NEWS

Blogger Widgets

12.6.12

ఈవీఎంలపై అనుమానాలొద్దు


‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్
ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు
తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు తొలి ప్రాధాన్యం.. అనర్హులను తొలగిస్తాం
ఎన్నికల సంస్కరణలపై ఎవరి అభిప్రాయాలనైనా పరిశీలనకు తీసుకుంటాం
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని తీవ్రంగా పరిగణిస్తాం
ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించే ఏ వ్యవస్థనైనా స్వాగతిస్తాం
‘రైట్ టు రిజెక్ట్’పై ఆలోచనలు చేస్తున్నాం

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ స్పష్టం చేశారు. ఈవీఎంల ద్వారా అవకతవకలకు అవకాశం ఉందన్న వాదనను ఇంతవరకు ఎవరూ నిరూపించలేకపోయారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం 18వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సంపత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారీకి తొలి ప్రాధాన్యం ఇస్తామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకున్నామని, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని చెప్పారు. నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైట్ టు రీకాల్ (ఎన్నుకున్న అభ్యర్థిని వెనక్కి పిలవడం) ఆచరణ సాధ్యం కాదని, రైట్ టు రిజెక్ట్ (ఆ అభ్యర్థిని తిరస్కరించడం)పై ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువరిస్తామని తెలిపారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

ప్ర: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా మీ ముందున్న ప్రాధాన్యాలేమిటి?

జ: అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయగలగాలి. ఇందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం మా తొలి ప్రాధాన్యత. తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు మేము ప్రాధాన్యమిస్తాం. ప్రతి ఓటరు ఫొటోతో పాటు సరైన వివరాలు ఓటరు కార్డుపై ఉండేలా చూస్తాం. కార్డులో తప్పులు దొర్లినా వాటిని వెంటనే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తాం. ఇదే సమయంలో ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడమూ ముఖ్యమే. దేశం మొత్తంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు నమోదు ప్రక్రియ సంతప్తికరంగా ఉంది.

ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు చేపడతారు?

ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువవుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మాకు అందిన సమాచారం మేరకు సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక అధికారులను, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై మరింత కఠినంగా వ్యవహరించి ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తాం.

ఎన్నికల సంస్కరణలపై ఏం చేయబోతున్నారు?

ఎన్నికల సంస్కరణలపై ప్రధాన పార్టీలు, ప్రభుత్వం, ప్రజా సంఘాలతో చర్చిస్తాం. సంస్కరణలకు సంబంధించి ఎవరు ఎలాంటి సూచనలు చేసినా స్వీకరించేందుకు సిధ్దంగా ఉన్నాం. రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశాన్ని నిరోధించడానికి, ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకట్టవేయడానికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికల సంస్కరణలు తేవాల్సి ఉంటుంది. ఎన్నికలు స్వచ్ఛంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగకుండా ధనం అడ్డుకుంటోంది. ఇప్పుడు మా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రదర్శనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల వాడకం వంటి చట్టబద్ధమైన కార్యక్రమాల ఖర్చును కొంతవరకు పరిమితం చేయడం. అదే సందర్భంలో.. ఓటర్లను డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు గురిచేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థంగా ఎదుర్కోవడం.

నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎలా కట్టడిచేస్తారు?

నేర చరిత్ర కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడటం మా ప్రాధాన్యాల్లో ఒకటి. ఇటువంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు 20 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిపై నమోదైన కేసులు తేలకపోవడం, నేర చరిత్ర రుజువు కాకపోవడం, కొన్ని కేసులు న్యాయ స్థానాల్లో ఉండటంతో కొంత ఇబ్బంది ఉంది. అయినప్పటికీ, సాధ్యమైనంతవరకు క్రిమినల్స్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకుంటాం. కోర్టులో చార్జిషీటు ఉండి, నేర చరిత్ర ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని ఈసీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చట్టాల రూపకర్తలదే.

ఈవీఎంలు సమర్ధంగా పనిచేస్తున్నాయని ఈసీ పదేపదే చెబుతున్నా, వాటిపై ఇంకా కొందరిలో అనుమానాలున్నాయి. దీనిపై మీరేమంటారు?

ఈవీఎంలపై అనుమానాలు ఉండొచ్చు. కానీ ఈవీఎంలలో రిగ్గింగ్ జరిగిందని ఇంతవరకు ఎవ్వరూ నిరూపించలేకపోయారు. బ్యాలెట్ బాక్స్ ఎంత భద్రమైనదో ఈవీఎంలు అంతే భద్రమైనవి. వీటి ద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు. అయినప్పటికీ కొన్ని పార్టీలు ఈవీఎంలకు అదనంగా ఒక పేపర్ స్లిప్ ఉండాలని సూచించారు. దీన్ని మేము పరిశీలిస్తాం.
ఎన్నికల కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి నూతన వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉందా?

ప్రస్తుతం ఉన్న ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సంతృప్తికరంగా ఉంది. ఎన్నికల కేసులను సంబంధిత సభా కాలం పూర్తయ్యేలోపే పరిష్కరించడానికి అవసరమైన పద్ధతులు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఎన్నికల పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు వంటి ఏ చర్యనైనా స్వాగతిస్తాం.

ఎన్నికల ప్రచార సమయంలో దర్యాప్తు పేరిట అభ్యర్థులను, పార్టీ అధ్యక్షులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా వారి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి చర్యలు సరైనవేనా?

ఈ అంశం ఇప్పటికే మా దృష్టిలో ఉంది. కానీ దర్యాప్తు సంస్థలు కోర్టుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నందున, ఆ అంశం న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయబోము.
రైట్ టు రీకాల్, రైట్ టు రిజెక్ట్‌పై మీ అభిప్రాయం ఏమిటి?

రైట్ టు రీకాల్ ఆచరణ సాధ్యం కాని అంశం. ఇక రైట్ టు రిజెక్ట్ అనే అంశంపై ఆలోచనలు చేస్తున్నాం. దానిపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈవీఎంలో నన్ ఆఫ్ ది అబోవ్ (పైవారెవరు కాదు) అనే బటన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొలీజియం ద్వారానే సీఈసీ ఎంపిక జరగాలన్న కొన్ని పార్టీల డిమాండ్‌పై మీ అభిప్రాయం ఏమిటి?

దీనిపై సరైన సమయంలో స్పందిస్తా. ప్రస్తుత సమయంలో నా ముందున్న బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే నా విధి.

ఎన్నికల్లో ప్రవర్తన నియమావళికి చట్టబద్ధ అధికారాలకు సీఈసీ నో

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రవర్తన నియమావళికి చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలన్న ప్రతిపాదనలకు తాము సానుకూలంగా లేమని కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్ చెప్పారు. నూతన సీఈసీగా సంపత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రవర్తన నియమావళికి చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదన పట్ల ఎన్నికల సంఘం సుముఖంగా లేదు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి చట్టబద్ధమైన అధికారం కల్పిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేగవంతంగా చర్యలు తీసుకోవడానికి తనకున్న అధికారాల్లో కోత పడుతుందని ఈసీ భావిస్తోంది.

ఈ విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సంపత్ సమాధానమిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చాలా సంతృప్తికరంగా పనిచేస్తోంది. ఎన్నికలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నాం. ఎన్నికల నిర్వహణలో ప్రవర్తన నియమావళి ఈసీకి ఒక ప్రభావవంతమైన ఆయుధంగా ఉంది. ఎవరైనా దీనిలో మార్పులు కోరుకొంటే, వాటిపై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంటుంది’’ అని చెప్పారు. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించడం గర్వకారణమని చెప్పారు. ‘‘దేశంలో తొలి ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ల సంఖ్య 17.3 కోట్లు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఈ సంఖ్య 71.4 కోట్లకు చేరింది. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్యకంటే ఇది ఎక్కువ. భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా రూపొందించి, ఇతర పెద్ద దేశాలకంటే ముందు నిలపడంలో మనం చేసిన ప్రయత్నాలు వంద శాతం ఫలించాయి’’ అని చెప్పారు.