NEWS

Blogger Widgets

6.7.12

నెగ్గించుకున్నయడ్డీ: సదానంద ఔట్, సిఎంగా జగదీష్?



 Jagadish Shettar Will Be Karnataka Chief Minister
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నారు! యడ్డీ వర్గం డిమాండ్ మేరకు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సదానంద గౌడను ముఖ్యమంత్రిగా తొలగించి ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్‌ను కూర్చుండ బెట్టేందుకు రంగం సిద్ధమైంది....

ఈ నెల 9వ తేదిన జగదీష్ శెట్టార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. అశోక్, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈశ్వరప్పలను డిప్యూటీలుగా నియమించనున్నారు. సదానంద గౌడకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. కర్నాటకలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక సంక్షోభం వెంటాడుతోంది.
మరో సంవత్సరంన్నరలో సాధారణ ఎన్నికలు ఉన్న దృష్ట్యా పార్టీ అధిష్టానం ఆ వైపు దృష్టి సారించి కర్నాటకలో మరోసారి సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి మార్పు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, సదానందకు పార్టీ పగ్గాలు అని తెలుస్తోంది. అంతేకాకుండా సామాజిక కోణం, రాజకీయ కోణంలో ఆలోచించి పార్టీ సమూల మార్పులకు తెర తీసినట్లుగా కనిపిస్తోంది. సిఎం సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలు చూసినా ముఖ్యమంత్రి మార్పు ఖాయమని తెలుస్తోంది.
ప్రస్తుతం పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు వీలుగా శాశ్వత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం అధిష్టానం నిర్ణయం చేదుదైనా, తీపిదైనా, దాన్ని తాను శిరసావహించాల్సి ఉందన్నారు.
ఇదే విషయాన్ని తనతో పాటు జగదీశ్ శెట్టర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఈశ్వరప్ప కూడా కేంద్ర నాయకత్వానికి చెప్పినట్టు వివరించారు. అలాగే సదానంద గౌడ తన పదకొండు నెలల రాష్ట్రపాలనను కీర్తించుకున్నారు. ఈ కాలంలో తాను రాష్ట్రానికి నాయకత్వం వహించడం మంచి అవకాశంగా భావిస్తానని చెప్పారు. తన పాలనపై రాష్ట్ర గవర్నర్‌గానీ ప్రతిపక్షాలుగానీ ఎలాంటి విమర్శలు చేయలేదని ఆయన గుర్తు చేశారు.
మచ్చలేని పాలన అందించిన ఘనత తనకే సొంతమన్నారు. తన మంత్రివర్గంలో అవినీతి మంత్రులు లేరని, తన పాలనను ప్రజలు పూర్తిగా అంగీకరించారని సదానంద గౌడ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, అసమ్మతి వర్గ నేత యడ్యూరప్ప నేతృత్వంలోని వర్గం డిమాండ్ చేస్తుండటంతో సదానంద గౌడ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.