26/06/2012
TAGS:
గత పదహారు నెలలుగా ఈజిప్టు ప్రజలు చేస్తున్న అప్రతిహత పోరాట విజయానికి చిరుదివ్వె లాంటి పరిణామం చోటు చేసుకుంది. నియంత హోస్నీ ముబారక్ గత ఏడాది ఫిబ్రవరిలో-ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో-గద్దె దిగినప్పటి నుంచీ ఈజిప్టులో ప్రజాస్వామ్యానికి తప్పటడుగుల పరిస్థితే అయింది!
ముబారక్ నిష్క్రమణ తర్వాత తాత్కాలికంగా అధికారాన్ని చేపట్టిన సైనిక సుప్రీం మండలి వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. మొదటి సారి అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయించడం సాధ్యం కాకపోవడంతో రెండో సారీ..ఈ పదవికి ముబారక్ విధేయుడుగా భావించిన షాఫిక్, నిషిద్ధ ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ పార్టీకి చెందిన మొహమ్మద్ మోర్సీలు పోటీ పడ్డారు. చివరికి ప్రజాబలం కలిగిన మోర్సీనే విజేతగా ఎన్నిక కావడం ఈజిప్టు ప్రజలకు ఎంతో ఊరట కలిగించిన పరిణామం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సైనిక పాలనకు కొత్త అధ్యక్ష ఎన్నికల ఘట్టం చరమగీతం పడుతుందన్న వారి ఆశలకు ఆక్కడి తాజా పరిణామాలే అద్దం పడుతున్నాయి. దశాబ్దాల పాటు ముబారక్ ఉక్కుపిడికిలిలో నలిగిన ఈజిప్టుకు ప్రజలు ఎన్నుకున్న తొలి అధ్యక్షుడు మోర్సీ..ఆ విధంగా దేశాన్ని ప్రజాకాంక్షకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాల్సిన చారిత్రక ఒక రకంగా చెప్పాలంటే గురుతర బాధ్యత ఆయనపై ఉంది. నిషిద్ధ ఇస్లామిక్ గ్రూపు నాయకుడిగా మొదలైన మోర్సీ జీవితం ఇప్పుడు ప్రజాబలంతో జాతీయ స్థాయిని అందుకుంది. ఏకంగా దేశానికే సారధ్యం వహించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. గత కొన్ని నెలలుగా ఈజిప్టులో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని లోతుగా గమనిస్తే అధ్యక్షుడిగా మోర్సీకి అడుగడుగునా అవరోధాలే ఎదురవుతాయని చెప్పడానికి ఎంత మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..ముబారక్ పాదుగొల్పిన వ్యవస్థ పుణ్యమా అని ఈజిప్టు అంతా సవాళ్ల మయంగానే ఉంది. అధ్యక్షుడిగా మోర్సీ ఎన్నికను హర్షించినప్పటికీ తాత్కాలికంగా అధికారాల్ని చేపట్టిన సైనిక మండలి అంత తేలిగ్గా పగ్గాలు వదులుకుంటుందా అన్నది ప్రాథమికంగా తలెత్తే సందేహం. ముబారక్ జైలుపాలైన తర్వాత సైనిక మండలి వ్యవహరించిన తీరు ఇందుకు అనేక రకాలుగా ఆస్కారం ఇచ్చింది. అధ్యక్ష ఎన్నికల తుది ఫలితం వెలువడే వరకూ..మోర్సీ కంటే ముబారక్ విధేయుడైన షాఫిక్‌కే అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి.ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నాటి నుంచీ కూడా అందరి దృష్టి అధ్యక్ష ఎన్నికల అంతిమ ఫలితంపైనే కేంద్రీకృతమై ఉంది. సైనిక మండలి కూడా అందిన కాడికి అధికారాలను ధారాదత్తం చేసుకుంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా అతడి హోదా నామమాత్రమేనన్న చందంగా పరిస్థితుల్ని మార్చేందుకే ప్రయత్నించింది. ఆ విధంగా చూస్తే సైనిక జనరళ్లను తనవైపు తిప్పుకోవడం అన్నది మోర్సీకి అంత తేలికైన విషయం కాదు. ఆ మాట అలా ఉంచితే..తన ప్రత్యర్థి షాఫిక్‌కు ఓటేసిన కోట్లాది మందిని కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత మోర్సీదే. ముఖ్యంగా ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ సంకుచిత లక్ష్యాలకే తాము పరిమితం కావడం లేదని, దేశ ప్రజలందరి బాగోగులే తన లక్ష్యమని రుజువు చేసుకోవడం కూడా కొత్త అధ్యక్షుడికి అంత తేలికేమీ కాదు. దేశాన్ని సమైక్యంగా ఉంచడంతో పాటు అన్ని వర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని పెంపొందించడం కూడా కష్ట సాధ్యమే. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే వ్యక్తి అధ్యక్షుడయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ మోర్సీ కార్యకలాపాలను, నిర్ణయాలను భూతద్దంలో చూస్తారన్న నిపుణుల వ్యాఖ్యలు ఈజిప్టు తాజా పరిస్థితికి అద్దం పట్టేవే. అధ్యక్షుడిగా ఎన్నికైతే అయ్యారు గానీ..మీద పడేందుకు పొంచి ఉన్న సవాళ్లన్నింటినీ అంతే ధీమాగా ఎదుర్కొనే సత్తా మోర్సీకి ఉందా అన్నది సమీప భవిష్యత్‌లో ఆయన తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. పైగా..అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ఆలోచన మోర్సీకి ఎంత మాత్రం లేదు. ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ మొదటి అధ్యర్థి ఖైరత్ అనర్హత కారణంగా వైదొలగడంతో ఆ బాధ్యత మోర్సీపై పడింది. ఆ కోణంలో చూస్తే ఇది మోర్సీకి అనుకోని..ఒక రకంగా చెప్పాలంటే ఊహించని భారమే. అధ్యక్షుడిగా ఆయనకు ఎదురయ్యే సవాళ్లు ఎంతో దూరంలో లేవు. సైనిక మండలి రద్దు చేసిన పార్లమెంట్‌ను పునరుద్ధరించేలా చేయడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. గతవారమే రద్దయిన పార్లమెంట్ పునరుద్ధరణ కోసం తహ్రీర్ స్క్వేర్ మళ్లీ నినాదాలతో మార్మోగిపోతోంది. వారి ఆశలు నెరవేర్చాలంటే సైనిక మండలిని తన దారికి తెచ్చుకోక తప్పదు.
పార్లమెంట్‌ను పునరుద్ధరించాలని చెప్పకుండానే..మోర్సీ అంత పనీ చేశారు. ఎన్నికైన పార్లమెంట్ ముందే తాను దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తానని ఆయన స్పష్టం చేయడం..సైనిక మండలి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే అయింది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చిన సైనిక జనరళ్లకు ఆ విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆర్థికంగా అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఈజిప్టును గాడిలో పెట్టడంతో పాటు పాలనా పరంగా కూడా మోర్సీకి గుదిబండ లాంటి సమస్యలే ఉన్నాయి. ఇప్పటి వరకూ ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీని వ్యతిరేకించిన వారందరినీ ఒకే తాటి పైకి తేవడం ద్వారా మాత్రమే దేశంలో సవ్యమైన పాలన అందించే అవకాశం ఉంటుంది. అంతకు మించిన స్థాయిలో ముబారక్ నుంచి వచ్చిన బ్యూరాక్రసీ. అక్కడి అధికార గణాల్ని దారిలోకి తేవడం..తద్వారా పాలనాపరంగా అవరోధాలు తొలగించుకోవడమూ మోర్సీకి నల్లేరుపై నడకేమీ కాదు. దూకుడుగా పోకుండా ఇతర పార్టీల నేతలందరినీ ఆకట్టుకోవడంలోనే మోర్సీ విజయం ఆధారపడి ఉంటుంది. తాను ఇస్లాం పార్టీకే ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న అభిప్రాయానికి అతీతంగా వ్యవహరించడం ద్వారానే మోర్సీ ఈ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతల మద్దతును స్వీకరించేందుకే ఆయన అత్యధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ పార్టీ విశ్వాసాన్ని చూరగొని పాలనాపరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నాల్లో ఏ మాత్రం లోపమున్నా..ఎలాంటి అనుమానాలు తలెత్తినా అది ఆయన ప్రభుత్వ పతనానికే దారితీస్తుందన్న పరిశీలకుల హెచ్చరికలను ఎంత మాత్రం బేఖాతరు చేయడానికి వీల్లేదు. ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ నుంచి తప్పుకున్నా..ఆ పార్టీతో మోర్సీ సంబంధాలు ఎలా ఉన్నాయన్న దానిపై నిరంతర పరిశీలన జరుగుతూనే ఉంటుందన్న వాస్తవాన్నీ విస్మరించడానికి వీల్లేదు. సమస్యలు, సవాళ్ల కూపంగా ఉన్న ఈజిప్టులో అధ్యక్ష పదవి నిర్వహణ అంత తేలికేమీ కాదు..ముఖ్యంగా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేస్తున్న దేశానికి ప్రజా ప్రతినిధిగా సారధ్యం వహించడం కత్తిమీద సామే!