The Story of Kumbhakarna
ఎవరైనా ఎక్కువసేపు నిద్రపొతే లేదా గాఢనిద్రలో ఉండి ఎంతకూ లేవకుంటే ''కుంభకర్ణుడి''లా పడుకున్నారని వ్యాఖ్యానించడం మనకు తెలిసిందే. కుంభకర్ణుడు ఏకంగా ఆర్నెల్లపాటు నిద్రించేవాడట. మన పురాణాల్లో అనేక విషయాలు నమ్మశక్యం కానట్లుగా, వింతగా, విడ్డూరంగా ఉంటాయి. కుంభకర్ణుడి విషయమూ అలాగే అతిశయోక్తిలా, అభూతకల్పనలా అనిపిస్తుంది. కానీ, పురాణ కథల్లోని సంగతులు నమ్మక తప్పదని చెప్తారు పండితులు..
వాసుకి లాంటి సర్పం, జటాయువు, సంపాతి లాంటి పక్షులు ఉండే అవకాశమే లేదు అంటారు కొందరు. కానీ ఆమధ్య ఆఫ్రికా అడవుల్లో అతి పొడవైన పాము కనిపించింది. దాన్ని మనమూ టీవీల్లో చూశాం. వాషింగ్టన్ భౌగోళిక సంఘం వాళ్ళు అర్జంటినాలో అతి పెద్ద పక్షి అస్తిపంజరం దొరికిందని ప్రకటించారు. దాని బరువు 77 కిలోలు కాగా, అది రెక్కలు చాచినప్పుడు 25 అడుగులు ఉంటుందని అంచనా వేసి రాశారు. డైనోసార్ స్కెలెటన్ బిర్లా ప్లానెటోరియంలో స్వయంగా చూస్తున్నాం. మరి, ఈ జంతువులు ఇప్పుడు లేవు కనుక, వీటిని స్వయంగా చూడలేదు కనుక ఇవి ఒకప్పుడు ఉన్నాయంటే నమ్మలేము అంటే ఎలా? అలా గనుక ఖండిస్తే, ఒకరకంగా అది హాస్యాస్పదం అవుతుంది.
అతి పొడవైన మనుషులు ఉండేవారంటే కూడా మనకు నమ్మశక్యంగా ఉండదు. కానీ, అమెరికా కొలరేడో గుహల్లో 95 అడుగుల పొడవైన మనుషుల కళేబరాలు దొరికాయి. అవి 80 వేల సంవత్సరాల కిందట జీవించిన వ్యక్తుల అస్తిపంజరాలుగా నిపుణులు అంచనా వేశారు.
కుంభకర్ణుడు ఆర్నెల్ల సుదీర్ఘకాలం పాటు నిద్రపోయేవాడు లాంటి కథనాలు కూడా విడ్డూరంగానే ఉంటాయి. కానీ, చాలా ఎక్కువ కాలంపాటు నిద్ర పోయేవాళ్ళే కాదు, అస్సలు కళ్ళు మూసి నిద్రే పోనీ వ్యక్తుల గురించి కూడా అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తుంటాం. కొన్నేళ్ళ క్రితం ఒక వ్యక్తి గురించి పేపర్లలో రాశారు, అతను జీవితంలో ఇంతవరకూ ఒక్క నిమిషం కూడా నిద్ర పోలేదని, అయినా తనకు అలసట అనేది కలగలేదని చెప్తే కళ్ళు తేలేయడం మన వంతయింది.
కొన్ని నెలల క్రితం ఒక వార్త వచ్చింది. అమెరికాలో ఒక పదేళ్ళ చిన్నారి నిరంతరం నీళ్ళు తాగుతూనే ఉంటుంది. ఆమెకు దాహం వేస్తూనే ఉంటుంది. పాపం అదొక వింత వ్యాధి. ప్రచార సాధనాల ద్వారా ఇలాంటి అంశాలు గనుక మనకు చేరకపోతే, మనం వీటిని కాకమ్మ కథల కింద కొట్టి పడేస్తాం. అంతే కదూ!
ఇప్పుడంటే మీడియా పరిధి పెరిగింది. 24 hours channels వచ్చి, ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా క్షణాల్లో మనకు తెలుస్తోంది. కానీ పూర్వం ఆ అవకాశం లేదు. కనుక అప్పటి విషయాలు మనకు అతిశయాలుగా, ఆశ్చర్యార్థకాలుగా ఉంటాయి. కానీ మన మహర్షులు ద్రష్టలు, అపూర్వ మేధాసంపన్నులు అనే గుర్తింపు, గౌరవం ఉంటే పురాణ కథలను మనం నమ్ముతాం.