కైరో: ఈజిప్టులో ప్రజాస్వామ్యం వికసించింది. ఆరవయ్యేళ్ల తర్వాత ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలలు ముస్లిం బ్రదర్ హుడ్ ఘన విజయం సాధించింది. ఆ వర్గానికి చెందిన ఫ్రీడం అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ముర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అరవై ఏళ్ల ముర్సీ సమీప ప్రత్యర్థి మాజీ ప్రధాని అహ్మద్ షఫీక్‌ను ఓడించారు. నైలునది డెల్టా ప్రాంతంలోని షర్కియా ప్రావిన్స్‌లోని ఒక గ్రామానికి చెందిన ముర్సీకి.. భార్య, నలుగురు పిల్లలున్నారు.
దేశంలో ఏకవ్యక్తి ప్రాధాన్యతను నిర్మూలించి, అధ్యక్ష వ్యవస్థను నెలకొల్పడమే తన లక్ష్యమని ఎన్నికల ప్రచారం సందర్భంగా ముర్సీ చెప్పుకొన్నారు. ముస్లిం చట్టాల అమలులో కఠినంగా వ్యవహరిస్తానన్న ఆరోపణలను తోసిపుచ్చిన ముర్సీ.. దేశంలో ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను అమలుపరిచే ఉద్దేశ్యమేదీ లేదని ప్రకటించారు.
ముర్సీ విజయాన్ని పురస్కరించుకుని కైరోలోని తెహ్రీర్ స్క్వేర్‌లో వేలాది మంది ముస్లిం బ్రదర్‌హుడ్ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. అయితే ప్రభుత్వ పాలనలో సాయుధ దళాల సుప్రీం కౌన్సిల్ ముర్సీకి సహకరించేలా కనిపించడం లేదు. ఇంతవరకూ అధికారాన్ని చెలాయించిన సుప్రీం కౌన్సిల్.. ఇప్పటికే కొన్ని అధ్యక్ష అధికారాలకు కూడా కత్తెర వేసింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన ముర్సీకి.. గాజాలో అధికారంలో ఉన్న హమాస్ అభినందనలు తెలిపింది. అరబ్ ప్రపంచంలో వీచిన ప్రజాస్వామ్య పవనాల కారణంగా ఈజిప్ట్ మాజీ నియంత హోస్నీ ముబారక్ జైలు పాలవడంతో ఈ ఎన్నికలు జరిగాయి. 800 మందికి పైగా ప్రజాస్వామ్య వాదులను చంపించాడన్న ఆరోపణలపై ముబారక్ ఇప్పటికే జీవితఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.