NEWS

Blogger Widgets

18.6.12

ఆలస్యం వద్దు - తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు



హైదరాబాద్‌ (వి.వి) : తాత్కాళిక విరామం అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. పరకాలలో మరోసారి తెలంగాణవాదం నెగ్గడం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఊతమిచ్చింది. పరకాలలో హోరా హోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో పోటీపడక పోయినప్పటికీ కనీసం డిపాజిట్‌ కూడా సాధించుకోక పోవడం, చివరకు తెలంగాణవాదమే విజయం సాధించడం వారికి కలిసివచ్చింది. పార్టీ అధిష్టానం వద్ద మరోసారి తమ వాదనను వినిపించేందుకు పరకాలలో వచ్చిన ఫలితం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు వజ్రాయుధంగా మారింది. ఇలాగే టిఆర్‌ఎస్‌ గెలుచుకుంటూ పోతే పార్టీ, తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో ఇక ఆలస్యం చేయకుండా ఫలితాలు వచ్చిందే తడువుగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తమ భేటీల పరంపరకు తెరతీశారు. ఇక తెలంగాణ ఉద్యమ కాలం మొదలైందని, ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, అధిష్టానంపై ఒత్తిడి తేవాలని, తాడోపేడో తేల్చుకోవాలని వారు నిర్ణయించు కున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు శనివారం సాయంత్రం పార్టీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు డా|| కె.కేశవరావు నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంద జగన్నాధం, పొన్నం ప్రభాకర్‌లతోపాటు రాష్ట్ర మంత్రి కె.జానారెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో డా|| కె.కేవశరావు మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని, ఎంత త్వరగా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌కు అంత మంచిదన్నారు. తెలంగాణ శక్తులన్నీ ఏకమై అన్ని జెండాలను పక్కనబెట్టి తెలంగాణయే ఏకైక ఎజెండాగా ముందుకుసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు సహనం కోల్పోయారని అది పరకాల ఉప ఎన్నికల్లో మరోసారి స్పష్టమైందన్నారు. ఈ ఎన్నికల్లో బలవంతులెందరో పోటీలో నిలిచినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు రాజీపడలేదని, తెలంగాణ వాదాన్ని మాత్రమే గెలిపించుకున్నారని అన్నారు. తద్వారా అందరూ తెలంగాణవాదానికి అనుకూలంగా ఉన్నారని తేలిపోయిందన్నారు. తెలంగాణ విషయంలో పార్టీ జాప్యం చేస్తుండడం వల్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదని, తమను ప్రజలు దోషులుగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ముందు తమ వాదనను మరోసారి వినిపిస్తామని, తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరతామని, అలా నిర్ణయం తీసుకునేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. అధిష్టానాన్ని ఒప్పించగలమనే విశ్వాసం తమకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ జెఎసిలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు తెలంగాణ శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరముందని, ఆ శక్తులన్నీ తాము చేసే ప్రయత్నాలకు సహకరించాలని డా|| కేశవరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణాకు సంబంధించిన అన్ని విషయాలు, ఉద్యమం గురించి అన్ని విషయాలు ప్రణబ్‌ ముఖర్జీకి తెలుసునని, ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత తెలంగాణవాదానికి సహకరిస్తారని తాను విశ్వసిస్తున్నామని డా|| కేశవరావు చెప్పారు. తెలంగాణపై ఇప్పటికైనా కళ్లు తెరవాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పరకాల ఫలితం చూసైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణపై అభిప్రాయం మార్చుకోవాలని తాము కేంద్రమంత్రి వాయలార్‌ రవికి సూచిస్తామని మందా జగన్నాథం చెప్పారు.