కృష్ణుడు కంసుని ఎలా హతమార్చాడు?
Kamsa and Krishna
క్రూర స్వభావానికి ఉదాహరణ కంసుడు. తండ్రి ఉగ్రసేనుని బంధించి చెరసాలలో పెట్టి, రాజ్యాధికారాన్ని చేపట్టాడు. కంసుడు, శ్రీకృష్ణునికి మేనమామ. ఒక సందర్భంలో ఆకాశంలోంచి, ఓ అదృశ్య శక్తి ''దేవకీదేవి సంతానంలో ఎనిమిదవ మగబిడ్డ వల్ల ముప్పు కలుగుతుంది, మరణిస్తావు'....
' అని హెచ్చరించింది.
ఆ పలుకులు విన్న మరుక్షణం, కంసుడు చెల్లెలు దేవకీదేవిని, ఆమె భర్త వసుదేవుని చెరసాలలో బంధించాడు. ఆమెకి పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల హాని కలుగుతుందని అశరీరవాణి స్పష్టంగా చెప్పినా కూడా పుట్టే ప్రతి శిశువునీ వధించసాగాడు. 'ఏమో, ఈమె నా పాలిత మృత్యుదేవతలా ఉంది.. ఏ బిడ్డ వల్ల తనను మృత్యువు కబళిస్తుందో..' అనుకున్నాడు.
అలా ఏడుగురు బిడ్డలు హతమయ్యాక శ్రీకృష్ణుడు జన్మిచాడు. బాల కృష్ణుని కూడా కంసుడు చంపేస్తాడనే భయంతో పెట్టుకుని తెల్లవారకముందే ఆ బాలుని బుట్టలో యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు. యశోదకు పుట్టిన పాపాయిని తీసుకొచ్చి దేవకీదేవి పక్కలో పడుకోబెట్టాడు.
దేవకీదేవి పక్కలో పాపాయి ఏడవడంతో, కంసుడు నియమించిన భటులు వచ్చి చూశారు. వాళ్ళు వెళ్ళి, కంసునికి దేవకీదేవికి స్త్రీ శిశువు జన్మించినట్లు చెప్పారు.
కంసుడు, ఆ పాపాయిని కూడా చంపాలని ప్రయత్నించాడు. అయితే, ఆ శిశువు, కంసుడి చేతుల్లోంచి మాయమై, శూన్యంలో తేలుతూ, ''కంసా, నేను మాయను.. నిన్ను హతమార్చేవాడు మరోచోట ఉన్నాడు'' అని మాయమైంది.
యశోదమ్మ దగ్గర బాల కృష్ణుడు నానా గారాలూ పోతున్నాడు. మాయాజాలాలు చేసి మురిపిస్తున్నాడు. గోప బాలలతో ఆడి పాడతాడు. ఏడేడు పదునాలుగు లోకాలను కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తాడు. గోవర్ధనగిరిని చిటికెన వేలిపై నిలబెట్టి ఆశ్చర్యపరుస్తాడు.
కంసుని సంహరించడానికి సమయం ఆసన్నమైంది. కర్మను అనుసరించి బుద్ధి నడుస్తుంది కదా... కంసుడే స్వయంగా శ్రీకృష్ణుని వద్దకు అక్రూరుని పంపాడు. శ్రీకృష్ణుని, బలరాముడిని అక్రూరుడు వెంటబెట్టుకు వెళ్ళాడు.
శ్రీకృష్ణుని మీదకు ఎందరు, ఎన్ని ఆయుధాలతో లంఘించినా లాభం లేకపోయింది. అందర్నీ పడగొట్టి, చివరికి కంసుడివైపు చూశాడు. కంసుడు, లోపల భయపడుతూ కూడా బయటికి ప్రగల్భాలు పలికాడు. కృష్ణుని హతమార్చేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి శ్రీకృష్ణుని ముష్టిఘాటాలకు బలయ్యాడు. అదృశ్యవాణి చెప్పినట్లుగానే దేవకీదేవి ఎనిమిదవ సంతానం అయిన శ్రీకృష్ణుడు, కంసుని మృత్యుకుహరానికి పంపాడు.