ఈ విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది? గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి? శాస్త్ర పరిశోధనలు ఎంత పురోభివృద్ధి గాంచిన ప్పటికీ ఇవి సంతృప్తికరమైన సమాధానానికి నోచుకోని ప్రశ్నలుగానే మానవ మస్తిష్కాన్ని తొలుస్తూనే వున్నాయి. 1370కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటం (బిగ్ బ్యాంగ్) నుండి విశ్వం ఆవిర్భవించిందని భౌతిక శాస్త్రవేత్తలు అనేకానేక ప్రయోగాలతో నిర్ధారణకు వచ్చిన ప్పటికీ,.... దీని వెనుక ఏదో అదృశ్య శక్తివుందని, ఇది భగవత్ సృష్టి అని భావించే వారు కోకొల్లలు. శాస్త్రజ్ఞులు కొత్త అన్వేషణల్లో సఫ లీకృతులయ్యేకొలదీ అజ్ఞానం, మూఢనమ్మకాల చీకట్లు తొలగిపోతూ వుంటాయి. అణువుల ద్రవ్యరాశి (మాస్)కి కారణమైన మూలకణం రహస్యాన్ని ఛేదించామని యూరోపియన్ సెంటర్ ఫర్ నూక్లియర్ రీసెర్చి (సెర్న్) బుధవారం ప్రకటించగానే అందుకోసం నిరంతరా యంగా శోధించిన 2వేలమందికిపైగా శాస్త్రజ్ఞులు పరమానందభరి తులయ్యారు. అణువు ఉపకణానికి సంబంధించి 99.99శాతం ఆధారాలు లభించాయని వారు ప్రకటించారు. ఈ కణాన్ని హిగ్స్ బోసన్ కణంగా శాస్త్రలోకం పిలుస్తోంది. బ్రిటన్‌లో జన్మించిన పీటర్ హిగ్స్ 1960వ దశకంలో ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశి ఎలా వస్తుందన్న అంశంపై ప్రతిపాదించిన 'బ్రోకెన్ సిమ్మెట్రీ' సిద్ధాంతాన్ని హిగ్స్ మెకానిజంగా పిలుస్తారు. ఇది 'బిగ్ బ్యాంగ్' సిద్ధాంతాన్ని వివరించే ప్రామాణిక నమూనాగా మారింది. అణువులకు ద్రవ్యరాశి చేకూర్చే కణం ఒకటి వుందని హిగ్స్, మరో ఐదుగురు భౌతిక శాస్త్రవేత్తలు 48ఏళ్ళ క్రితం ప్రతిపాదించారు. క్వాంటమ్ ఫిజిక్స్‌లో అసాధారణమైన పరిశోధనలు చేసిన భారతీయుడు, ఐన్‌స్టీన్ సమకాలికుడు సత్యేంద్రనాథ్ బోస్ కూడా ఉపపరమాణు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంతుచిక్కని ఆ కణానికి వారిరువురి పేర్లతో 'హిగ్స్‌బోసన్' కణంగా నామకరణం చేశారు. దానినే సరళగ్రా హ్యత కొరకు 'దైవ కణం'గా పిలుస్తున్నారు తప్ప దానితో మానవుని ఊహామాత్ర సృష్టి అయిన భగవంతునికి ఎట్టి సంబంధం లేదు.
విశ్వసృష్టిని శాస్త్రీయంగా విశ్లేషించే ప్రామాణిక నమూనా సిద్ధాంతం ప్రకారం మహావిస్ఫోటనం సంభవించిన మరు క్షణంలోని వందకోట్ల వంతు సమయంలో కోట్లకొద్ది అణువులు కాంతివేగంతో దూసుకుపోయాయి. తర్వాత వాటికి ద్రవ్యరాశి చేకూరటంతో అవన్నీ ఒక చోట చేరి విశ్వం ఏర్పడింది. ఈ నమూనా ప్రకారం ద్రవ్యరాశి సమకూరటానికి మూలమైన అగోచర (మిస్టరీ) కణంతోపాటు మరో 11 ప్రాథమిక కణాలను ప్రతిపాదించారు. ఆ 11 కణాలను శాస్త్ర వేత్తలు ఇదివరకే కనుగొన్నారు. అణువులకు ద్రవ్యరాశిలేకుంటే ప్రతి ఒక్కటీ కాంతివేగంతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఏ రెండు అణువుల మధ్య బంధం వుండదు. వాటికి స్థిరత్వంలేనిదే విశ్వం వుండదు అనేది ఈ సిద్ధాంతం ప్రాతిపదిక. దీన్ని ప్రపంచం ఆమోదించింది.
అయితే అంతుచిక్కని కణాన్ని కనుగొనకపోతే ఈ సిద్ధాంతం అసంపూర్ణం. స్విట్జర్లాండ్-ఫ్రాన్స్ సరిహద్దులో భూమికి వందమీటర్ల లోతులో 27 కిలోమీటర్ల సొరంగాన్ని త్రవ్వి అత్యంత శక్తివంతమైన లార్జ్ హాడ్రన్ కొవైడర్‌ను నిర్మించారు. మహావిస్ఫోటనాన్ని కృత్రిమంగా సృష్టించే ప్రయోగం నిమిత్తం భౌతిక శాస్త్రవేత్తలు నిర్మింపజేసిన ఆ సొరంగం 2010 నుండి పనిచేస్తోంది. ప్రొటాన్లను ఉత్పత్తి చేసి వాటికి అభిముఖంగా కాంతి వేగంతో ఢ కొట్టించగా రెప్పపాటులో కోట్లకొలది కణాలు ఒకదానికొకటి ఢకొీని ఉపకణాలు ఉద్భవిం చాయి. కొంతకాలం క్రితం వారు ఈ మహా విస్ఫోటం ప్రయోగం చేసినప్పుడు ప్రపంచ అంతమవుతుందని మూఢ విశ్వాసులు భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రయోగం విజయవంత మైంది - ప్రపంచం సురక్షితంగా వుంది. పై ప్రయోగంలో కొత్తగా జనించే ఉపకణాలు ఆ క్షణంలోనే అంతర్ధానమవుతాయి. వాటిలోనే అంతుచిక్కని కణం వుంటుందని శాస్త్రజ్ఞులు భావించారు. ఇదే ఇతర కణాలకు ద్రవ్యరాశిని బదిలీచేస్తున్నట్లు అంచనా. ఈ కణాన్ని శాస్త్రవేత్తలు కనుగొనటం తాజా మహాద్భుతం. విశ్వరహస్యాలు ఒక్కొక్కటిగా ఛేదించేందుకు ఇది ఉపకరిస్తుంది. ఈ ప్రయోగంలో పాల్గొన్న 2100 మంది భౌతిక శాస్త్రవేత్తల్లో భారత శాస్త్రజ్ఞులు వందమందికిపైగా వున్నారు. కాబట్టి ఈ శాస్త్రవిజయంలో భాగ స్వాములమైనందుకు భారతీయులుగా మనమూ గర్వించవచ్చు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. మరెంతో పరిశోధన జరగాల్సి వుంది. ''ప్రకృతిని అర్థం చేసుకోవటంలో మేము కీలకమైన మైలురా యిని అధిగమించాం'' అని సెర్న్ శాస్త్రవేత్తలు వినమ్రతతో ప్రకటిం చారు. 'హిగ్స్ బోసన్ కణాన్ని గుర్తించటంలో మరెన్నో విస్తృత ప్రయోగాలకు అవకాశం ఏర్పడింది. ఈ కొత్త కణం లక్షణాలను నిర్ధారించటానికి అపారమైన సమాచారం అవసరం. దీంతో సృష్టిలోని ఇతర రహస్యాలపైన దృష్టిసారించవచ్చు'నని డైరెక్టర్ రాల్ఫ్ హేయిర్ ప్రకటించారు. ప్రకృతిని జయించేవరకు శాస్త్రవిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతూ నిగూఢరహస్యాలను ఛేదిస్తూనే వుంటుంది. మానవ జిజ్ఞాస, అన్వేషణ ఒక స్థాయిలో ఆగిపోదు. ప్రతి కొత్త అన్వేషణను ఛాందసవాదులు ఆది నుండి వ్యతిరేకిస్తూనే వున్నారు - ఓడిపోతూనే వున్నారు. మున్ముందు కూడా ఇదే సత్యం. మానవ విజ్ఞానాన్ని పెద్ద గంతువేయించిన ఈ అద్భుత ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ జేజేలు పలుకుదాం.