NEWS

Blogger Widgets

13.7.12

దారా సింగ్ కన్నుమూత


బుల్లి తెర హనుమంతుడు, బాలీవుడ్ తొలితరం సూపర్ హీరో, పేరు గాంచిన మల్లయోధుడు దారాసింగ్(83) కన్నుమూశారు.
7/13/2012 12:26:00 AM
ముంబైలో తుది శ్వాస విడిచిన బుల్లితెర హనుమంతుడు

ముంబై, న్యూస్‌లైన్: బుల్లి తెర హనుమంతుడు, బాలీవుడ్ తొలితరం సూపర్ హీరో, పేరు గాంచిన మల్లయోధుడు దారాసింగ్(83) కన్నుమూశారు. కుస్తీపోటీల్లో ఏనాడూ ఓటమి ఎరుగని దారాసింగ్.. మృత్యువుతో జరిగిన తుదిపోరులో తలవంచారు. అనారోగ్యంతో గత ఐదు రోజులుగా ఆస్పత్రిలో ఉన్న ఆయన గురువారం ఉదయం 7.30 గంటలకు ముంబై జూహూలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఈ నెల 7న ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలోని అత్యవసర చికిత్సా విభాగంలో చేరిన దారాసింగ్ ఆరోగ్యం రోజురోజుకీ విషమించింది......

ఆయన మెదడు బాగా దెబ్బతిందని.. కోలుకునే అవకాశాలు తక్కువని కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు తేల్చిచెప్పడంతో.. తుది ఘడియల్లో ఆయన వద్ద ఉండేందుకు వీలుగా.. బుధవారం రాత్రే దారాసింగ్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం ఏడున్నరకు ఆయన కన్నుమూసినట్లు కోకిలాబెన్ ఆస్పత్రి సీవోవో డాక్టర్ రామ్ నారాయణ్ తెలిపారు. ‘ఆయన చాలా మొండోడు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన శరీరం బలహీనపడటం ప్రారంభించింది. ఆయన ఆత్మ నింగికెగసింది. ఆయన ఆకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తారు’ అని దారాసింగ్ తనయుల్లో ఒకరైన విందూ దారా సింగ్ అన్నారు.

దారాసింగ్‌కు మొత్తం ఆరుగురు సంతానం. దారాసింగ్ బాలీవుడ్ తొలితరం యాక్షన్ హీరోగా పేరుగాంచారు. ఆయన తొలి చిత్రం సంగ్‌దిల్(1952). షర్ట్ తీసి.. కండలు చూపించే స్టైల్‌కు ఆద్యుడు ఆయనే. 1959లో జగ్గా ఢాకూ అనే చిత్రానికిగానూ జాతీయ స్థాయి పురస్కారం పొందిన దారాసింగ్.. 1978లో పంజాబ్‌లోని మొహాలీలో దారా స్టూడియోను నిర్మించారు. చివరి సారిగా ‘జబ్ వియ్ మెట్’(2007) సినిమాలో కనిపించారు. ఇందులో కరీనాకపూర్ తాతగా ఆయన నటించారు. ఇక ‘రామాయణం’ సీరియల్‌లో హనుమంతుడి పాత్ర ద్వారా ఆయన దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ప్రముఖుల సంతాపం..
దారాసింగ్ మృతితో హిందీ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రధాని మన్మోహన్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దారాసింగ్ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకుడిగా నిలిచారని మన్మోహన్ కొనియాడారు. మల్లయుద్ధం, నటనా రంగంలో దారాసింగ్ చెరిగిపోని ముద్ర వేశారని అద్వానీ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్, టబూ, బాబీ డియోల్, మనోజ్ కుమార్ తదితరులు దారాసింగ్ నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మధ్యాహ్నం పవన్ హన్స్ శ్మశానవాటికలో దారాసింగ్ అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది అభిమానులతోపాటు బాలీవుడ్ ప్రముఖులు రిషీకపూర్, ఫర్దీన్‌ఖాన్, సాజిద్ ఖాన్, పర్మీత్ సేథీ, ధీరజ్‌కుమార్ తదితరులు అంత్యక్రియలు హాజరయ్యారు. బాలీవుడ్ మహాబలుడికి వారు కన్నీటి వీడ్కోలు పలికారు.

200 కిలోల కింగ్‌కాంగ్.. గాల్లో గిరగిరా..
200 కిలోల మహాకాయుడిని ఎవరైనా అలవోకగా గాల్లో గిరగిరా తిప్పగలరా? సినిమాల్లో కాదు.. నిజజీవితంలో.. తిప్పగలరు. దారాసింగ్ తిప్పగలరు. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయిన అత్యంత రోమాంచిత కుస్తీ పోటీల్లో పాల్గొని.. దారాసింగ్ అజేయుడిగా నిలిచారు. వాటిల్లో ఆస్ట్రేలియాకు చెందిన కింగ్‌కాంగ్ అనే మహాకాయుడిని ఆయన గాల్లో గిరగిరా తిప్పిన అరుదైన ఘటనను ఇప్పటికీ అందరూ కథలుకథలుగా చెప్పుకుంటారు. 1950ల్లో ఏం జరిగిందంటే.. కింగ్‌కాంగ్(బరువు 200 కిలోలు), దారాసింగ్(130 కిలోలు) మధ్య కుస్తీ పోటీ. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇంతలో దారాసింగ్ ఒక్కసారిగా కింగ్‌కాంగ్‌ను రెండు చేతులతో గాల్లోకి లేపారు. ఆయన బలాన్ని చూసి.. అందరూ నోరెళ్లబెట్టారు. ఇక కింగ్‌కాంగ్ అయితే.. రిఫరీని చూసి.. ఆర్తనాదాలు చేశాడు. ఇలా గాల్లోకి ఎత్తడం.. నిబంధనల్లో భాగం కాదని వాపోయాడు. దారాను ఆపడానికి రిఫరీ వస్తుండగా.. కింగ్‌కాంగ్‌ను ఆయన రింగ్ నుంచి బయటకు విసిరేశారు.

ఈ సింగ్.. కుస్తీ కింగ్..
పంజాబ్‌లోని దర్ముచక్‌లో జన్మించిన దారాసింగ్ భారతీయ శైలి మల్లయుద్ధంలో(పెహల్వానీ) శిక్షణ పొందారు. దారాసింగ్ కుస్తీ పట్టారంటే.. ప్రత్యర్థికి సుస్తీ చేయాల్సిందే. కుస్తీ పోటీల్లో ఆయనకు ఓటమి అంటే తెలియదు. అప్పటి సంస్థానాల రాజులు తమ ప్రాంతాల్లో నిర్వహించే కుస్తీ పోటీల్లో పాల్గొనాలంటూ ఆయనకు ప్రత్యేక ఆహ్వానాలు పంపేవారు. దారాసింగ్ 1947లో సింగపూర్ వెళ్లారు. కౌలాలంపూర్‌లో తార్లోక్ సింగ్‌ను ఓడిం చడం ద్వారా మలేషియా చాంపియన్(భారతీయ శైలి మల్లయుద్ధం)గా నిలిచారు.


కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు ఆయన అనేక దేశాల్లో పర్యటించారు. 1952లో భారత్‌కు తిరిగొచ్చారు. 1953లో భారత చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 1959లో కెనడా చాంపియన్ జార్జ్ గోర్డింకోను ఓడించడం ద్వారా కామన్‌వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌ను సాధించారు. 1968లో అమెరికాకు చెందిన లౌ థెజ్‌ను ఓడించి.. ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. ప్రపంచంలో పేరెన్నికగన్న వస్తాదులందరితోనూ ఆయన పోరాడారు. తన ప్రత్యర్థులను వారి దేశాల్లోనే ఓడించిన ఘనత దారాసింగ్‌కు మాత్రమే సొంతం. ఆయన 1983లో రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యారు. 1996లో ఆయన పేరును రెజ్లింగ్ అబ్జర్వర్ న్యూస్‌లెటర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు.