NEWS

Blogger Widgets

13.7.12

రాహుల్... ఒక పేలని తూటా


బీజేపీ నేత యశ్వంత్ సిన్హా విమర్శ
7/13/2012 12:30:00 AM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని ఒక ‘పేలని తూటా’గా బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అభివర్ణించారు. ‘రాహుల్ గాంధీ ఒక పేలని తూటా... ఓటర్లను ఆకట్టుకోగల సత్తా ఆయనకు లేదు. ఆ సంగతి ఇప్పటికే రుజువైపోయింది’ అని సిన్హా వ్యాఖ్యానించారు. వచ్చే 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కాగలరన్న అంచనాలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీలో గురువారం ఒక వార్తాసంస్థతో సిన్హా మాట్లాడుతూ,‘రాహుల్‌కు ఏమాత్రం అనుభవం లేదు, అన్ని అంశాలపైనా పట్టుకూడా లేదు. అలాంటిది, కాంగ్రెస్‌ను రాహుల్ ఏవిధంగా ముందుకు నడిపిస్తారు?’ అని ప్రశ్నించారు......

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఇప్పుడే ఎవరినీ ప్రకటించాల్సిన పనిలేదని, ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూర్చగలిగే వ్యక్తినే ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలని యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ‘బీజేపీ తన ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించాల్సిన అవసరం లేదు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటేనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా మోడీ, రాహుల్‌ల నడుమనే పోటీ ఉంటుందనే ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. మరో 22 నెలలకు జరగబోయే ఎన్నికలపై ఇప్పుడే వ్యాఖ్యలు చేయడం తొందరపాటే అని, ఇదంతా మీడియా చేస్తున్న ప్రచారమని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీలో చర్చ జరగడం లేదని తెలిపారు. ‘2002 మతకల్లోలాల తర్వాత మోడీని నేరస్తుడిగా ఒక వర్గం మీడియా అభివర్ణించింది. ఇప్పుడు ఆయనను ప్రధాని అభ్యర్థిగా అదే మీడియా ప్రచారం చేస్తోంది’ అని అన్నారు. ప్రధాని అభ్యర్థిపై బీజేపీ సరైన సమయంలో నిర్ణయిస్తుందని అన్నారు.

అది నితీశ్ అభిప్రాయం: లౌకిక భావాలు గల వ్యక్తినే ఎన్డీఏ సారథిగా ప్రకటించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, అది నితీశ్ అభిప్రాయమని సిన్హా బదులిచ్చారు. ‘అసలు లౌకికవాదం అంటే ఏమిటో ఎవరైనా చెబితే బాగుంటుంది. ఇద్దరు పెద్ద నేతలు మాట్లాడుతున్నప్పుడు నాలాంటి చిన్న నాయకుడు మౌనంగా ఉండటమే మేలు’ అని సిన్హా వ్యాఖ్యానించారు.