న్యూఢిల్లీ, జూన్ 25: యూపీఏ రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అధ్యక్షతన 10, జనపథ్‌లో సోమవారం ఉదయం జరిగిన సిడబ్ల్యుసి భేటీ ప్రణబ్‌ను అభినందలతో ముంచెత్తింది.
ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ చేసిన సేవలను సోనియా, ప్రధాని మన్మోహన్, ఇతర సభ్యులు కొనియాడారు. మొదటి పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎంతో మంచి పేరు తెస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ పూర్తిగా అర్హుడని సోనియా వ్యాఖ్యానించారు. రాష్టప్రతి పదవికి ప్రణబ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎంత కఠిన బాధ్యత అప్పగించినా ప్రణబ్ ప్రతిభావంతంగా పూర్తి చేసేవారు. అత్యంత బాధ్యతతో వ్యవహరించే వారు’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రణబ్‌ముఖర్జీ లేని కొరత ఎప్పుడూ ఉంటుందని సభ్యులు ఏకె ఆంటోని, మోతీలాల్ వోరా, ఎస్‌సి జమీర్, ఆర్‌కె థావన్, మొహిసీనా కిద్వాయిలు కొనియాడారు. ప్రణబ్ మాట్లాడుతూ తాను పార్టీకి ఇచ్చిన దానికంటే పార్టీ తనకు ఇచ్చింది అత్యధికమన్నారు. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో దాదాపు 40ఏళ్లుగా కొనసాగుతున్న అనుబంధం ఈనాటితో తెగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్‌తో విడిగా చర్చలు జరిపినట్టు చెబుతూ, కేంద్ర మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేస్తున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. 28న నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాష్ట్రాల పర్యటన చేపడతానని ప్రకటించారు. వర్కింగ్ కమిటీలో 1978నుంచి సభ్యుడిగా కొనసాగుతున్న ప్రణబ్‌కు బెంగాలీలు ఇష్టపడే తీపి సందేష్‌తో వీడ్కోలు పలకటం గమనార్హం.