
‘‘భూమికా కమ్‌బ్యాక్ అంటున్నారు. నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాననుకుంటున్నా. అందుకని నాకిది కమ్‌బ్యాక్ కాదు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించడానికి శాయశక్తులా కృషి చేశాను’’ అన్నారు భూమిక. జగపతిబాబు, భూమిక జంటగా శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకత్వంలో సుధా ఎంటర్‌టైన్‌మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ ఫూల్’. జీఎల్ శ్రీనివాస్ నిర్మాత....
ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భూమిక మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రమేష్‌ప్రసాద్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్, బెల్లంకొండ సురేష్, లక్ష్మీ మంచు తదితరులు శుభాకాంక్షలందజేశారు. ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కథకి తగ్గట్టుగా ఉంటుందని ‘ఏప్రిల్ ఫూల్’ టైటిల్‌ని ఖరారు చేశాం.
హైదరాబాద్‌లో టాకీని, పాటలను ఇండియాలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం’’ అని జీఎల్ శ్రీనివాస్ చెప్పారు. ఈ చిత్రకథ నచ్చిందని, భారతీయ చిత్రాల్లోనే కాక 22 అంతర్జాతీయ చిత్రాల్లో నటించానని గుల్షన్ గ్రొవర్ తెలిపారు. లఘు చిత్రాలు తీసి, ఎన్నో సక్సెస్‌లు అందుకున్నానని, ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలని దర్శకుడు అన్నారు. చిత్ర సహనిర్మాత సీమ అజరుద్దీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.