NEWS

Blogger Widgets

25.6.12

జెడి కాల్‌లిస్ట్: జగన్ పార్టీ నేతలపై చంద్రబాల ఫిర్యాదు!


 Chandrabala Move Cops On Call Data

హైదరాబాద్: తన ఫోన్ కాల్స్ వివరాలు బహిర్గతమవడంపై ఐబిఎం ఉద్యోగిని, లీడ్ ఇండియా కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాల సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశముంది. తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల తదితర కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఫోన్ కాల్సుతో పాటు చంద్రబాల కాల్స్ వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఇటీవల బయటకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
సిబిఐ జెడికి ఆమె నుండి మూడు వందలకు పైగా ఫోన్ కాల్సు వెళ్లినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పారు. దానిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తన కాల్ లిస్టును బయటపెట్టడాన్ని చంద్రబాల తప్పు పట్టారు. దానిపై ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశముంది. సిబిఐ జెడి కాల్ లిస్టు వివరాలను నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ ద్వారా సాక్షి విలేకరి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ జరిపారు. అయితే సిబిఐ జెడి కాల్ లిస్టుపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రానందున ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెండు రోజుల క్రితం డిజిపి దినేష్ రెడ్డి చెప్పారు. ఫిర్యాదు అందిన తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ఈ రోజు చంద్రబాల ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులతోపాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరి పైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సిబిఐ జెడి కాల్ లిస్టు బయట పెట్టిన విషయం తెలిసిందే. ఆ కాల్ లిస్టులో పలువురు విలేకరుల ఫోన్ నెంబర్లతో పాటు చంద్రబాల ఫోన్ నెంబరును కూడా వారు బహిర్గతం చేశారు. జెడికి చంద్రబాల ఫోన్ చేశారని, మళ్లీ అదే చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేశారని, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు.