NEWS

Blogger Widgets

13.6.12

పోలింగ్ 78.49 శాతం



హైదరాబాద్, జూన్ 12: ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు వినా మిగిలిన పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 18 అసెబ్లీ స్థానాల్లో సరాసరిన 78.49 శాతం పోలింగ్ నమోదు కాగా, నెల్లూరు లోక్‌సభ స్థానంలో 70శాతం మేరకు పోలింగ్ జరిగింది. అత్యధికంగా నర్సాపురంలో 88.77శాతం, అతి తక్కువగా తిరుపతిలో 54.07శాతం పోలింగ్ శాతం నమోదైంది. స్థానిక సమస్యలపై నాలుగు గ్రామాల్లో వోటర్లు ఎన్నికలను బహిష్కరించగా, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున క్యూకట్టారు. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యాయంటూ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. తమవద్ద ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని, కొన్నిచోట్ల కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరుంటే ఇతర కుటుంబీకుల పేర్లు లేవంటూ ఫిర్యాదులు వచ్చాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉదయం ఎనిమిది గంటలనుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో, ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపించింది. అయితే అనేక ప్రాంతాల్లో ఇవిఎంలు సక్రమంగా పనిచేయకపోవడంతో వాటిని మార్పు చేసి ఎన్నికలు కొనసాగించాల్సి వచ్చింది. ఇక ఎక్కడేం జరిగినా వెంటనే తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ కెమేరాలు కొన్నిచోట్ల పని చేయకపోవడం, ఇంకొన్ని ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారే కెమేరాలను ఆపుచేయడం జరిగినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు.
మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి అనేక స్థానాల్లో 75నుంచి 80శాతం వరకూ పోలింగ్ నమోదైంది. ఇది ఊహించని విధంగా ఉండటంతో అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ సరళి ఎవరికి లాభిస్తుందో, ఎవరికి చేటు తెస్తుందో అర్ధంకాక పార్టీ నేతలు, అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. స్థానికంగా ఉన్న తమ గ్రామ సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని రాజపాలెం, చౌదరిపాలెంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించగా, పోలవరం నియోజకవర్గంలోని చింతపల్లి, తుంబలూరు గ్రామాల్లోనూ ఎన్నికలను బహిష్కరించారు. అయితే బరిలో ఉన్న అభ్యర్థుల్లో తాము మద్దతు పలికే పార్టీకి చెందిన అభ్యర్థులు లేకపోవడం వల్ల తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు అక్కడి ప్రజలు వెల్లడించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప ఎన్నికలను అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. కడప జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయాల్సివచ్చింది. ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒంగోలులోనూ చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఒంగోలు నియోజకవర్గంలోని 60వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటువేసే రహస్య ప్రాంతంలోకి వెళ్లి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఒక మైక్రో అబ్జర్వర్, ప్రిసైడింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. వారిని వెంటనే ఎన్నికల విధులనుంచి తప్పించి వేరే అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వారిద్దరిపై చర్యలు తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ కేసులో ఇరుకున్న ఇద్దరు అధికారుల పేర్లూ శేషగిరిరావే కావడం విశేషం.
ఇలావుండగా, పోలింగ్ స్టేషన్ల వద్దే క్యూలో ఉన్న ఓటర్లను తమకు ఓటు వేయాలంటూ ప్రచారం చేసిన తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకరరెడ్డి, నెల్లూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డిలపై కేసు నమోదు చేస్తున్నట్టు భన్వర్‌లాల్ వెల్లడించారు.