NEWS

Blogger Widgets

13.6.12

ఉప రాష్టప్రతి పదవిపై బిజెపి కన్ను


న్యూఢిల్లీ, జూన్ 12: రాష్టప్రతి పదవిని కైవసం చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుండగా, ఉప రాష్టప్రతి పదవిని దక్కించుకోడానికి బిజెపి తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉప రాష్టప్రతి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జస్వంత్ సింగ్ మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. రాజ్యసభలో పాలక పక్షానికి పూర్తి మెజారిటీ లేకపోవడం, ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు కూడా రాజ్యసభలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తుండటంతో బిజెపిలో కొత్త ఆశలు చిగురించాయి. ఉప రాష్టప్రతి పదవికి పోటీ చేసిన పక్షంలో పాలక పక్షానికి గట్టిపోటీ ఇవ్వగలమన్న ధైర్యంతో ఆ పార్టీ ఎన్నికల గోదాలో దిగాలని భావిస్తోంది. పార్టీ అగ్రనాయకుడు అద్వానీ సహా అనేక మంది సీనియర్లతో సంప్రదించిన తరువాతే జస్వంత్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేతను కలిశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిసి ఉప రాష్టప్రతిని ఎన్నుకుంటారు. లోక్‌సభలో 552మంది, రాజ్యసభలో రెండు వందల యాభై మంది సభ్యులున్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నందున రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత మెజారిటీ లేనందున భావసారుప్యతగల పార్టీల సాయంతో ఉప రాష్టప్రతి పదవిని దక్కించుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు. అన్ని పార్టీల నాయకులతో జస్వంత్ సింగ్‌కు సత్సంబంధాలున్నాయి. రాజ్‌పుట్ వర్గానికి చెందిన జస్వంత్ సింగ్ దివంగత ఉపరాష్టప్రతి భైరాన్ సింగ్ షెకావత్ మాదిరి ఉప రాష్టప్రతి కావాలని ఆశిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్‌తో పది నిమిషాలపాటు జస్వంత్ సమాలోచనలు జరిపారు. యోగా గురువు బాబారాందేవ్‌తో ములాయం సమాలోచనలు జరుపుతున్న సమయంలో జస్వంత్ సింగ్ అక్కడికి చేరుకున్నారు. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతును కోరటానికి ములాయం వద్దకు వచ్చిన రాందేవ్‌తో జస్వంత్ కాసేపు మర్యాద పూర్వకంగా చర్చించారు. ఉప రాష్టప్రతి పదవికి జరిగే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా ములాయం సింగ్‌ను కోరినట్లు జస్వంత్ చెప్పారు. (చిత్రం) ఢిల్లీలో మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో మంతనాలు జరిపిన అనంతరం బయటకు వస్తున్న యోగా గురువు బాబారాందేవ్