బెంగళూరు, న్యూస్‌లైన్:
లీటరు పెట్రోలుకు పది కాదు, ఇరవై కాదు ఏకంగా 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించే కారును బెంగళూరుకు చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేశారు. ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ కారును త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆ విద్యార్థులు తెలిపారు. స్థానిక విశ్వేశ్వరయ్య టెక్నికల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ‘టీం ఇన్‌ఫర్నో’ బృందంగా ఏర్పడ్డారు. వీరు తమ ప్రాజెక్ట్‌లో భాగంగా తయారు చేసిన కారుకు ‘ద్రోణ’ అని పేరుపెట్టారు. టీం ఇన్‌ఫర్నో బృందం సభ్యుడు అవినాష్ హెగ్డే సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ‘ద్రోణ తయారీకి ఇప్పటివరకు రూ.2.5 లక్షలు ఖర్చయింది. ఈ కారు గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో కేవలం లీటరు పెట్రోల్‌పై 240 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది’ అని వివరించారు. కాగా, జూలై 4 నుంచి 7వ తేదీ వరకూ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే ‘సపాంగ్ అంతర్జాతీయ కార్ రేసింగ్ మారథాన్’లో ఈ ద్రోణ కూడా దూసుకుపోనుంది. మన దేశం నుంచి ఇలా తయారైన 12 కార్లు కార్ రేసింగ్ మారథాన్‌లో పాల్గొంటాయి.