NEWS

Blogger Widgets

21.6.12

బరిలోకి వచ్చేస్తున్నా..



  • 21/06/2012
దుబాయ్, జూన్ 20: ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుని ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సెప్టెంబర్‌లో జరిగే ట్వంటీ-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మళ్లీ బరిలోకి దిగగలనని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. క్యాన్సర్ వ్యాధితో తన దేహం తీవ్రమైన షాక్‌కు గురైందని, దీని తీవ్రత ఏమిటో క్యాన్సర్ బారిన పడిన తనలాంటి వారికి తప్ప ఇతరులకు అర్ధం కాదని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ భారత్ తరఫున ఆడటం తనకు పెద్ద సవాలేనని ‘ఐసిసి క్రికెట్ 360’ షోలో యువీ అంగీకరించాడు. అయితే క్రికెట్ మైదానంలో మళ్లీ ఖచ్చితంగా ఎప్పుడు దిగుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు యువరాజ్ నిరాకరిస్తూ, ఇటువంటి ప్రశ్నలకు ఇప్పుడే బదులివ్వడం అపరిపక్వతే అవుతుందన్నాడు. ‘క్రికెట్‌ను మళ్లీ ఎప్పటి నుంచి కొనసాగించాలన్న దానిపై నేనేమీ నిర్ధిష్ట కాలపరిమితిని నిర్ధేశించుకోలేదు. క్యాన్సర్ నేను ఎలా కోలుకుంటున్నానో, ఎంత త్వరగా మళ్లీ మైదానంలోకి దిగగలుగుతానో వేచిచూడాల్సి ఉంది. త్వరగా మళ్లీ బరిలోకి దిగాలని గానీ, అరకొర ఫిట్‌నెస్‌తో ఆడాలని గానీ నేను కోరుకోవడం లేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ఆరు మాసాల సమయం పడుతుందో లేక రెండు నెలల సమయం పడుతుందో నాకు తెలియదు. కానీ పూర్తి ఫిట్‌నెస్ సాధించానన్న భావన నాలో కలిగిన నాడు తప్పకుండా మళ్లీ బరిలోకి దిగుతా’ అని యువీ పేర్కొన్నాడు.
భారత జట్టే ఫేవరెట్..
2007లో జరిగిన ఐసిసి ట్వంటీ-20 వరల్డ్ కప్ తొలి టోర్నమెంట్‌లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించిన విషయం విదితమే. శ్రీలంకలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐసిసి ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ఎంపికచేసే భారత జట్టుకు తాను అందుబాటులో ఉంటానని యువీ సూచనప్రాయంగా చెప్పాడు. భారీ హిట్టర్లతో కూడిన భారత జట్టు మరోసారి ఈ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోందని, అప్పటికి తాను కూడా మళ్లీ మైదానంలోకి దిగగలనని భావిస్తున్నట్టు యవీ తెలిపాడు. కేవలం తనను దృష్టిలో ఉంచుకునే ఈ టోర్నీలో భారత జట్టును ఫేవరెట్‌గా చెప్పడంలేదని, పలువురు బిగ్ హిట్టర్లను కలిగివున్న భారత జట్టు నిజంగానే ఎంతో బలమైనదిగా కనిపిస్తోందని, బౌలింగ్ విభాగాన్ని కూడా మెరుగుపర్చుకోగలిగితే టీమిండియా మరింత బలోపేతమవుతుందని తాను ఖచ్చితంగా చెప్పగలనని యువీ వివరించాడు. అంతర్జాతీయ ఈవెంట్లలో ఎప్పుడూ చివరి వరకూ పోరాడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇతర జట్లు భారత్‌కు బలమైన ప్రత్యర్థులని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
అభిమానులకు కృతజ్ఞతలు
క్యాన్సర్ వ్యాధితో తాను మానసికంగా సాగించిన పోరాటాన్ని యువరాజ్ ఈ సందర్భంగా వివరించాడు. అథ్లెట్‌లా పరుగులుతీస్తూ రోజుకు ఆరేడు గంటలు శిక్షణలో గడిపే తాను క్యాన్సర్ వ్యాధి సోకిందన్న వాస్తవాన్ని చాలా కాలం పాటు జీర్ణించుకోలేకపోయానని, అయినప్పటికీ ఈ వ్యాధిని జయించగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని యువరాజ్ తెలిపాడు. తాను సంపూర్ణంగా కోలుకోవాలని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసి వెన్నంటి నిలిచిన అభిమానులకు యువీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. క్లిష్ట సమయంలో అభిమానులు అందించిన మద్దతు తాను తిరిగి త్వరగా కోలుకునేందుకు ఎంతో దోహదపడిందని యువీ పేర్కొన్నాడు. చికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళ్లిన తనను అభిమానులు నిరంతరం పలకరిస్తూనే ఉన్నారని, దీంతో తాను అమెరికాలో ఉన్నట్టు అనిపించలేదని, భారత్‌లోనే ఉన్నానన్న భావన కలిగిందని యువీ తెలిపాడు.
ఇప్పటికే ఏడు సెషన్ల సాధన పూర్తి..
రెండు నెలల క్రితమే కీమోథెరపీ పూర్తవడంతో ఇప్పటికే శిక్షణ పునఃప్రారంభించిన తాను ఏడు సెషన్ల సాధన పూర్తిచేశానని, ఆరోగ్యం త్వరగా కుదుటపడి మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నందుకు సంతోషంగా ఉందని యువరాజ్ వివరించాడు. శిక్షణ ఆరంభంలో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ప్రస్తుతం అంతా బాగానే ఉందని, సాధారణ స్థాయిలోనే ఆహారం స్వీకరించగలుగుతున్నానని యువీ సంతోషంగా చెప్పాడు.