న్యూఢిల్లీ, జూన్ 12: రాష్టప్రతి పదవికి యూపీఏ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. రాష్టప్రతి పదవికి యూపీఏ అభ్యర్థిత్వంపై చర్చలు జరపనున్నారు. కొత్త రాష్టప్రతి వ్యవహారంపై మమతా బెనర్జీతో ఒక అవగాహన కుదరగానే సోనియాగాంధీ యూపీఏ అభ్యర్థి పేరు ప్రకటించొచ్చని చెబుతున్నారు. సోనియా ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి మమతా బెనర్జీ ఢిల్లీ చేరుకున్నారు. మమతతో చర్చలు పూరె్తైన తరువాతనే రాష్టప్రతి పదవికి పోటీ చేసే యూపీఏ అభ్యర్థి వ్యవహారం కొలిక్కి వస్తుందనేది అందరికి తెలిసిందే. యూపీఏ తరపున లోకసభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల బరిలోకి దిగుతారని వార్తలు రావటం తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ అకస్మాత్తుగా అఫ్గానిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. రాష్టప్రతి పదవికి యూపీఏ తరపున పోటీ చేయవలసి వస్తున్నందుకే, ఆయన అఫ్గాన్ పర్యటనను రద్దు చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. సోనియా ఇప్పటికే డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి, ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు, కేంద్ర విమానయాన మంత్రి అజిత్‌సింగ్‌లతో యూపీఏ అభ్యర్థిత్వంపై చర్చలు జరపటం తెలిసిందే. సోనియా సలహామేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో కొత్త రాష్టప్రతి ఎంపిక గురించి సమాలోచనలు జరపటం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ వినా మిగతా అన్ని యూపీఏ భాగస్వామ్య పార్టీలు రాష్టప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని సమర్థించటం తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీని రాష్టప్రతిగా ఎంపిక చేయటంపై మమతా బెనర్జీ ఇంతవరకు అధికారికంగా ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం గమనార్హం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడేందుకు కేంద్రం పెద్దఎత్తున ఆదుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయటం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికను కేంద్రం బెంగాల్‌కు అందించే ఆర్థిక సాయంతో మమత ముడిపెట్టడంతో పరిస్థితి కొంత జఠిలంగా తయారైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 22వేల వేల కోట్ల రూపాయల వడ్డీ బకాయిలు చెల్లించవలసి ఉంది. ఆ మొత్తాన్ని మాఫీ చేయాలని మమతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు ఈ విధామైన ఆర్థిక సాయం అందిస్తే, రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్లు చేసేందుకు అవకాశం ఉన్నందున కేంద్రం ఈ విషయంలో జాగరూకతతో అడుగులేస్తోంది. మమతా బెనర్జీ మాత్రం తమ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంటేనే రాష్టప్రతి ఎన్నికలో యూపీఏ అధినాయకత్వం ఎంపిక చేసే అభ్యర్థిని సమర్థిస్తామన్న మొండి పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా సోమవారం ఢిల్లీకి వచ్చి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌ను ఆర్థిక సంక్షోభం నుండి కాపాడేందుకు పెద్దఎత్తున ఆర్థికసాయం చేయాలని విజప్తి చేశారు. మీరు రాష్టప్రతి కావాలని కోరుకుంటున్నాము. దీంతోపాటు రాష్ట్రం కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడాలని ఆశిస్తున్నామని ఆమిత్ మిత్రా ఆయనతో అన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రాష్టప్రతి ఎన్నికను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆర్థిక సహాయం డిమాండ్‌తో ముడిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఇది మంచి పద్ధతి కాదని సోనియా భావిస్తున్నారు. రాష్టప్రతి ఎన్నికతో ముడి పెట్టకుండా ఆర్థిక సాయం వ్యవహారాన్ని విడిగా పరిష్కరించు కోవాలని సోనియా గాంధీ వాదిస్తున్నట్టు తెలిసింది. ఆమె బుధవారం మమతా బెనర్జీతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పే ఆవకాశాలు ఉన్నాయ. పశ్చిమ బెంగాల్‌ను ఆదుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నా, దీన్ని రాష్టప్రతి ఎన్నికతో ముడిపెట్టకూడదని సోనియా ఆమెకు విజప్తి చేయనున్నారు. మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్టప్రతి పదవికి యూపీఏ అభ్యర్థి ఎంపిక పూర్తయ్యేందుకు అవకాశం కలగటంతో పాటు, పశ్చిమ బెంగాల్‌కు ఆర్థిక సాయం చేయటం కూడా ఒక కొలిక్కి వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.