గుర్గావ్(హర్యానా): మరో చిన్నారిని బోరుబావి మింగేసింది. నాలుగు రోజుల క్రితం 70 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన చిన్నారి మహిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి.
సహాయక బృందాలు ఆదివారం బోరుబావి నుంచి మహి మృతదేహాన్ని వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. నాలుగేళ్ల తమ గారాలపట్టికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయన్న చేదు నిజం తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మహి ఎలాగైనా బతికొస్తుందంటూ బోరుబావి వద్ద ఉత్కంఠగా ఎదురుచూసిన వేలాది మందితో పాటు హర్యానా మొత్తం విషాదంలో ముగినిపోయింది.
హర్యానాలోని మానేసర్ సమీపంలో గల ఖో గ్రామానికి చెందిన మహి ఈ నెల 20న తన పుట్టినరోజు కార్యక్రమం అనంతరం ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయిన విషయం తెల్సిందే. బాలికను వెలికి తీసేందుకు భద్రతా సిబ్బంది అప్పట్నుంచి బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. అయితే మధ్యలో ఒక గట్టి రాయి అడ్డుతగలడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి ఎలాగోలా ఆ రాయిని పగలగొట్టి లోనికి వెళ్లారు. అయితే అప్పటికే మహి మరణించింది. బాలిక మృతదేహానికి స్థానిక ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
బోరుబావిలో గాలి లేకపోవడంతో శ్వాస ఆడకనే మహి మరణించిందని ఈఎస్‌ఐ సీఈఓ దీపక్ మాథుర్ తెలిపారు. బోరుబావిలో పడిన వెంటనే ఆ చిన్నారికి ట్యూబుల ద్వారా ఆక్సిజన్ అందించి ఉంటే బతికేదన్నారు. బహుశా బోరుబావిలో పడిన నాలుగైదు గంటల తర్వాత లోనికి ఆక్సిజన్ పంపి ఉంటారన్నారు. మృతదేహం కుళ్లిపోవడాన్ని బట్టి చూస్తే.. ఆ బాలిక బోరుబావిలో పడిన రోజు గానీ మర్నాడు గానీ మరణించి ఉండొచ్చని చెప్పారు.