న్యూఢిల్లీ Tue, 26 Jun 2012, IST
మూడున్నరేళ్ల క్రితం ముంబయి నగరంపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది సయ్యద్ జబియుద్దీన్ అలియాస్ అబూ హంజాను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
అబూ హంజా జాడల కోసం మూడున్నరేళు ్లగా గాలిస్తున్న నిఘా సంస్థలు అడు గల్ఫ్ నుండి భారత్‌కు వచ్చిన సమయంలో ఈ నెల 21న అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా జెరారు ప్రాంతానికి చెందిన అబూ హంజాపై ఆయుధాలు, పేలుడు పదార్ధాల అక్రమ వినియోగం, ఉగ్రవాద కార్యకలాపాల వంటి అభియోగాలు నమోదైవున్నాయి. దీంతో అతడి కోసం ఇంటర్‌పోల్ నుండి కేంద్ర ప్రభుత్వం రెడ్‌కార్నర్ నోటీసును కూడా అందుకుంది. లష్కరే తోయిబా అగ్రనేతల్లో ఒకరైన అబూ హంజా 2008 నాటి ముంబయి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు హిందీలో మార్గదర్శకత్వం వహించినట్లు అధికారులు చెప్పారు. 'ఈ దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది' అంటూ అబూ హంజా నాడు ఉగ్రవాదులను ప్రోత్సహించినట్లు తెలిపారు.
నిఘా వర్గాలు వెల్లడించిన టేపుల ప్రకారం అబూహంజా నాటి ఉగ్రవాదులకు పాక్ గుర్తింపును దాచి పెట్టి హైదరాబాద్‌లోని టోలీ చౌక్ నుండి వచ్చినట్లు గుర్తింపు సాధించుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో వున్న ఏకైక ఉగ్రవాద అజ్మల్ కసబ్ సైతం తమకు అబూహంజా మార్గదర్శకత్వం వహించినట్లు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. అబూ జిందాల్ పేరుతో నాటి ఉగ్రవాదులకు హిందీ పాఠాలు బోధించిన హంజా అంతకు ముందు బీడ్‌లోని ఇండియన్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతూ 2005 నుండి తప్పించుకుతిరుగుతున్నారు. 2002 గుజరాత్ మతోన్మాదదాడుల తరువాత నిషిద్ధ సిమిలో సభ్యుడిగా చేరిన అబూ హంజా తర్వాత కాలంలో లష్కరే తోయిబా అగ్రనేతగా ఎదిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్‌చేసిన ఉగ్రవాదులను ప్రశ్నించిన కేంద్ర నిఘా సంస్థలు అతడు పాకిస్తాన్‌లోని కరాచీలోనూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉగ్రవాద శిబిరాల నిర్వహణలో అతడు బిజీగా వున్నట్లు తెలుసుకున్నాయి. అంతేకాక మన దేశ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో సైతం అబూహంజా కీలకపాత్ర పోషించినట్లు ఈ సంస్థలు నిర్ధారించుకున్నాయి.