరుగుతున్నాయని, దూరప్రాంతాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులలో ప్రతి నాలుగు గంటలకోసారి డ్రైవరు మారేలా ఏర్పాట్లు చేయడంతో ప్రమాదాల శాతం తక్కువగా ఉందన్నారు.