NEWS

Blogger Widgets

6.7.12

చర్లపల్లి జైలులో ఖైదీ వీరంగం



హైదరాబాద్, జూలై 4: చర్లపల్లి జైల్లో ఓ ఖైదీ వీరంగం సృష్టించాడు. బుధవారం తెల్లవారుజామున కత్తెరతో తోటి ఖైదీలపై దాడి చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో ఒకరు జైల్లోనే మృతిచెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన దాసరి నర్సింహులు.... హత్య కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్నాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలోని స్వర్ణముఖి బ్యారక్‌ను అతడికి కేటాయించారు. అతడితో పాటు వెంకటయ్య, నర్సింహ, దీపక్, బసవయ్య, ఇస్మాయిల్, వెంకటేష్, చలపతి, ఉషయ్యలు వివిధ నేరారోపణలపై ఇదే బ్యారక్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో నర్సింహ ఒక్కసారిగా తోటి ఖైదీలపై కత్తెరతో దాడికి దిగాడు. మెదక్ జిల్లాకు చెందిన జీవితఖైదీ వెంకటయ్యను(60) పొత్తికడుపులో పొడవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. అడ్డుకోబోయన దీపక్, చలపతి, ఉషయ్య, బసవయ్య, ఇస్మాయిల్‌లపై దాడి చేశారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా దీపక్ మృతి చెందాడు. చలపతి, ఉషయ్యలకు సర్జరీ చేశారు. బసవయ్య, ఇస్మాయిల్, వెంకటేష్‌లను చర్లపల్లి జైలులోని ప్రాణహిత బ్యారక్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి వెంటనే స్పందించి తక్షణమే జైల్లో తలెత్తుతున్న పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జైళ్ళశాఖ ఐజికి ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు వార్డర్లు కిష్టయ్య, లక్ష్మీనాయుడులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

జైలు శిక్ష ఎక్కువ కావాలనే చంపాను
తన భార్యతో ప్రాణహాని ఉన్నందువల్లే వెంకటయ్యను హత్య చేశానని తద్వారా తనకు జైలు శిక్ష పొడిగించే అవకాశం ఉందని నర్సింహులు అంటున్నాడు. అయితే, ఇదే విషయంపై జైలు అధికారుల వాదన భిన్నంగా ఉంది. నర్సింహులు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తించి దాడికి పాల్పడినట్లు జైలు సూపరింటెండెంట్ కె.ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. దీపక్ ఈ దాడిలో చనిపోలేదని ఇతర కారణాలతో మృతి చెందినట్లు సూపరింటెండెంట్ చెబుతుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నర్సింహ దుస్తులు ఉతికే విషయంలో నర్సింహ, వెంకటయ్యలకు మధ్య తలెత్తిన ఘర్షణే చివరకు హత్యకు దారితీసినట్లు తోటి ఖైదీల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. తరచూ ఖైదీల మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీ సిబ్బంది ఉదాసీనంగా ఉంటున్నారనే ఆరోపణలున్నాయ.
రాయలసీమ డిఐజితో విచారణ
రాజమండ్రి: చర్లపల్లి జైలులో ఒక ఖైదీ కత్తెరతో దాడిచేసిన సంఘటనపై రాయలసీమ జైళ్ల శాఖ డిఐజి జయవర్ధన్‌ను విచారణాధికారిగా నియమించినట్టు రాష్ట్ర జైళ్లశాఖ డైరక్టర్ జనరల్ టిపి దాస్ చెప్పారు. ఇప్పటికే ఇద్దరు వార్డర్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనతో రాష్ట్రంలోని ఇతర జైళ్ల అధికారులను కూడా అప్రమత్తం చేశామన్నారు. ఖైదీల మానసిక పరిస్థితిని తెలుసుకుని, అందుకు తగిన వైద్య సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జైళ్ల అధికారులను ఆదేశించామన్నారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి జైళ్లశాఖ అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా దాస్ చెప్పారు. చిన్న నేరాలకు సామాజిక సేవాశిక్షను విధించేందుకు రాష్టశ్రాసనసభ చట్టం చేసినప్పటికీ, భారత శిక్షాస్మృతికి సవరణ చేయాల్సి ఉండటంతో, రాష్టప్రతి ఆమోదముద్ర కోసం రాష్ట్రప్రభుత్వం పంపిందని ఆయన తెలిపారు.