తెలుగు సినిమా బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. వెరసి పరిశ్రమలో లాభాల శాతం కూడా చాలా తగ్గి పోయింది. ఒక సంవత్సరం తెలుగు పరిశ్రమ నుంచి దాదాపు 100 సినిమాలు వస్తే..అందులో సక్సెస్ రేటు కనీసం పది పదిహేను శాతం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ తగ్గించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందు తను మారిన తర్వాత ఇతరులకు నీతులు చెప్పాలనే ఉద్దేశ్యంతో పూరి జగన్నాధ్‌తో తాను నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం నుంచి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపెై ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 10 గంటలు పని చేయాలని, తన వల్ల సినిమా షూటింగ్ రద్దయ్యే పరిస్థితి వస్తే ఆరోజు దాని వల్ల నిర్మాతకు కలిగే నష్టాన్నితానే భరించడం, నిర్మాతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం,
ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ అయ్యేలా సహకరించడం, అనవసర ఖర్చులు తగ్గించడంలో నిర్మాతకు సహకరించడం, హీరో హీరోయిన్ల కోసం ఖరీదెైన వసతి సౌకర్యాలు కాకుండా...సౌకర్యవంతమైన వాటితోనే సరిపుచ్చుకోవడం లాంటి చేయాలని నిర్ణయించారు. తన ఆలోచనలను పరిశ్రమలో ఇతర హీరో హీరోయిన్లు, నటీనటులకు కూడా వర్తింప చేసేలా పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని, దీని వల్ల సినిమా నిర్మాణ వ్యయం తగ్గి పరిశ్రమ లాభాల బాటలో నడుస్తుందనే ఆలోచనతోనే పవర్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే పరిశ్రమలో హీరోల మధ్య ఉన్న ఆధితప్య పోరు నేపథ్యంలో పవన్ ఆలోచనలకు ఇతర హీరోలు ఏ మేరకు సహకరిస్తారు? ఆయన్ను ఫాలో అవడానికి ఎంత మంది సుముఖత చూపుతారు అనేది పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. కొందరు హీరోలు తమ సౌకర్యం కోసం నిర్మాతలపెై ఒత్తిడి తెచ్చి అవసరం లేకున్నా కోట్లు వెచ్చించి సెట్లు వేయించి హైదరాబాద్‌లోనే షూటింగ్ జరిగేలా చేస్తుంటారు. ఇలాంటివి చేస్తున్న వారికి పవన్ చెబుతున్న నీతులు రుచిస్తాయా? అనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుతం ఇలాంటి నిబంధనలు కేరళ సినీ పరిశ్రమలో అమలులో ఉన్నాయి. అవి మన తెలుగులోనే అమలయితే పరిశ్రమ పచ్చగా కళకళలాడుతుంది.
|